2525* వ రోజు....           03-Sep-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం!

మళ్ళీ పాగోలుకు మారిన శ్రమ వేడుక - @2525*

          వెనుకా ముందూ పునరాలోచించి, తరిగోపుల ప్రాంగణం నుండి పాగోలు బాటకు నిర్ణయింపబడిన శనివారం నాటి సామూహిక స్వచ్చ సంకల్పం 4.20 6.05 నడుమ ఇరువదిన్నొక్క మందితో – మహాబోధి/NTR ట్రస్టు పాఠశాల పడమటి ప్రక్కనే నెరవేరింది! ఎక్కడైతేనేం - ఎందరిదైతేనేం - చల్లపల్లి స్వచ్చోద్యమ బావుటా రెపరెపలాడింది గదా!

          ప్రస్తుతానికి పాగోలు గ్రామం అటు ఆధ్యాత్మిక కేంద్రమూ, స్వచ్చంద శ్రమ వైభవ సాంద్రమూ! ఈ కొద్దిమంది శ్రమ వీరులు ఒక 100గజాల రహదారిలో ఏం పొడిచారో చూద్దాం!

          ఒకరిద్దరు శ్రమదాన ఆల్ రౌండర్లు మురుగు కాల్వ నుండి ఎండు కొమ్మల్నీ, ప్లాస్టిక్ సంచుల – సీసాల - కప్పుల - ప్లేటుల తెట్టునీ బలే ఒడుపుగా బైటకు లాగితే –

          చిల్లర మొక్కల్తో – తీగల్తో - జడలు విరబోసుకొని బొత్తిగా అంద విహీనంగా ఉన్న ఒక పెద్ద చెట్టును ముగ్గుర్నలుగురు సుందరీకర్తలు సదరు జడలు కత్తిరించి, ఎండు పుల్లల వికృతాన్ని సవరించి, ఆ వృక్షానికొక సంతృప్తికర రూపం తెస్తే...

          85 ఏళ్ల వృద్ధ బాలునితో సహా నలుగురు పంగల కర్రల్తో – దంతెల్తో – డిప్పల్తో – వ్యర్ధాలన్నిటిని ట్రాక్టరుపైకందిస్తే –      

          ముగ్గురు చీపుళ్ల వారు 100 గజాల రహదారిని ముంగిళ్లలాగా ఊడ్చి పరిశుభ్ర పరిస్తే..

          నాబోటి ఒకరిద్దరు స్వచ్ఛ యజ్ఞానికి సాక్షులై – ఛాయాగ్రాహకులై, సహర్ష పులకిత గాత్రులై పరవశిస్తే....

          6.20 వేళ – కాఫీ కషాయ సేవానంతర సమీక్షా సమావేశంలో రామానగరపు రాజు గారి విస్పష్ట స్వచ్చ – శుభ్ర – సౌందర్య సంకల్ప నినాదాలకు 20 గొంతులు ప్రతి స్పందిస్తే...

          తప్పనిసరిగా గురవయ్య గురువు అంబేత్కర్ సూక్తి వినిపించి - వివరిస్తే - చల్లపల్లి కార్యకర్తల శ్రమదాతృత్వాన్ని కీర్తిస్తే - నేటి ఈ అరుదైన సామాజిక శ్రమ కేళి ముగిసింది.

          ఆదివారం (4-9-22) వేకువ ద్విగుణీకృత సంకల్పంతో మన పునర్దర్శనం చిల్లలవాగు వంతెన దగ్గరి తరిగోపుల ప్రాంగణం వద్దనే!

 

          నా గ్రామస్తులు కొందరు.

ప్రక్కనున్న గులాబీల పరిమళమే గుర్తింపరు

విదేశాల అత్తరులకు వెంపర్లాడు చుందురు

దూరపు కొండలు నునుపో క్రొత్తలన్ని వింతలో

స్వచ్చోద్యమ చల్లపల్లి సంగతులే తలవరు!

- నల్లూరి రామారావు,

  03.09.2022.