2535* వ రోజు....           15-Sep-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

గ్రామ కాలుష్యం మీద కత్తి యుద్దం - @2535*

        గురువారం వేకువ 4.19 నుండి 6.10 దాక బైపాస్ మార్గంలో (VJA MTM) 27+1 మందిది కత్తులతోనే గాదు - దంతెలు, పారలు, చీపుళ్లు, డిప్పలు, పంజాలు వాడి జరిపినది ఒక సాత్విక – సహనశీల సమరమే!

        నిజానికది 100 కు పైగా ఉన్న చల్లపల్లి వీధులన్నిట్లో - ఏదో రూపంలో - ఎంతో కొంతమంది స్థానికులు చేయవలసిన వినమ్ర సమరమే గాని, సాగర్ టాకీస్ ఉపవీధిలో ఒక్కచోట - అనగా నారాయణరావు నగర్ ముఖద్వారం కేంద్రంగా మాత్రమే - 100 గజాల జాగాలోనే జరిగింది.

        నేటి వేకువ శ్రమదానంలో చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలకు - ఎక్కడో రాజోలు నుండి వచ్చిన ఒక సజాతీయ స్వచ్చ పక్షి (రామమోహనరావు గారు – విశ్రాంత ఉన్నతోద్యోగి) కూడ తోడయింది! చీపురు పట్టి, డిప్పలెత్తి, వంగి శ్రమించి చల్లపల్లి శ్రమదానం రుచి చూసింది!

        విశేషమేమంటే - స్థానిక పాతిక ముప్పై ఇళ్ల వారు గాని – మరో 30 – 40 మంది వాహన, పాదచారులు గాని బొత్తిగా జోక్యం చేసుకోపోవడం! నేటి ఝరీ వేగ ప్రపంచంలో - హడావుడి బ్రతుకుల్లో – ఇక్కడ వివిధ వయసుల, హోదాల వాళ్ల ఈ వీధి పారిశుద్ధ్య సుందరీకరణ ప్రక్రియ ఎందుకు జరుగుతున్నదో నిదానించి, ఆలోచించే అవకాశం ఉన్నదా?

        సరే! ఎవరి విధి నిర్వహణ వాళ్లది. తమ ఊరి బాధ్యతా పరాయణులైన 25 మంది కర్మిష్టులు మాత్రం తమ లక్ష్య సాధనలో తాము మునిగారు. బైపాస్ నుండి ఉత్తరంగా

1) మురుగుకాల్వ వంతెన,

2) ఉత్తరంగా ఇంకో 20 25 గజాల 2 వ నంబరు వీధి

3) 50 - 60 గజాల రహదారి ఉద్యానము శుభ్రపరిచే వాళ్లు పరిచారు; వీధుల్ని చీపుళ్లతో ఊడ్చే వాళ్ళు ఊడ్చారు; వంచిన నడుమెత్తక పారల్తో సుందరీకరించే వాళ్ళూ తమ గమ్యాన్ని చేరుకొన్నారు. (ఒకాయనైతే - చెమటనూ ఉక్కనూ భరించ లేక చొక్కా విప్పేసి పని చేసుకుపోయాడు!)

        కార్యకర్తలకీ పనులు క్రొత్తనీ  కాదు - వాళ్ల సామాజిక బాధ్యతా భావం సడలిందనీ కాదు – గ్రామ సోదరుల్నుండి క్రొత్త కార్యకర్తలెందుకు వచ్చి కలవలేదనే సందేహం మాత్రమే!

        ఇక నిన్నటి వుడత్తు రామారావు గారి సుపుత్రుడు వేంకటేశ్వరరావు స్వచ్చోద్యమానికి ఇచ్చిన 5,000/- విరాళము,

        నేడు  మాలెంపాటి గోపాలకృష్ణ వైద్యుల వారి నుండి స్వీకరించిన నెలవారీ 2,000/- విరాళమూ కృతజ్ఞతాభివందన పూర్వకంగా స్వీకరించడమైనది.         

        6.20 నుండి కాఫీల సరదా తీరి, బైపాస్ వీధి నివాసులు చెవుల తుప్పు వదిలేలా మాలెంపాటి అంజయ్య ముమ్మారు అదరగొట్టిన ఊరి స్వచ్చ – పరిశుభ్ర – సౌందర్య సంకల్ప నినాదాలూ, నేటి - రేపటి కృషి వివరాల సమీక్షా 6.35 కు ముగించి, తమ సొంత పనుల నిమిత్తం అందరూ గృహోన్ముఖులయ్యారు.

        రేపటి వేకువ శ్రమదానం కోసం మన పునర్దర్శన ప్రదేశం బైపాస్ రోడ్డులోని నారాయణరావు దారిలో కలుద్దాం.   

        కావిస్తాం ప్రణామాలు – 163

అడవులందు వెన్నెలలా? బూడిదలో పన్నీరా?

కడలిలోన చినుకు వలె - కదలాడని గ్రామానికి

లక్షలాది గంటల శ్రమదాన మిట్లు నిర్వహించు

కర్మిష్టులు – ధీరులకే కృతజ్ఞతా ప్రణామాలు!

- నల్లూరి రామారావు,

  15.09.2022.