2531* వ రోజు....           10-Sep-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం!

         అలుపెరగని చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమం – @2531*

          శనివారం (10-9-22) వేకువ కాలపు నియమ నిష్టా గరిష్ట శ్రమదానానికి గాని, ఆ పట్టింపులేవీ పెట్టుకోని కొందరి కశ్మలాల విరజిమ్ముడుకు గాని - అడపాదడపా వచ్చి తొంగి చూసిపోతున్న చిరుజల్లులకు గాని విసుగులేదు! సదరు వీధి పారిశుద్ధ్య విశాల మనస్కులు 20 మంది! నేటి వారి శ్రమదాన కేంద్రం - బెజవాడ, బందరు వీధుల్ని కలిపే ఒక ఉపమార్గం మొదట్లో – బికనీర్ – పాలకేంద్రాల ప్రాంతం!

          కార్యకర్తల నేటి పనులు మరీ బరువైనవి కావు. చిరువానల చల్లని వాతావరణంలో - నాటిన ప్రతి మొక్కా బ్రతికి బట్టకట్టే అనుకూల అదనులో – కంచెకూ, డ్రైనుకూ నడుమ ఉద్యానంలో మూడు వరుసల్లో - మూడు విధాల పూల మొక్కలు నాటడమే 12 మంది కార్యకర్తల ముఖ్య చర్య.

          మిగిలిన వాళ్లు బికనీర్ భవనం పడమర రోడ్డు మార్జిన్ లో తామే అంతకు ముందు నాటి సంరక్షిస్తున్న రంగు పూలమొక్కల పాదుల్ని సవరిస్తూ - దిక్కుమాలిన ప్లాస్టిక్ చండాలాన్ని ఏరి – ఊడ్చి – తొలగిస్తూ - పనిలో పనిగా భవంతి ఆవరణనూ, ఎదుటి రోడ్లనూ ఊడుస్తూ - కూర్చుని కొందరు, వంగొని కొందరూ శ్రమించారు.

          ఇంత పెద్ద ఊరి మురుగు కాల్వల అంచుల్లో వేకువ 4.20 కే పూనుకొని బద్ధకించక – వెరవక - బిడియపడక ఇందరు తమ శ్రమనూ - సమయాన్ని వెచ్చించడమే చల్లపల్లి స్వచ్చ – సుందరోద్యమం తొలిగెలుపు! వందల - వేల గ్రామస్తుల మనసుల్ని ఆకర్షించి - సహకారాన్ని పొందిన 2531* నాళ్ల సుదీర్ఘ ప్రస్థానమే వాళ్ల మలి విజయం! నాలాంటి వ్రాతగాళ్ల కదే తరగని ఉత్తేజం!

          స్వచ్ఛ కార్యకర్తల దైనందిన – నిర్విరామ గ్రామ పారిశుద్ధ్య ప్రగతికీ, ఇప్పటికే పాతిక – ముప్పై వేల మొక్కలు నాటి పెంచినా ఇంకా తీరని హరిత – సౌందర్య పిపాసకీ మా ప్రణామం!

          6.05 దాక నేడు శ్రమదానం చేసింది 20 మంది - చూసింది అంతకు ఏడెనిమిది రెట్ల మంది! (మరి - ఇంత చక్కని పనికి ప్రతిస్పందించినది ఎంతమందో?)

          నేటి 30 పని గంటల కృషిని సమీక్షించినది డాక్టరు దాసరి రామకృష్ణ! కొద్ది రోజుల ఎడం తర్వాత పాల్గొని - స్వచ్ఛ సుందరోద్యమ సంకల్పాన్ని నినాదాలుగా ప్రకటించినదీ, కార్యకర్తలకు మిఠాయిలు పంచినదీ, వాళ్లకు జనవిజ్ఞానవేదిక సభ్యత్వాలను కల్పించినదీ లంకే సుభాషిణి!

          ఇంతకన్న ఎక్కువ మంది అవసరమే ఉన్న రేపటి (ఆదివారం) శ్రమదానం బైపాస్ వీధిలోని పాలకేంద్రం దగ్గరనే!

         నీ కొనరిస్తాం ప్రణామం!

ఓ స్వచ్చోద్యమ కర్తా! శ్రమ సంస్కృతి నిర్మాతా!

ఎనిమిదేళ్ళు ఊరి కోరకు ఎడతెగని శ్రమదాతా!

సమాజ ఋణం తీర్చుకొనే సాహసికుడ! సైనికుడా!

ఉదాహరణ యోగ్యుడ! నీ కొనరిస్తాం ప్రణామం!

- నల్లూరి రామారావు,

  10.09.2022.