1916* వ రోజు....           09-Feb-2020

  ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1916* వ నాటి స్వచ్చంద శ్రమదానం.

          నిన్నటి గ్రామ బాధ్యతల తరువాయిగా ఈ నాటి వేకువ 4.00 నుండి 6.30 దాక జరిగిన కార్యకర్తల శ్రమదాన వివరాలు:

 

          సాగర్ టాకీస్ సమీపంలో తమ స్వచ్చ శుభ్ర పనిముట్ల వాహనాలను నిలుపుకొని, ఆ సమీపంలోని నాలుగు రోడ్లను రెండు బృందాలుగా విడిపోయిన కార్యకర్తలు శుభ్రపరిచారు. ఈ నాటి వీరి సంఖ్య మొత్తం 37.

 

          గ్రామ రక్షక దళం (విలేజ్ రెస్క్యూటీమ్) విజయ్ నగర్ 2 వ వరుస చివరిలోని డా. గోపాలకృష్ణయ్య గారి ఇంటి ఆవరణ రద్దును ట్రాక్టర్ నింపుకొని డంపింగ్ కేంద్రం దగ్గర క్రొత్తగా నిర్మాణంలో ఉన్న దారి దగ్గరకు చేర్చారు. వీళ్ళు గత 4 రోజుల నుండి పాగోలు గ్రామంలోని నూతన భవన నిర్మాణ వ్యర్ధాలను ట్రాక్టర్ తో తెచ్చి బస్ ప్రాంగణ తారు మార్గాన్ని పటిష్ఠపరచడం తెలిసిందే.

 

          మిగిలిన వారిలో సగం మంది బైపాస్ మార్గం నుండి గుంటూరు బాపనయ్య భవనం దాక దారిని అన్ని విధాలుగా శుభ్ర - సుందరం చేశారు. మిగిలిన వారు సంత బజారు పొడిగింపుగా ఉన్న దారి మొత్తం డ్రైను వ్యర్ధాలతో సహా బయటకు లాగి రోడ్డును ఊడ్చారు.  ఈ భాగం కొంత వరకు చీకటిలోనే శుభ్రపరచవలసి వచ్చింది.

 

           మరికొందరు కార్యకర్తలు  సాగర్ టాకీస్ ప్రహరీ బయట ట్రాక్టర్ షెడ్డు సమీపంలోని రాళ్ళ - ఇసుక – మట్టి మిశ్రమాల గుట్టను డిప్పలకెత్తి మోసి అక్కడి రహదారి వనం రెండు ప్రక్కల ఎత్తుగా పేర్చారు. పనిలోపనిగా సాగర్ టాకీస్ మలుపుదాక ఆ రోడ్డును కూడా శుభ్రపరిచారు. అనగా -  సాగర్ టాకీస్ సమీపంలోని నాలుగు చిన్న రోడ్లు ఈ కార్యకర్తల శ్రమదానంతో పూర్తిగా స్వచ్చ సుందరములైపోయినవి.

 

          గ్రామ సుందరీకరణ సైనికులైదుగురు కుంచెలు, రంగులు వంటి తమ ఆయుధాలతో RTCబస్  ప్రాంగణంలోని గత వారం రోజుల చిత్రలేఖనాన్ని చాలా వరకు ఈరోజు పూర్తిచేయగలిగారు. ఈ దీక్షతో  7 గంటల తరువాత కూడా ఆ బస్ ప్రాంగణంలోనే ఉండిపోయారు.

 

          యువ కార్యకర్త – ఉస్మాన్ షరీఫ్ తన శక్తి వంచన లేకుండా బిగ్గరగా ముమ్మారు ఎలుగెత్తి ప్రకటించిన స్వచ్చ సుందర గ్రామ సంకల్ప దీక్షా నినాదాలతో 7.05 నిముషాలకు గాని నేటి మన గ్రామ బాధ్యతలు పూర్తి కాలేదు. నేటి సమీక్షా సమావేశంలో :

 

          మొన్న హఠాన్మరణం చెందిన మన ఆదర్శ కార్యకర్త రాధాకృష్ణ అనారోగ్య కారణాలను గ్రహించిన కార్యకర్తల మనస్సులలో ఈరోజు ఎందుకో ఆరోగ్య స్పృహ పెరిగింది. డా. దాసరి రామకృష్ణ ప్రసాదు గారిని కొన్ని జబ్బుల లక్షణాలను గూర్చి ప్రశ్నించి, వైద్య పరీక్షల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారిలో ఒకరిద్దరు ఇక ముందు పొగ త్రాగరాదని నిర్ణయించుకున్నారు కూడా.

 

          మనకోసం మనం ట్రస్టు ఖర్చుల నిమిత్తం రాయపాటి రాధాకృష్ణ గారు ప్రతి నెలలాగే ఈరోజు కూడా 1000 విరాళం కూడా విరాళంగా ఇచ్చారు. టి. సాంబశివరావు గారు తన మనువడు హావీష్ పుట్టిన రోజు సంధర్భంగా 500 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ ఉభయుల ఔదార్యానికి మనందరి  కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాభినందనలు.   

 

          రేపటి మన దైనందిన గ్రామ బాధ్యతల నిర్వహణ కోసం కోట దగ్గరి మూడు రోడ్ల కూడలి దగ్గర కలుసుకొందాం.   

 

       కాకపోరోయ్ శ్లాఘనీయులు?

ప్రదర్శనగా స్వచ్చ సైన్యం గ్రామ బాధ్యత నిర్వహించదు

ప్రస్ఫుటంగా – ప్రమోదంగా – ప్రతిదినం శ్రమ విరాళంగా

రెండు లక్షల గంతలుగ తమ నిండు మనసులు సమర్పించే

స్వచ్చ సుందర సైనికులు కడు శ్లాఘనీయులు కాకపోరోయ్!

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

ఆదివారం – 09/02/2020

చల్లపల్లి.