2526* వ రోజు....           04-Sep-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం!

విజయవాడ రోడ్డుకే అధిక సంఖ్యాకుల పునః పరిచర్య - @2526*

            ఆదివారం బ్రహ్మ ముహూర్తంలో మరొక మారు అత్యధికంగా 48 మందీ, సాధారణంగా 42 మందీ పాల్గొని శ్రమించి తీర్చిదిద్ది సంతృప్తి వహించిన చోటు చిల్లలవాగు దగ్గరే! కొందరు అవారా వారికి వేలం వెర్రిగా - సామాజిక సంశోధకులకు భవిష్యదాశావహంగా గ్రామ, రాష్ట, దేశ, విదేశాల నివాస - ప్రవాసులు కొన్ని వందల మంది దృష్టిలో ఆశాకిరణంగా - ఆరాధనగా నడుస్తున్న - జ్వలిస్తున్న స్వచ్ఛ సుందరోద్యమం యొక్క నేటి కథా - కమామిషూ ఎట్లనగా:

            భరత ఖండంలోని 6 లక్షల గ్రామాల్లో అదొక మారు మూల చల్లపల్లి! 99.99 శాతం ఊళ్లలాగే 9 ఏళ్లుగా దాని స్వరూప స్వభావమూ షరామామూలే! పేడా, పెంటల్తో, మురుగు కంపుల్తో, దోమలీగల్తో, కళా కాంతుల్లేని - సామాజిక చైతన్యం లేని - ఆరోగ్య స్పృహ చాలని ఒకానొక పెద్ద పంచాయతే! అక్కడి ఒక సామాజిక వైద్యుని గుండె గొంతుకలో ఎన్నాళ్ల నుండో కొట్లాడుకొంటున్న స్వచ్ఛ - భావ చైతన్యం 2013 లో తొలుత జనవిజ్ఞాన వేదికకూ - అక్కడి నుండి దిన వార మాస క్రమంలో ఇంకొన్ని స్వచ్చంద సంస్థలకూ ప్రాకింది!

            సత్యాన్వేషకమైన చైతన్యశీలకమైన సదరు సంస్థలే ధ్యాన మండలి, రోటరీ లయన్స్ క్లబ్బులూ, ఆర్య వైశ్య సంఘమూ వగైరాలు! వీళ్ళు కాక భావ సారూప్యులైన రైతులూ, వైద్యులూ, ఉద్యోగులూ, విశ్రాంత సేవకులూ ఈ స్వచ్చ సుందరోద్యమాన్ని 2526* రోజులుగా ప్రతి వేకువా ఒక వేడుకగా - ఒక బాధ్యతగా ముందుకు నడుపుతూనే ఉన్నారు!

            అలాంటి ఒక వేకువ ఈ ఆదివారానిది! అన్ని రోజుల్లాగే ఈ వినయ వినమిత సౌజన్య స్వచ్చ కార్యకర్తల పని తీరు ఈ వేళ కూడా! తమ ఊళ్లో - వీధుల్లో ఎక్కడ గుంటపడినా వాళ్ళ దృష్టిని తప్పించుకోదు తాము నాటి పెంచిన పాతిక వేల మొక్కల్లో దేని క్షేమ సమాచారమూ వాళ్ల బుర్రల్లోనే ఉంటుంది! ఏ మురుగు కాల్వ నడకలో తేడా వచ్చినా వాళ్లూరుకోరు! శ్మశానాలు, బస్ స్టాండ్లు, దురాక్రమిత రోడ్డు మార్జిన్లు, పంట కాల్వ గట్ల శుభ్ర సుందరీకరణలూ వాళ్ళే సొంతం చేసుకొంటారు!

            రోడ్లు, మార్జిన్లు, ఊడ్చినా, ప్లాస్టిక్ తుక్కుల పని పట్టినా, ఎగుడు దిగుళ్ళు సరిచేసినా, చెట్ల అందాల్ని మెరుగుపరిచినా....ఇవన్నీ గ్రామ స్వచ్చ - సుందర ధారావాహికలో నేటి మరొక ఎపిసోడ్ లోనిది!

            నేటి రహదారి సుందరీకరణ చర్యానంతరం 6.40 సమయాన తన ఊరి స్వచ్ఛ శుభ్ర సౌందర్య సాధనా సంకల్ప నినాదాల్ని రుద్రభూమి అంతటా మారు మ్రోగించినది రాయపాటి రాధాకృష్ణుల వారు; ఆనంద పారవశ్యంతో సమీక్షించింది దాసరి రామకృష్ణుల వారు;

            చల్లపల్లి స్వచ్చోద్యమాశయాన్ని శ్మశాన ప్రకృతి సైతం పరవశించేతగా గానం చేసినవారు 1. వక్కలగడ్డ శేషు 2. ఘంటశాల నందేటి శ్రీను. యధాప్రకారం నీతి వాక్య సేకరణ, విస్తరణ అడపా గురవయ్యది. 

            బందరు నుండి వేకువనే పని కట్టుకొని వచ్చి - కంటితో చూస్తే తప్ప నమ్మశక్యం గాని స్వచ్చ కార్యకర్తల సేవా విన్యాసాలకు ముగ్ధుడై - వలదని వారిస్తున్నా 25,000/ విరాళమిచ్చినది డాక్టర్ తోట ప్రేమ్ కుమార్ మహాశయుడు!

            బుధవారం నాటి మన సామాజిక సామూహిక కర్తవ్య ప్రదేశాన్ని మళ్లీ తరిగోపుల ప్రాంగణం నుండే అని సమ్మతించినది 40 మందికి పైగా కార్యకర్తలు!

            చల్లపల్లి జనంలోన

ఎవ్వరైన సొంత ఊరు నిలా మేలుకొల్పగలరా?

ఉన్న ఊరు నిన్నేళ్లుగ స్వస్త పరచి చూపగలర!

ఎవరి దింత నిస్వార్థత? ఎవరి దసలు అదృష్టం!

చల్లపల్లి జనంలోన స్పష్టత రానే రాదా?

- నల్లూరి రామారావు,

  04.09.2022.