2533* వ రోజు.......           13-Sep-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం!

5 + ముగ్గురు ఔత్సాహిక కార్యకర్తల ప్రయత్నం - @2533*

          ఊరి కోసం ఉడత సేవగా మంగళవారం – రెండో మూడో వాన జల్లుల నడుమనే – విక్రమార్క మహారాజును గుర్తుకు తెస్తూ – 1 వ వార్డుకు చెందిన బాలికల వసతి గృహం మొదలు భారతలక్ష్మి వడ్లమర దాక - గంటన్నరకు పైగా జరిగిన ఒక అత్యావశ్యక, అత్యాదర్శ శ్రమదానం!

          ఈ 5+3 అంకెల్లో ఐదుగురేమో ఎప్పట్లాగే కరుడుకట్టిన శ్రమదాతలు – చెమటతో వాళ్ల చొక్కాలు తడవని రోజు ఉండదు. (ఆ చెమటలు, ఆ అలసటలు స్వార్థానికి కాక - పరార్థానికి కావడమే విశేషం!) మిగిలిన ముగ్గురేమో వయసు మళ్లిన - కొంచెం ఓటి కార్యకర్తలు - గట్టిగా శ్రమించకపొయినా, ఏదో ఇంటి దగ్గర ఉండబట్టలేక – వెళ్ళి శ్రమించే వాళ్లకి వత్తాసు పలుకుతూ, ఏతత్ శ్రమతో క్రమంగా మెరుగుపడుతున్న వీధి పారిశుద్ధ్య, సౌందర్యాల్ని ప్రత్యక్షంగా గమనించే వాళ్లన్న మాట!

          హాస్టల్ ఎదుట పడిపోయిన చెట్టు కొమ్మలు తొలగించి, పద్మాలలోని చెట్టును సుందరీకరించి, అదే ఊపులో వడ్లమర ద్వారం దాక 10 చెట్ల పచ్చదనానికి అందాలు అద్ది, రోడ్డును ఊడ్చి, వ్యర్థాల్ని ట్రాక్టర్ లో నింపి, తమ గంటన్నర కష్టంతో బాగుపడిన 100 గజాల వీధిని చూసుకొని మురిసి...... ఇదంతా స్వచ్చ కార్యకర్తల అనివార్య దినచర్యేననుకోండి!

          ఎవరో గాని - ఏ సందర్భంలోనో గాని “రెస్క్యూ టీమా – తుస్క్యూ టీమా? ఈ పాటి శ్రమదానం మేంచేయలేమా?..” అని సరదాగానే కాబోలు - అన్నట్లు తెలిసింది! ఆ పంతాలు నెరవేరితే - ఊరికి అదీ మంచిదే!

          తమ నేటి పని ముగించి, 6.30 వేళ కాఫీలు కూడ చప్పరించి, గస్తీగది వద్దనే తూములూరి లక్ష్మణరావు నినదించిన గ్రామ స్వచ్చ - శుభ్ర - సుందరోద్యమ సంకల్పాన్ని ప్రతిధ్వనించిన ఊరి రక్షకదళానికి జేజేలు!

          రేపటి వేకువ బైపాస్ వీధి పూల మొక్కల ప్రతిష్టాపనకోసం బైపాస్ రోడ్డులోని పాల కంపెనీ  దగ్గర కలుద్దాం!

           కావిస్తాం ప్రణామాలు - 161

నిర్లిప్తత వదల లేదు - నిరామయం తొలగలేదు

ఎవ్వరి సంక్షేమానికి ఇంతగ కృషి జరిగిందో  

ఆ గ్రామస్తులలో కదలిక అంతంతగ వస్తున్నా -

సడలని దీక్షగ సాగిన సంయమనానికె ప్రణతులు!

- నల్లూరి రామారావు,

  13.09.2022.