2530* వ రోజు.....           08-Sep-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం!

గురువారం మొదలైన బైపాస్ వీధి నవీకరణం - @2530*

          బైపాస్ - బెజవాడ రోడ్ల కలయిక నుండి బికనీర్ దగ్గర 25 మందితో వేకువ 4.20 కి ప్రారంభమైన పనులు పెద్ద - లోతైన మురుగు కాల్వ ఒడ్డున 100 గజాల మేర జరిగాయి! డ్రైను పూడిక తీసే క్రమంలో జరిగిన స్వచ్చ – శుభ్రతా లోపం తొలగింది. ఏ కాస్త ఆలోచనాపరులకైనా – ఒక్క నిముషం స్ధిమితంగా పట్టించుకొంటే - కార్యకర్తల సుదీర్ఘ శ్రమదాన గమ్యమేమిటో తెలియక పోదు!

          రెవిన్యూ కార్యాలయాల – పాల కేంద్రాల – ప్రాత సామాన్ల నడిమిదైన ఈ చోటు దశాబ్దాలుగా ఒక ప్రామాదికమైన కాలుష్య ప్రదేశం. ఆక్రమణకు గురైన పెద్ద రోడ్డు, ఉమ్మడి ప్రయోజనం పట్టని బాధ్యతారాహిత్యం, శక్తి చాలని పంచాయతీ నిర్వాకం అందుకు కారణం! అప్పుడక్కడ జరిగింది కాలుష్యం పైన కార్యకర్తల తొలి సమరం! తదాదిగా సుమారు 1 ½ కిలో మీటర్ల బారునా దాతల కనీస సౌజన్యంతో – ‘మనకోసం మనం’ సంస్థ భల్లూకం పట్టుతో – వెల్లివిరుస్తూనే ఉన్నది పరుచుకొన్న పచ్చదనం, పూల పరిమళం !

          ఈ రహదారిలోని గృహస్థులూ, వ్యాపారులూ, గ్రామాధికారులూ, ఏ కొంచెం శ్రద్ధ చూపినా స్వచ్చ కార్యకర్తలీ వీధిని ఇన్ని మార్లు ఇంత శ్రమదాతలు కోర్చి తీర్చిదిద్దే అగత్యం ఉండదు. తాము నివశించే  - పయనించే నాలుగైదేళ్లుగా కనువిందులు చేసే సాగర్ టాకీస్ బైపాస్ మార్గం పట్ల అందరిదీ సమాన బాధ్యతే!

          ప్రముఖ వైద్యులతో – 70 - 80 ఏళ్ల వృద్ధులతో – గృహిణులూ - రైతులుతో నేటి స్వచ్ఛ సుందరీకరణం ఎంత చక్కగా జరగాలో అంతగా జరిగింది. మురుగు కాల్వ గట్టు మీద – చిరు చినుకుల్లో - దుర్వాసనల్లో గంటన్నర పాటు – ఈ వీధికి చెందని శ్రమదాతల ప్రయత్న ఫలితమేమిటో – 6.00 తరువాత వాట్సప్ చిత్రంలో కనిపిస్తూనే ఉన్నది!

          సుందరీకర్తల వంచిన నడుము లెత్తని పరిశ్రమా, కత్తుల వారి – దంతెల వారి – చీపుళ్ల మహిళల విన్యాసాలైనా, ట్రక్కు నిండా వ్యర్ధాలు సేకరించి చెత్తకేంద్రానికి చేర్చిన లోడింగ్ నైపుణ్యాలైనా – చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తలకే చెల్లు! నా ఎరుక ప్రకారం అది “నభూతోనభవిష్యతి!”

          నా మహనీయ గ్రామంలో ఏ రికార్డింగ్ నృత్యాలు పెట్టినా – ఏ ఉచిత పంపకాలు జరిగినా - టిఫిన్ దానాలు, అన్నదానాలు జరిగినా – తిరనాళ్లు చోటు చేసుకొన్నా – చిటికలో వందల కొద్దీ చేరుకొనే మా సోదరులు తమ ఊరి బాగు కోసం శ్రమిస్తున్న స్వచ్ఛ కార్యకర్తలతో కూడ కలవాలి!

నేటి శ్రమదానానంతర కార్యక్రమంలో - ఒక విశేషం :

- అది పల్నాటి భాస్కరుని కుటుంబం వాళ్లవి ఆర్థికంగా, హార్దికకంగా ఊరి కోసం శక్తివంచన లేని సుదీర్ఘ సేవలు! ఒక్కోమారైతే – స్తోమతకు మించి కూడ! 81 వ జన్మదినాన - తన దివంగత భార్య సుభద్రమ్మ గారి జ్ఞాపకార్థం మల్లికార్జునరావు గారి 3000/- స్వచ్చోద్యమ విరాళం! ఆయన కుమారుడి స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సాధనా సంకల్ప నినాదాలు!

          రేపటి మన వేకువ శ్రమదానం కూడ ఈ బైపాస్ వీధిలోని పాలకేంద్రం దగ్గరే!

          స్వచ్చత కే  ప్రణామం

నీకై నీ ఆరాటం నీ ఆశల కోలాటం

నీ కుటుంబ సౌఖ్యానికి నీవు చేయు పోరాటం

మాకు లెక్కలోది కాదు – మా గ్రామస్తుల కోసం

నీ తపనకె – నీ శ్రమకే నేను చేయు ప్రణామం!

- నల్లూరి రామారావు,

  08.09.2022.