2528* వ రోజు....           06-Sep-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం!

పాగోలు రహదారికి చేరిన రెస్క్యూ టీం పరిచర్యలు @2528*

            నిన్న గంగులవారి పాలెం బాటకు లభించిన రెస్క్యూ దళం సేవలు మంగళవారం వేకువ 5+2+1 మందితో పొరుగు గ్రామానికి తరలి వెళ్ళినవి! ఈ 8 మందిలో చివరి సంఖ్య యార్లగడ్డ శివప్రసాద్ గారిది.

            వాళ్ల అవసరం ఉందనుకొన్నప్పుడు స్వచ్చ కార్యకర్తలు 10,13 కిలో మీటర్ల దూరాన సైతం గతంలో ఎన్నో శ్రమదానాలు చేశారు! గత వారంలో పాగోలు ముఖద్వారం దగ్గర వందలాది పూల మొక్కల్తో సింగారించిన చోటే ఈ 06.09.2022 వ నాడు బాగా వ్యయ ప్రయాసలతో - వందల కిలోమీటర్ల దూరం నుండి తెప్పించిన నాణ్యమైన 16 మొక్కల్ని నాటడమే కార్యకర్తల నేటి ముఖ్యోద్దేశ్యం!

            వాటిలో రావి మొక్కలు = 4 ; మద్ది చెట్లు = 5 ; తురాయి = 5 ; సువర్ణ గన్నేరులు = 2 ; ఇవన్నీ ఇప్పటికే రెండేళ్ల పాటు కడియంలో బాగా పెరిగిన చెట్లు.

            (నాకున్న ఒక సందేహం ఏమంటే : ముందే తగినంత చిత్త శుద్ధి లేకుండానే ప్రతిష్టించి వదిలేసిన దేవతామూర్తుల వల్లా/ ప్రణాళికాబద్ధంగా నాటి, సాకిన రహదారి వనాల వల్లా - వేటితో జీవజాతుల కెక్కువ ప్రయోజనం?)

            6.25 సమయంలో మాలెంపాటి అంజయ్య ప్రవచిత గ్రామ స్వచ్చ - శుభ్ర - సౌందర్య సంకల్ప నినాదాలతో ఒక నవోదయ శుభ సంకల్పం నెరవేరింది!

            రేపటి (బుధవారం) వేకువ మన పునర్దర్శనం విజయవాడ రోడ్డులోని చిల్లలవాగు వంతెన దగ్గరే!

 

            ఉత్తమోత్తమాశయం

ఎందరిదో ఈ గ్రామం ! కొందరిదే శ్రమదానం!

సమస్యలేమొ అత్యధికం! పరిష్కర్త లత్యల్పం!

అందుకె ఈ ఎనిమిదేళ్ల స్వచ్చోద్యమ సంకల్పం!

ఒక ఊరును సంస్కరించు ఉత్తమోత్తమాశయం!   

- నల్లూరి రామారావు,

  06.09.2022.