2524* వ రోజు....           02-Sep-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం!

ఊరి రెండో శ్మశానంలో 7 వ (చివరి) నాటి - 2524* వ నాటి కృషి!

            శుక్రవారం(2.9.22) వేకువ రెండున్నర వేల రోజులు పైగా చల్లపల్లిలో జరుగుతున్న స్వచ్చ సుందర ప్రయత్నాలు గాని, 7 రోజులు రుద్రభూమిలో 30/40 మంది చొప్పన శ్రమించినది గాని, స్వచ్ఛ కార్యకర్తలకు సాధారణ సామాజిక బాధ్యత అనిపిస్తే మంచిదే గాని వాళ్ళ దైనందిన తపః ఫలితం అనుభవించే ఊరి వాళ్లకు మెచ్చదగ్గ అనుసరింప దగ్గ చర్యగా తోచకపోతే మాత్రం మంచిది కానే కాదు.

            డి.ఆర్. కె. డాక్టరు గారు పదేపదే వదిలే డైలాగ్ ఏమంటే – “ఈ శ్మశానాల్లో మురుగు కాల్వల్లో - మురికి వీధుల్లో కత్తులు పట్టి, పారలతో - గునపాలతో చీపుళ్లరిగి పోయేట్లుగా, గూళ్లు నొప్పెట్టేంతగా, ఏరోజుకారోజు బట్టలు చెమటకు తడిసి, దుమ్ము కొట్టుకొనేంతగా ఈ రోజుల్లో ఎవరు నిస్వార్థంగా శ్రమిస్తారు....అని! ఆతనిది పొగడ్తా, కటిక నిజమా?

            నేనిట్లా సవాలు విసరొచ్చో - లేదో తెలియదుగాని – “ఈ 30 మంది స్వచ్చంద శ్రమదాన వ్యసనపరుల్ని - తమ సొంత బాధ్యతలతో సమంగా ఊరి కర్తవ్యాల కంకితుల్ని నిత్య కర్మిష్టుల్ని ఏదొక చోట రోడ్లు ఎక్కి పనిచేయకుండా ఆపండి చూద్దాం! ప్రొద్దుట 7.00 దాక ఇంట్లో ఇక వాళ్లు పడుకోగలరేమో అంచనా కట్టండి!

            ఇది చరిత్ర ఎరుగని - చల్లపల్లికి మాత్రమే పట్టిన అదృష్టం! ఇందరు విజ్ఞులు ఇన్నేళ్లు - ఇన్నాళ్లు తమ దిన చర్యలో మొదటి విషయంగా ఊరి మేలుకు సామూహికంగా పూనుకోవడం మనకు తెలిసినంత వరకూ మన సమ కాలంలో ఎక్కడైనా ఉందా?

            నిన్నో మొన్నా ఆనందరావనే ట్రస్టు ఉద్యోగి ఈ శ్మశానాన్ని దున్ని, ఏకాస్తయినా గడ్డి - మొక్కలు మిగలకుండ చూశాడు! ఈ శుక్రవారం ఉదయమేమో 36 మంది చిల్లలవాగు వైపున గడ్డి, పిచ్చికంప, వంటి వాటిని తొలగించే బాకీ తీర్చుకొన్నారు! శ్మశాన సుందరీకర్తల అప్పు తీరాలంటే అది ఇప్పట్లో జరిగే పనికాదు - నెలల పర్యంతం జరిగితేనే!

            ఇక నేటి గ్రామ స్వచ్చ సుందరోద్యమ సంకల్ప నినాదాలను గట్టిగా వినిపించినదీ, హిందూ శ్మశాన పరిశుభ్ర - సుందరీకరణం అనే కల నెరవేరిన ఆనందాన్ని ప్రకటించినదీ - ఇక ముందు తన నుండి మరింత సహకారాన్ని వాగ్దానం చేసినదీ కస్తూరి వరప్రసాదు. ఈ శ్మశానం పచ్చదనం కోరి మామిడి మొక్కను బహూకరించినది పసుపులేటి గోపాలరావు. కార్యకర్తలందరి అభిప్రాయానుసారం రేపటి మన వీధి పారిశుద్ధ్యం శ్రావ్య ఆస్పత్రి నుండి (వాన లేకుంటే) అని ప్రకటించినది డాక్టర్ DRK ప్రసాదు గారు.

            ప్రాతూరి శంకర శాస్త్రి గారు మళ్ళీ తన 5,000/- విరాళాన్ని మేనేజింగ్ ట్రస్టీ గారికి సమర్పించనే సమర్పించారు.

 

            ఈరోజు కురిసిన వర్షం వల్ల ముందుగా అనుకున్నట్లుగా శ్రావ్య ఆసుపత్రి వద్ద కాకుండా రేపటి వేకువ మన పునర్దర్శనం పాగోలు రహదారిలోనే!

 

 తర్క వితర్కాలు ప్రశ్నోప ప్రశ్నలు.

వడ్డించిన విస్తళ్లై ఉండాలా జీవితాలు?

తాతల శ్రమ దయ మీదే తరతరాలు బ్రతకాలా?

ఎవరి బ్రతుకు వారి స్వయం కృషి సాధ్యం కావాలా?

మన బాధ్యత పరులదా - సమాజ బాధ్యతలు మనవా?

- నల్లూరి రామారావు,

  02.09.2022.

ఈ శ్మశానం పచ్చదనం కోరి మామిడి మొక్కను బహూకరించినది పసుపులేటి గోపాలరావు
ప్రాతూరి శంకర శాస్త్రి గారు మళ్ళీ తన 5,000/- విరాళాన్ని మేనేజింగ్ ట్రస్టీ గారికి సమర్పించనే సమర్పించారు.