2515* వ రోజు.......           24-Aug-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను అనివార్యంగా మానేద్దాం!

35 మంది గ్రామ బాధ్యుల శ్మశాన మెరుగుదల కృషి - @2515*

          నిన్న అనుకొన్నట్లే - ఈ బుధవారం వేకువ 4.19 కే మొదలైన డజను మంది కార్యకర్తల -4.30 కు మరో డజను మంది గ్రామస్తుల – ఆ పైన వచ్చి కలిసిన మొత్తం మూడు డజన్ల బాధ్యుల శ్రమదానం కొంత సందడి గాను, క్రమపద్ధతిగాను విజయవంతమైంది! హిందూ శ్మశానవాటిక మరింత శుభ్రపడింది!

          వ్యష్ట ప్రయోజనాలు తప్ప ఉమ్మడి బాధ్యతలు మరిచిపోయిన ఈ తెలివి మీరిన కాలంలో -  వేకువ 4.00 కే లేచి, శ్మశానపు సెంటిమెంట్లను ప్రక్కకు పెట్టి, ఊరి మొత్తం కర్తవ్యాన్ని పట్టించుకొన్న ఈ 35 మందీ అభివందనీయులు!

          ఈ చీకటి వేళ ఒక కార్యకర్త నిర్ణయంగా కాలక మిగిలిన ఎవరిదో పుర్రెను పైకెత్తి చూపుతున్నాడంటే – ఒక 68 ఏళ్ళ వృద్ధ కార్యకర్త పని సమయంలో - కత్తి గురి తప్పి, కాలు తెగినా కట్టు కట్టుకొని మళ్ళీ పని కొనసాగించాడంటే – అక్కడ దోమలే కుడుతున్నాయో, పురుగులే ముట్టుకొంటాయో ఆలోచించక ఆరేడుగురు మునుములు పట్టి – పిచ్చి కంపల్ని కోసి, పీకి, శ్రమిస్తున్నారంటే – అటు పొలం ప్రక్క ఐదారుగురు ముళ్ళ చెట్లను, తీగల్నీ, దురద గొండి మొక్కల్నీ వంచిన నడుమెత్తక తొలగించడమంటే....ఇదంతా చల్లపల్లికే ప్రత్యేకమైన ఒక సామూహిక శ్రమదాన మహిమే సుమా!

          ఇక్కడ ఎన్ని వేల రోజుల్నుండో బహుళార్థ సాధక శ్రమ వేడుక జరుగుతూనే ఉన్నది. మైకు నుండి గంటన్నర పాటు సామాజిక బాధ్యతను గుర్తు చేసే పాటలు వినిపిస్తూనే ఉంటాయి! చలపల్లి స్వచ్చ – సుందరోద్యమం అంటే – కుల, మత, జాడ్యాలు సోకని - త్యాగాన్ని - కాస్త మంచితనాన్నో గుర్తుకు తెచ్చే ఒక కార్యక్రమమన్న మాట!

          6.20 వేళ మన స్వచ్ఛ – శుభ్ర - సౌందర్య కర్తవ్య ప్రబోధాత్మక నినాదాలను బాగా వినిపించినది ఒక విద్యార్థి మిత్రుడు - పసుపులేటి శ్రీనివాసుడు! చిల్లల వాగు గట్టు వైపు మిగిలిపోయిన రుద్రభూమి భాగాన్ని రేపటి వేకువ శుభ్రపరచాలనే దాసరి రామకృష్ణుని ప్రతిపాదనను సహర్షంగా సమర్ధించినవారు 35 మంది కార్యకర్తలు!

          కనుక - మన రేపటి పునర్దర్శనం మరొక మారు ఈ హిందూ శ్మశానవాటికలోనే!

- నల్లూరి రామారావు,

   24.08.2022.