2534* వ రోజు... ....           14-Sep-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

మరింత ఉత్సాహంగా 27 మంది కర్తవ్య నిర్వహణం - @2534*

          ఈ బుధవారం (14.9.22) ఆ కర్తవ్యం మొదలై, ముగిసింది 4.17 - 6.06 సమయాలకు! ఆ కర్మక్షేత్రం ఉపమార్గంలోని పాలకేంద్రం నుండి నారాయణరావునగర్ తొలి ప్రవేశ మార్గం దాక! వెళుతూ/ వస్తూ సాక్షీభూతులైన గ్రామస్తులు 50/60 మంది! వారిలో అగి, సంఘీభావం తెలిపీ లేక చేయి కలిపినది సున్నా మంది!

          ఈ గణాంకాలకేం గాని, ఇది 2534* నాళ్ళ తంతే గాని, తమ కళ్లెదుటే - తమ ఉమ్మడి ప్రయోజనార్థమే - తమ ఊరి వారందరి ఆహ్లాద ఆరోగ్య సాధనార్థమే - జరిగే ఒక వినూత్న యజ్ఞాన్ని నా గ్రామస్తులు కొందరు ఉపేక్షించడం చర్విత చర్వణమే గాని... నేటికి ఎనిమిదేళ్లుగా ఒక లక్ష్యం కోసం అడుగులేస్తున్న స్వచ్ఛ కార్యకర్తల తాజా ప్రయత్నమేమిటో చూద్దాం!

          ఆరేళ్ల క్రితం ఇరుకుగా - బహిరంగ విసర్జనల గబ్బుగా - కబ్జాకేంద్రంగా ఉన్న ఈ బైపాస్ వీధి స్వరూపం ఇప్పుడింత పొందికైన ఉద్యానాలతో, పూల మొక్కలతో, వాటికి రక్షణగా కంచెలతో – వీలైనంత విశాలంగా – సౌకర్యంగా ఎలా మారిందో - ఎలా మార్చగలిగారో – ఏ స్వచ్చ కార్యకర్తనడిగినా చెపుతాడు! క్రమశిక్షణతో బాటసారుల్ని ఆత్మీయంగా పలకరించే ఏ పువ్వును, ఏరెమ్మనడిగినా – వినగలిగితే రమణీయంగా వివరిస్తాయి! లోతుగా ఆలోచిస్తే – పరుల కోసం చేసే శ్రమ శక్తి లెక్క కూడ తేలుతుంది!

          తమ శ్రమతో - చెమటతో రూపొందిన బైపాస్ వీధంటే అందుకే కార్యకర్తలకంత మక్కువ! కనుకనే మురుగు కాల్వ అంచున గంటకు పైగా ప్రతి కలుపును పీకి, ప్రతి మొక్కను సుందరీకరించి, ప్లాస్టిక్ వంటి వ్యర్ధాలను ఏరి, కొందరు వీధిని ఊడ్చి, తమ ఇంటి పెరడంతగా శుభ్రపరిచి, ఈ 100 గజాల బాటను తీర్చిదిద్ది, సంతృప్తిగా చూసుకొన్నారు!

పాలకేంద్రం దగ్గర జరిగిన సమాక్షా సందడిలో :

- బహుశా తొలిమారేమో – ఈ ఉద్యమ తొలి వీరుడు డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాదు ప్రకటిత గ్రామ బాగుదల నినాదాలు,

- 20 వ తేదీ చల్లపల్లిలో ప్రస్థానించనున్న అమరావతి పరిరక్షక వందలాది రైతుల పాదయాత్ర సంగతులూ,

- వెలగపూడి వరప్రసాద్ గారి 35,000/- లు, దాసరి లక్ష్మీరాణి గారి 20,000/- ల వితరణా  చర్చకొచ్చాయి!

నారాయణరావు నగర్ తొలి వీధి దగ్గర నుండే మన రేపటి వేకువ దినచర్య మొదలు.

           కావిస్తాం ప్రణామాలు – 162

వీధివీధినీ, మురుగు కాల్వలను స్వచ్ఛ - సుందరము కావించుటకై

అష్టవర్షముల కష్ట ఫలితముగ, నిష్టనియములు – స్పష్ట మార్గమున

పరిశ్రమించే - పరిక్రమించే - పరిప్లవించే స్వచ్చ వీరులకు,

పరాక్రమించే ధన్యజీవులకు స్వాగతాంజలులు! ప్రణామంబులు!

- నల్లూరి రామారావు,

  14.09.2022.