2522* వ రోజు....           31-Aug-2022

కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం!

వినాయక పర్వదినంలో 36 మంది స్వచ్చ సుందరోద్యమం - @2522*

            బుధవారం (31-8-2022) పండుగ వేళ చాల మందిది సాంప్రదాయక గణచతుర్ధి వేడుకైతే,  పాగోలు ప్రవేశక రహదారిలో స్వచ్ఛ కార్యకర్తలది ఒక సామూహిక – సామాజిక - శ్రమదాన వేడుక! వ్యక్తిపరమైన – పారవశ్యక భక్తి నిష్ట కాస్తా - ఎందుకో, ఎప్పుడోగాని రోడ్డెక్కి – ఆడ , మగ భక్తులు ట్రాక్టర్లెక్కి, గులాముల్లో మునిగి, సినిమా పాటలకు చిందులుగా మారిపోతున్న, కులాల పేరిట దేవుడి ప్రదర్శనగా నిర్వహిస్తున్న వింతగా ఈ చవితి పండుగ తయారైంది! మరో వైపు సొంత ఊరి స్వచ్చ - శుభ్రతలకు అంకితమైన కొందరి ఈ శ్రమదానం!  

            ఏడెనిమిదేళ్లుగా ఈ స్వచ్ఛ కార్యకర్తల అమాయకమైన ప్రశ్నేమంటే – ‘మనం పుట్టి – పెరిగి – బ్రతుకుతున్న ఊరి వీధులు, పబ్లిక్ ప్రదేశాలు, మురుగు కాల్వలు, శ్మశానాలు, పంట కాల్వల గట్లు ఎందుకింత ఛండాలంగా ఉండాలి – ఇంతరోతగా కాక శుభ్రంగా – కంటికింపైన హరిత సుందరంగా మన సమైక్య సంకల్పంతో మార్చుకోలేమా? అందుకోసం మన 26 వేల మందిలో రోజుకొక వందా - రెండొందల మందిమి నిత్యం గంట చొప్పున కష్టిస్తే పోయేదేమిటి – మన కొన్ని చిన్న రుగ్మతలు తప్ప?...

            అదేం దురదృష్టమో గాని - ఇంత చైతన్యం ఉన్న విజ్ఞ సమాజంలో – ఇన్నేళ్లుగా క్రియాపూర్వకంగా స్వచ్చ సైనికులడిగే ఈ ప్రశ్నకు బదులేరాదు! ఐనా స్వచ్చోద్యమ కారులు మాత్రం తమ భగీరథ ప్రయత్నం మానుకోలేదనుకోండి! వాళ్లలో చాల మంది శ్రమదాతలే కాదు - అర్ధదాతలు కూడ!

            పాగోలు ముఖ ద్వారం దగ్గరి రోడ్డులోనే నేటి వేకువ 4.20 6.20 నడుమ యార్లగడ్డ శివప్రసాద్ గారి సకుటుంబ – సపరివారంతో సహా ఇందరు కార్యకర్తల కృషి! 50 కి పైగా మొక్కల్ని నాటి, సుమారు 100 గజల బాట హరిత సౌందర్యాలకు అంకురార్పణ చేశారు.

            ఇందులో ఏ ఒక్కరూ అది శ్రమ అనీ, దానమనీ అనుకొన్నట్లు కనిపించలేదు! పదిమంది ఆహ్లాదం కోసం పాటుబడే ఒక అవకాశం వచ్చినట్లే కనిపించింది!

            6.30 వేళ తన ఊరి మెరుగుదల కోసం తపన పడే ఒక విశ్రాంత చిరుద్యోగి – రామబ్రహ్మం ముమ్మారు ప్రకటించిన చల్లపల్లి – పాగోలు స్వచ్చ – శుభ్ర - సౌందర్య సాధనా సంకల్ప నినాదాలతో మొదలైన సరదా సమావేశంలో తమ తల్లి – శ్రీమతి యార్లగడ్డ సరస్వతి, తండ్రి శ్రీ యార్లగడ్డ శ్రీరామచంద్రమూర్తి గార్ల జ్ఞాపకార్థంగా – స్వచ్ఛ కార్యకర్తల ప్రశంసాపూర్వకంగా – వారి కుటుంబం తరపున శివ ప్రసాదు గారి 50 వేల విరాళం ‘మనకోసం మనం’ ట్రస్టుకు దక్కింది!

            విరాళ వ్యసనం కాస్త ఎక్కువైన రామబ్రహ్మం గారు ఏటా తానిచ్చే ఆర్థిక సహకారాన్ని మరింత పెంచిన వాగ్దానం కూడా దక్కింది! అనివార్యంగా అడపా గురవయ్య గారి సందర్భోచిత నీతి వాక్యాలూ వినిపించాయి! అదనంగా స్వచ్చోద్యమ ఆస్థాన గాయకుని “చెట్టు” పాట, దానికి చప్పట్లూ వచ్చాయి!

            రేపటి సంస్మరణ భోజన భాజనాలకు శివ ప్రసాద్ గారి పిలుపూ కార్యకర్తలకు అందింది!

            గురువారం వేకువ మన శ్రమదాన కేంద్రం సైతం పాగోలు ప్రక్క రహదారే!

            ఈ స్వచ్చంద బాధ్యులు

స్వచ్చోద్యమ పని మంతులు - శ్రమదాన శ్రీమంతులు

త్యాగాలకు సంసిద్ధులు – గ్రామ ప్రగతి నిబద్ధులు

మలిన రహిత – సమాజహిత మౌలిక భావావేశులు

సుమ సుందర చల్లపల్లి సురుచిర భవితకు కర్తలు!

- నల్లూరి రామారావు,

  31.08.2022.