1915 * వ రోజు....           08-Feb-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1915* వ నాటి కొన్ని బాధ్యతా నిర్వహణలు.

 

ఈ వేకువ 4.03 నుండి 6.05 నిముషాల వరకు జరిగిన స్వచ్చంద శ్రమదానంలో 24 మంది పాల్గొన్నారు.

స్థానిక విజయా కాన్వెంట్ హై స్కూల్ లో జరుగుతున్న 205, 206 వ వైద్య శిబిరంలో విధులు నిర్వర్తించ వలసి వున్నందున 10 మందికి పైగా స్వచ్చ కార్యకర్తలు తగ్గడంతో విజయవాడ మార్గంలోని విజయా కాన్వెంట్ సమీపంలో – కస్తూర్బా ప్రభుత్వ ఆసుపత్రి భవనం ప్రాంతంలో జరిగిన స్వచ్చంద సేవ తో బాటు వైద్య శిబిరం లోపల కూడా కొంత మంది కార్యకర్తలు చీపుళ్లతో కొన్ని గదులు, హాలు, ఆవరణ శుభ్రం చేశారు.

 

ప్రభుత్వాసుపత్రి ఎదుటి తారు రోడ్డు ఉభయ దిశలలో గడ్డి చెక్కి, రకరకాల తుక్కులు ఏరి, ట్రాక్టర్ ట్రక్కు లోనికెక్కించి, దగ్గరలో గల చెత్త కేంద్రానికి చేర్చారు. కాన్వెంట్ ఎదురుగా విజయవాడ దారిలో కూడ కొంత మేర స్వచ్చ కార్యకర్తల పరిశుభ్రతా చర్యలు చోటు చేసుకున్నవి.

 

నిజానికి ఈనాటి స్వచ్చంద శ్రమదానం జరుగవలసిన ప్రాంతం సాగర్ టాకీస్ దారిలో సంత బజారు నుండి మండల అభివృద్ధి కేంద్రం భవనం దాకా మాత్రమే. ఐతే వైద్య శిబిర నిర్వహణ సౌకర్యార్ధం విజయవాడ మార్గంలోనికి శ్రమ విరాళ వేదిక మార్చబడింది.

 

నిన్నటి ఒక అత్యంత విషాద సంఘటన : మనకోసం మనం ట్రస్టు ఉద్యోగి – 56 సంవత్సరాల పరుచూరి రాధాకృష్ణ హఠాన్మరణం. ఆ దుఖం నుండి స్వచ్చ కార్మికులు, ట్రస్టు ఉద్యోగులు ఇప్పటిలో తేరుకొనడం సాధ్యం కాక పోవచ్చు. ఆ నిస్వార్ధ స్వచ్చ ఉద్యోగ కార్మికునికి మన శ్రద్ధాంజలి.

 

ఈ నాటి కాఫీ-టీ సేవనం పిదప జరిగిన గ్రామహిత సమీక్షా సమావేశంలో –

 

- నిన్నటి వలెనే నేడు కూడా పద్మావతీ ఆసుపత్రి స్నేహ మెడికల్స్ నిర్వాహకుడు దాసరి వేంకట రమణ వురఫ్ చిన్నాజీ గారి కుమారుని వైవాహిక  నిశ్చితార్ధ బహుమతులు కార్యకర్తలకు పంపిణీ జరిగింది. ఆస్పత్రి రెసెప్షనిస్టు లక్ష్మీ సెల్వం గారు ముమ్మారు బిగ్గరగా చాటి చెప్పిన స్వచ్చ సుందర సంకల్ప నినాదాలతో 6.45 నిముషాలకు నేటి మన శ్రమదాన వేడుక ముగిసింది.

 

రేపటి మన బాధ్యతా నిర్వహణ సాగర్ టాకీస్ సమీపంలో ఆగి బైపాస్ మార్గంలో కొనసాగిద్దాం.      

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

శనివారం – 08/02/2020

చల్లపల్లి