2529* వ రోజు.....           07-Sep-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం!

బెజవాడ రోడ్డులో ముగిసిన 50 రోజుల శ్రమ వేడుక - @2529*

          బుధవారం (7.9.22) జరిగిన తలా 100 నిముషాల - 25 నుండి 27 మంది సుందరీకరణ కృషిని ‘శ్రమదాన కేళి అంటే తప్పేముంది? రెండు కిలోమీటర్ల రహదారి శుభ్రతకు, పచ్చదనాల క్రమబద్ధీకరణ కోసం, స్వచ్చత కోసం, భద్రత కోసం, భవిత కోసం తీరికే లేని కొందరు వైద్యులు, పగలంతా పొలం సాగులో గడిపే రైతులకు, సొంతింటి బాధ్యతల్లో మునిగే గృహిణులకు, విశ్రాంత వయోవృద్ధులకు, ఉద్యోగినీ ఉద్యోగులకు ఈ పారిశుద్ధ్య ప్రయత్నం ఆటవిడుపేనేమో!

          నడుమ కొద్ది రోజుల విరామాలతో ఈ 30 మంది కార్యకర్తల శరీర కష్టం చల్లపల్లి పౌరులు ఖరీదు కట్టగలిగింది కానే కాదు - ఎప్పటికైనా గ్రామస్తులు క్రమంగా వచ్చి చేతులు కలపదగింది మాత్రమే! అరె! ఈ 50 రోజుల్లోనే సుమారు 3 ½ వేల పని గంటల శ్రమలో వీళ్ళెన్ని ట్రాక్టర్ల వ్యర్ధాలు తొలగించారు! రోడ్డును ఎన్నిమార్లు ఊడ్చి, గతించిన కొన్ని మొక్కల్ని నాటి, ఉన్న వాటికి మరామత్తులు చేసి... అసలిలాంటి ప్రయత్నాలు ఏ ఊళ్ళో ఎప్పుడు జరిగాయి గనుక?

          స్వచ్ఛ కార్యకర్తల స్వేదాత్మక శ్రమదానం చల్లపల్లి ప్రజలకు మేలుకొలుపా? జాలి కొలుపా? ఆదర్శమా – ఉపేక్షణీయమా? 2529* నాళ్ల కర్తవ్య పాలనం అవాస్తవమా – ప్రత్యక్షమా? అత్యద్భుత శ్మశానాల, బస్ ప్రాంగణాల, 7 రహదార్ల ఉద్యానాల, పంటకాల్వల పరిశుభ్ర – సౌందర్యాలు బొత్తిగా గ్రాఫిక్ లా? ఒక సామాజిక చైతన్యం ఉండవలసింది గ్రామస్తుల్లోనా - ఎక్కడెక్కడి పరిశీలకుల్లోనో లేక ప్రవాస చల్లపల్లీయుల్లోనా?....

          నేటి 12 మంది శ్రమదాతల + ఇద్దరు కాలభైరవుల తొలి ఉనికి తరిగోపుల ప్రాంగణంలోనే గాని, వెంటనే 14 15 మంది కలిసి, మొత్తంగా బుధవారం ఉదయాన 27 మంది ప్రమేయంతో జరిగిన కృషితో:-

- చిల్లలవాగు ఉత్తరపు గట్టు ఎత్తు పల్లాలు చక్కబడి, రెండు చెట్ల కొమ్మలు సుందరీకరింపబడి,

- శ్మశాన దహనవాటికల దక్షిణాన, అంటే రుద్రభూమి ఆవరణ బయట 14 మంది శ్రమత్యాగంతో కంచె బారునా చక్కగా ముస్తాబై, - ఎట్టకేలకు 6.05 తరువాత కార్యకర్తల ఈ నాటి కృషికి తెరపడింది!

          ఒక RTC డ్రైవర్ – తోట నాగేశ్వరావు గారి గ్రామ స్వచ్ఛ – సౌందర్య – సంకల్ప నినాదాలతోను, ఒక సామాజిక స్వచ్చ వైద్యుని శిరస్త్రాణ వాడక హెచ్చరికలతోను నేటి సమీక్షా సమావేశం ముగిసెను!

          రేపటి వేకువ శ్రమ సందడి, బెజవాడ బాటలోనే - బికనీర్ హోటల్‌ ఎదుటే – బైపాస్ వీధి మొదటే మన పునర్దర్శనమని నిర్ణయించబడెను!

          అమలయ్యే ఆనందం!

ఒక పూటదొ – ఒక నాటిదొ – ఒక ఏటిదొ – దశాబ్దిదో  

చల్లపల్లి స్వచ్చోద్యమ సంరంభం కాదు సుమీ!

గ్రామమెల్ల ఆరోగ్యం కదం త్రొక్కు నంత దాక

అది జీవిత పర్యంతం అమలయ్యే ఆనందం!

- నల్లూరి రామారావు,

  07.09.2022.