2536* వ రోజు ....           16-Sep-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

ఒక ఊరి స్వచ్ఛ - సుందరీకరణ ప్రస్తావన - @2536*

          శుక్రవారం (16.9.22) నాడు ఊరి ఉమ్మడి సౌకర్యాల కోసం 13 మందికి ఎప్పుడు మెలకువ వచ్చిందో గాని, బైపాస్ వీధిలో తొలి మారు కన్పించింది మాత్రం 4.19 కి! మరో పద్నాలుగు మంది నిముషాల క్రమాన వచ్చి కలిసి, మొత్తం 27 మందీ కష్టించి బాగుపరచింది మరొక 100 గజాలకు పైగా!

          ఎనిమిదేళ్ల చల్లపల్లి స్వచ్ఛ– సుందరోద్యమ శ్రమదాన సంబంధీకులు మొత్తం 170 180 మంది అనుకుంటే - ఇటీవల రోజూ 30/40  మందైతే ఈ సముచిత (అ) గౌరవ వృత్తిలో బాగా స్థిరపడ్డారు. సీనియర్ వైద్యుల, విశ్రాంత వృద్ధుల, కొందరు రైతుల, గృహిణుల, ఉద్యోగులతో గూడిన ఈ 40 మందిని చూస్తుంటే కొన్ని మార్లు “ఇక వీళ్ల ఖర్మ ఇంతేనేమో – గ్రామ సమాజ బాధ్యతలలోనే  వీళ్ల బ్రతుకులు తెల్లారతాయేమో.....” అని నాకనిపిస్తూ ఉంటుంది!

          “ఈ శుభోదయ సుందరోద్యమం ఎక్కడ ఆగిపోతుందో అని దిగులు చెందే వాళ్లూ, “మిగిలిన ఊరివాళ్లు సైతం ఆగామి దినాల్లో వచ్చి చేతులు కలపకపోతారా?” అనుకొనే ఆశావహులూ, “ఇంకో ఎనిమిదేళ్లకై నా సొంతూరి పట్ల తమ కలలు నిజం కాక తప్పుదు” అనే ధృఢ సంకల్పులూ ఉన్న ఈ బృందం యొక్క గొంతెమ్మ కోర్కెలు తీరాలనేదే ఎందరెందరో శ్రేయోభిలాషుల ఉద్దేశం కూడ!

          ఈ పూట పని వేళ ‘జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం’ వాట్సప్ లో డి.ఆర్.కె. డాక్టరు గారో, శాస్త్రి మహాశయుడో పెట్టిన కొన్ని ఫోటోలను చూస్తే ఒక ప్రక్క ఆశ్చర్య విభ్రమాలూ, మరో వంక మనసు జలదరింపూ! “అష్టవర్షీయసి ఐన స్వచ్ఛ సుందరోద్యమం ఉన్న చల్లపల్లి వీధిలో - 100 గజాల్లోనే  ఇన్ని ప్లాస్టిక్ తుక్కుల గుట్టలా? ఇంత కశ్మలం ఎవరి లోపం - ఎవరికి శాపం – ఏ ఊరికి మచ్చ?” అనిపించదా!

ఏమైతేనేం - ఈ పాతిక మంది కర్మ వీరులు ఏమాత్రం ప్రాలు మాలక

1) అన్ని వ్యర్ధాలనూ వర్గీకరించారు – తమ చేతి పని నైపుణ్యంతో.

2) కొన్ని ప్రాత మొక్కల్ని సుందరీకరించారు – కత్తులతో; వంగి పాదుల్ని సవరించారు – ప్రేమతో

3) మురుగు మట్టి నుండి ఎన్నెన్నో ప్రాత గుడ్డల్ని గుట్టలుగా ఏరారు - ఓర్పుతో.

4) ట్రాక్టరు ట్రక్కుకు సరిపడా డిప్పలతో నింపి, చెత్తకేంద్రానికి రెండు మార్లు చేర్చారు - అలవాటుగా.

          ఈ వీధిలోని జనం గాని, పాత కార్యకర్తలు గాని ఈ గంటన్నర శ్రమదానం చూసి చలించనూ లేదు – వచ్చేపోయే వారు ఆగి పట్టించుకోనూ లేదు!

          కాఫీ ఆస్వాదనల పిదప ముమ్మారు కార్యకర్తల శ్రమ వైభవాన్ని కీర్తించినదీ, కొన్ని మంచి సుద్దులు వినిపించినదీ అడపా గురవయ్య గురువు. మరిన్ని పూల మొక్కల ప్రతిష్టాపననీ, రెండు మినీ ఉద్యానాల పొందికనీ చూసి పరవశించి, సమీక్షించించినది డాక్టరు రామకృష్ణ ప్రసాదు.

          రేపటి శ్రమదాన సందడి కోసం సాగర టాకీస్ ప్రక్కనే కలుసుకొందాం.

        కావిస్తాం ప్రణామాలు – 164

ప్రేరేపిత సంస్కారులు - వీరోచిత శ్రమ ధీరులు

బాధ్యతలకు సరిహద్దులు – ప్రజా సేవ తొలి ప్రొద్దులు

జాగృతితో దిన దినమూ జనం కొరకు కృషీవలులు

స్వచ్ఛ కార్యకర్తలకే సమర్పింతు తొలి ప్రణతులు

- నల్లూరి రామారావు,

  16.09.2022.