2523* వ రోజు....           01-Sep-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం!

2523* వ నాడు 27 మందితో నెరవేరిన సామాజిక బాధ్యత!

          గత నాలుగైదు నాళ్ల వలెనే గురువారం - సెప్టెంబరు ప్రథమ దినాన సైతం పాగోలు దారి –మహాబోధి/ NTR పాఠశాల దగ్గరే స్వచ్చ కార్యకర్తల కృషి! కాస్త దూరపు ఊరి వాళ్లు సైకిళ్ల మీద వెళుతూ ఒకరితో ఒకరు వీళ్లు చల్లపల్లిలో ఏదో కార్యకర్తలంటరా? రోడ్లు బాగా ఊడ్చి - మొక్కలు భలే పెంచి – ఏదో చేస్తుంటారట!...” అనుకొంటూ వెళ్ళడం విన్నాను.(అనగా - చల్లపల్లిలో కొందరు స్వచ్చోద్యమాన్ని చూసి చూసి అలోచించడం మానినా, పొరుగూళ్ల వారు కాస్తైనా పట్టించుకుంటున్నారన్న మాట!

          చల్లపల్లికి వెళ్లే 7 రహదారులు కూడ ఈ పాగోలు రోడ్డంత ఆకర్షణీయంగానే ఉంటాయి - బైట ఊళ్ల వాళ్లని ఆలోచింపజేస్తాయి – ఏ కాస్త స్వచ్చ – సౌందర్య జాడ్యం ఉన్న వాళ్లనైనా ప్రేరేపిస్తాయి! పాపం - అందులో మరీ బలహీనులైతే – ఈ జబ్బు అంటుకొని వదలక - వాళ్ల ఊళ్ళల్లో కూడా ఇలాంటి వింత శ్రమదానం చేసే దాక ఒక పట్టాన యీ దురద ఆగదు! అలా ఈ సుందర - చల్లపల్లి ఇప్పటి దాక దురద అంటించినవి 40 గ్రామాలు!

          నేటి పాతిక మంది శ్రమదాతల కృషి వైభవాన్ని వివరించే ముందు చల్లపల్లి, పాగోలుకు చెందిన జనం ఏమనుకోకుండ ఒక్కమారు ఈ పచ్చని పంట చేల మధ్య - రెండు వైపులా మర్యాదగా నిలబడి చల్లగాలికి తలలూపుతూ ప్రయాణికుల్ని పలకరిస్తున్న పచ్చని చెట్లనూ, రంగు రంగుల పూల సోయగాల్నీ గమనించ ప్రార్ధన! కనీసం వాట్సప్ - ఫేస్ బుక్ లోనైనా తిలకించవచ్చు! అందరూ ఈ బాట అందాల్ని చూసి, మైమరచి, ప్రేరణ పొంది, స్వచ్చకార్యకర్తల్ని అభినందించాలనో – అమాంతం రేపు ప్రొద్దున్నే వచ్చి శ్రమదానం చేయాలనో అత్యాశతో బ్రతిమాలడం లేదు – పౌర బాధ్యతని మాత్రం గుర్తు చేస్తున్నాను!

          ఈ వేకువ 105 నిముషాల చొప్పున స్వచ్చ కార్యకర్తలేమి సాధించారయ్యా అంటే – అది యధా ప్రకారమే - 2523* నాళ్ళ చర్విత చర్వణ కధే! గ్రామ సామాజిక పౌరులుగా తమ కనీస కర్తవ్యం పాటిస్తున్నందుకు ఎప్పట్లాగే కొంత ఆత్మ సంతృప్తిని సాధించారు; నిన్న - ఈరోజు మొత్తం 132 మంచి మొక్కలు నాటారు; కొన్నిటికి గేదెల్నుండి రక్షణగా ముళ్ళ కంప కట్టారు; ప్లాస్టిక్ తుక్కులేరారు; నిన్నటి - నేటి సమస్త వ్యర్థాలను ట్రాక్టరులో నింపుకొని, చెత్తకేంద్రానికి తరలించారు, 6.30 కు 10 నిముషాల కాపీ – సరదా కాలక్షేపం చేశారు...!

          అంతేగాక – స్వచ్ఛ వైద్యునితో కలిసి, గత మూడునాల్గు రోజుల కృషి పూర్వాపరాలను సమీక్షించారు -  దేసు జాహ్నవికి పుట్టిన రోజు శుభాకాంక్షలందించి ట్రస్టుకు వారి కుటుంబీకుల 1000/- విరాళాన్ని DRK గారు స్వీకరించి, తలా ఒక బహుళ ప్రయోజక చేతి సంచిని స్వీకరించారు కూడ!

          75 ఏళ్ల శంకర శాస్త్రి గారికి స్వచ్చ – సుందరోద్యమ ప్రవేశం 8 వ పుట్టిన రోజట! ఆయన లడ్డూల పంపకం చేయడానికి నేటి వంక అదీ!

          రేపటి మన శ్రమదాన కేంద్రం హిందూ శ్మశాన వాటిక వద్ద కలుసుకొందాం!

 

          నాగరికత మన నెత్తిన

ఉరికెంతొ మేలొ నర్చు స్వచ్చంద శ్రమదానం

ఇంటి ముందె జరుగుచున్న ఏమాత్రం పట్టదు!

కోడి పోరు, కేసినోలు మరోవాడకు పోయి చూచు

నాగరికత నెత్తిన నాట్య మాడు చుండునొ!

 - నల్లూరి రామారావు,

  01.09.2022.