2527* వ రోజు.......           05-Sep-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం!

గంగులవారిపాలెం భవఘ్ని నగర్ లో రెస్క్యూ చర్యలు - @2527*

          సోమవారం వచ్చేసరికి – 5+ముగ్గురు ఒక వీధి భద్రతా కృషికి పూనుకొని, కృతకృత్యులయ్యారు. వాళ్లు ఎప్పుడు మేల్కొని, ఎంత సేపు తమ పనిముట్లు సర్దుకొని, ఏ 2 కిలోమీటర్లో పయనించి, 4.30 కి ఇక్కడికి చేరుకొన్నారో గాని – సొంత బాధ్యతలు లేక కాదు, ప్రొద్దెక్కే దాక నిద్రపట్టని అస్వస్తులూ కారు, అవి వేకులంతకన్నా కాదు!

          సొంత పనుల కన్నా తమ ఊరి బాధ్యతలు చప్పట్లు కొట్టి పిలుస్తుంటే మొద్దు నిద్రపోలేని ఒక బలహీనత! రోజూ ఒక గంటన్నర - 2 గంటలు తమ పుట్టి - పెరిగిన - లేదా బ్రతుకుతున్న ఊరి కోసం శ్రమిస్తే తప్పేమిటనే ఆలోచన! తమ ఈ కాస్తంత కర్తవ్య నిర్వహణలో కొన్ని వందల - వేల గ్రామస్తులకూ, వాహన చోదకులకూ భద్రత చేకూరితే చూసి, సంతృప్తి చెందాలనే చిన్నపాటి స్వార్థం!... ఇలాంటివే బహుశా కార్యకర్తల 2527* రోజుల శ్రమదాన కారణాలై యుండాలి!

          భవఘ్ని నగర్ – బండ్రేవుకోడు మురుగు కాలువల నడుమ ఇటీవల పెట్టిన వేగ నిరోధకాల దగ్గర రాత్రివేళ సరిగ్గా గమనించని ప్రయాణికుల కోసం మిలమిల మెరిసే ‘Cat Eyes’ అమరికే ఈ ఐదారుగురి నేటి ముఖ్య విషయం. మూల మలుపుకు ముందు దాన్ని సూచించే గుర్తును నాటడం ఇంకొక పని!

          విజయవంతంగా ముగించాక డాక్టర్ పద్మావతి గారు ముమ్మారు పలికిన చల్లపల్లి స్వచ్చ - శుభ్ర - సుందర నినాదాలతో వారి కృషి నేటికి ముగింపు!

          స్వచ్చోద్యమ ఋషి తుల్యులు!

సర్వ సాధారణ జనులు వీరు - సంస్కర్తలు అనుకొనేరు!

మేధావులు అసలె కారు - మట్టి మనుషులే అందరు

లోకోత్తర ఘన కార్యం చేస్తున్నామని తలవరు

అతి సహజంగా సాగే స్వచ్చోద్యమ ఋషి తుల్యులు!

- నల్లూరి రామారావు,

  05.09.2022.