2516* వ రోజు..........           25-Aug-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను అనివార్యంగా మానేద్దాం!

అనితర సాధ్యంగా చెప్పదగిన కఠిన శ్రమదానం - @2516*

        25-8-22 (గురువారం) వేకువ జరిగిన ఆ కాయకష్టం మళ్ళీ హిందూ శ్మశానవాటికలో చిల్లలవాగు గట్టు వైపే! అందుకు పాల్పడింది 26 మందే! పని మొదలైన 10 నిముషాలకే సగం మంది బట్టలు చెమటకు తడవడం, ముఖాలు - చేతులు, స్వేదంతో తళతళ మెరవడం, ఐనా వదలక గంటన్నరకు పైగా వాళ్ల పోరాటం, ఇదంతా ఎవరి స్వార్దానికో కాక ఊరంతటి ప్రయోజనార్ధం జరగడం ఏ సాహిత్యకారులకైనా ఇంతకన్న మంచి కవితా వస్తువు దొరుకుతుందా!

        అసలే అది శ్మశానం! దోమల ఉత్పత్తి కేంద్రాలైన మాచర్ల కంప, బాగా వేళ్లూనుకొన్న పిచ్చి ముళ్ల దురదగొండి మొక్కలూ తీగలూ, వాటికి పట్టిన పురుగులూ, ఒక్కో మొక్కను ఒకటి కాదు -  రెండు బలమైన దెబ్బలతో నరకడం - దానికి తోడు ఉక్క వాతావరణం ఐనా సరే పట్టువదలని విక్రమార్కుల్లా - వంగొని, మోకాళ్ల మీద కూర్చుని చేసిన శ్రమదానం! చేసే వాళ్ల సంగతేమో గాని - చూసే నాబోటి వాళ్లకు మాత్రం ఒళ్ళు జలదరించింది!

        ఐతే - ఇదేదో ఈ ఒక్కనాటి కథకాదే! ఊళ్లో 2516* దినాలుగా ఊరి ఒక్కొక్క భాగంలో తీరుతున్న వ్యథ! దేశ సరిహద్దుల్లో మంచుకొండా కోనల్లోని దేశ రక్షక సైనికుల నిత్య కర్మల వంటి ఈ ఊళ్లో నిత్యమూ జరుగుతున్న వర్తమాన చరిత్ర!

        ఈ రోజు ముగియాలని అంచనా వేసిన శ్మశాన కర్తవ్యం కొందరు కార్యకర్తల రాలేమి వల్ల అసంపూర్ణమయింది. శ్రమదానానికి కొద్దికాలం దూరమై, మళ్ళీ నేడు రంగ ప్రవేశం చేసిన కాంపౌండర్ వేంకటేశ్వరావు ముమ్మారు విస్పష్టంగా ప్రకటించిన స్వచ్ఛ శుభ్ర సౌందర్య ప్రతిజ్ఞలతో 6.30 కి నేటి శ్రమదానం ముగింపు! చాల మంది కార్యకర్తల వాడిన ముఖాలూ - నొప్పి పట్టిన గూళ్లూ గమనించి చలించిన డాక్టర్ DRK గారు రేపటి మన శ్రమదానం ఈ శ్మశానంలో కాదనీ, చిల్లలవాగు వంతెన దగ్గర అనీ ప్రకటన - అందుకు అందరి ఆమోదం!

        కావున రేపటి వేకువ మన పునర్దర్శనం బెజవాడ రోడ్డులోని తరిగోపుల ప్రాంగణం దగ్గరే!

- నల్లూరి రామారావు,

   25.08.2022.