2532* వ రోజు....           12-Sep-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం!

2532* వ నాటి రెస్క్యూ దళం గ్రామ మెరుగుదల కృషి!

          సోమ – మంగళ వారాల్లో 5 - 6 సంఖ్యాబలం కల రెస్క్యూ టీం అనబడే స్వచ్చ కార్యకర్తల కరకు పనులు రివాజుగా మారినవి! వాటిని చూసి సంతసించడం నాలాంటి కొందరికీ, వాటి ఫలితాలనుభవించడమూ, ఎంతగా ఎవరి శ్రమతో సదరు సౌకర్యాలు సమకూరినవో తలవకపోవడమూ అత్యధిక గ్రామస్తులకూ అలవాటైపోయినవి!

          అలాంటి మరొక సుదినమే ఈ సోమవారం(12.09.22)! వారి కష్టాన్ని ఉపయోగించుకొన్నది ఊరి వాళ్లందర్నీ ఆకర్షించే పరిశుభ్ర - సుందరమైన గంగులవారిపాలెం వీధి!

          సుమారొక కిలోమీటరు పొడవునా రోడ్డెక్కాలనీ, కరెంటు తీగల్ని తాకాలనీ చూసే చెట్ల కొమ్మల్ని తొలగించడమూ, ఎండిన పూల మొక్కల కొమ్మల్ని నరకడమూ, కొన్ని పాదుల్ని సంస్కరించడమూ, ఆక్రమంలో గడ్డి పీకేయడమూ - వ్యర్థాలను ప్రోగేసి, ట్రక్కులోకెక్కించి, చెత్త కేంద్రానికి చేర్చడమూ - ఇవే మరి నేటి గ్రామ భద్రతా చర్యలు!

          ఇళ్ల దగ్గర ఇంతకన్న ఏ పనీ తోచక - అలవాటైన వీధి పారిశుద్ధ్య పనులాపుకోలేక – ఈ ఐదారుగురూ, వారికి సంఘీభావం ప్రకటించిన మరో ముగ్గుర్నలుగురు వృద్దులూ చేసే పనులుగా ఎవరైనా అనుకొంటే అనుకోనీ – ఈ శ్రమ సార్థకతనూ, దాని వెనుక సదుద్దేశ్యాన్ని గ్రహించే సహృదయులకే మా ఆహ్వానం!

          మాలెంపాటి గోపాలకృష్ణ వైద్యుల వారు ప్రకటించిన ఊరి స్వచ్చ – శుభ్ర – సౌందర్య ఉద్యమ నినాదాలతో వారి ప్రయత్నం రేపటికి వాయిదా పడింది!

 

        కావిస్తాం ప్రణామాలు!

వచ్చి – చూసి – మెచ్చినారు వేలాదిగ గ్రామస్తులు

అప్పుడపుడు శ్రమించారు వందలాది సహోదరులు

ఆర్థిక సాయమొనర్చిన దందులో డజన్ల మంది

మరి - కదలని మెదలని వారికి కావిస్తాం ప్రణామాలు!

- నల్లూరి రామారావు,

  12.09.2022.