2537* వ రోజు....           17-Sep-2022

కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

స్థిరవారం నాటి శ్రమదానం సంగతి - @ 2537*

          17.09.2022 వ వేకువ శ్రమ దాతలు 29 మంది ; వాళ్ల సేవలందుకొన్న చోటు ఉప మార్గము నందలి సినీ ప్రదర్శన శాల దగ్గర ; శుభ్రపడి,  అద్దాలుగా మారిన వీధి మార్జిన్లు 2 ; అన్నీ కలిసి వ్యర్థాలు పెద్ద ట్రాక్టరు నిండుగా ; చల్లని వేళే గాని, కార్యకర్తల చెమటలు దండిగా; 4. 14 & 6. 05 నడుమ బాగుపడిన 100 గజాల వీధిని చూసిన శ్రమదాతల సంతృప్తి మాత్రం మెండుగా!

స్థూలంగా 2537 * వ నాటి గ్రామ మెరుగుదల కృషి ఇది.  మరి కొంత వివరాల్లోకి పొతే :

1)  20 రోజుల్నాడు కంటి శస్త్ర చికిత్స జరిగిన పైడిపాముల రాజేంద్రుడు బరువు కొమ్మలు మోయడం, ట్రాక్టరు తోలడం;

2)  ప్రస్తుతానికి దుబాయికి చెందిన అత్యున్నత సాఫ్ట్ వేర్ నిపుణుడు(నాగేంద్ర కుమారుడు) గంటన్నర పాటు అత్యంత హార్డ్ వేర్ పనివాడుగా మారిన వైనం ;

3) 10 మంది కార్యకర్తలు కండలు కరిగేలా- చెమటలు దిగ గారేలా కత్తులు వాడి చెడు మొక్కల్ని, గడ్డిని తొలగించి రెండు ఉద్యానాలను క్షుణ్ణంగా శుభ్ర పరిచి వదలడం ;

4) కొందరు మహిళామ తల్లులు చీపుల్లేమిటీ పంజా లేమిటీ డిప్ప లేమిటీ అవసరార్థం ఏదైనా వాడి సదరు వీధి భాగాన్ని తీర్చిదిద్దడం,

5) మిగిలిన వాళ్ళేమీ తమాషా చూడడం కాదు- మురుగు కాల్వ గట్లను సరిదిద్దో , మన్ను గుట్టల్ని చదును పరచో, ప్లాస్టిక్ దరిద్రాల్ని వదల గొట్టో,..... అలా ఎక్కడేపనికైనా కదలడం;

6) ఇన్ని మకిల గుట్టల్ని ట్రాక్టర్ దగ్గరకు మోసి, డిప్పల్ని అందులోకి విసిరి, అర గంటలోనే అందులోకి ఎక్కించడం సరే క్రమ పద్దతిలో ట్రక్కులో సర్ది పట్టించిన కార్యకర్తదొక కళ!

          నిజం చెప్పవలెనంటే ఈ ఉషోదయాన 50 పని గంటలు ఊరి కోసం తమ శ్రమనూ,  సమయాన్ని ధార పోసిన కార్యకర్తలదెంత సంతృప్తో నన్ను గనుక స్వేచ్చగా వదిలేస్తే వాళ్ల దృక్పథాన్నీ, సుదీర్ఘ కాల సమున్నత లక్ష్య నిబద్ధతనీ 10 పేజీలైనా వర్ణిస్తే గాని నాకూ ఒక సంతృప్తి!

నేటి 6.25 వేళ సమీక్షా కార్యక్రమంలో ప్రస్తావిత అంశాలు :

- మంగళ, బుధ వారాల్లో ఈ ఊళ్లో జరిగే అమరావతి పాద యాత్రికుల విషయమూ- ఐచ్చికంగా కార్యకర్తలందులో పాల్గొనే సంగతీ,

- సముద్ర తీర పరిశుభ్రతా దినం గుర్తింపూ,

- సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకపు, ఫ్లెక్సీల నిషేధపు సంగతుల్ని గురించి కలెక్టరు గారికి, విజ్ఞాపన పత్రాల ఆమోదమూ, సంతకాలూ...

- అంతకు ముందుగా ఈ ఊరి మొక్కల విక్రేత తాతినేని వేంకట రమణుని స్వచ్చ-శుభ్ర- సౌందర్య  నినాదాలు!

          మన రేపటి వేకువ కృషి కూడ సాగర్ ప్రదర్శన శాల దగ్గరే ఉండ గలదు.           

          కావిస్తాం ప్రణామాలు  165

అలవి కాని ఊరి పనులు తలకు ఎత్తు కొన్నాడో!

తొలి వేకువ తెలి రేకలు ఊరికి అందిస్తున్నాడో!

ప్రజాసేవ లోని మజా  ఆస్వాదిస్తున్నాడో...!

స్వచ్చ కార్యకర్త ఉషోదయ సేవకు ప్రణామం!

- నల్లూరి రామారావు,

  17.09.2022.