2538* వ రోజు....           18-Sep-2022

కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

2538* వ (ఆదివారం) నాటి వీధి పారిశుద్ధ్యం.

          ఆ వీధి శుభ్రతైతే 4.20 కే మొదలయింది! ఈ వేకువైతే 43 మందికి  అందులో ప్రమేయం ఉన్నది! అది జరిగిన సినిమా ప్రదర్శన శాల ప్రాంతం నుండి బహుశా ఒక్కరికే పూల బుజ్జి భార్యామణి (వార్డు ప్రతినిధి) గారే పాల్గొన్నారు! రామానగరం, లంకపల్లి, మొవ్వ, శివరామ పురం వంటి గ్రామేతరుల కృషి అందులో ఉన్నది! స్వచ్చ-శుభ్రతా ప్రయత్నంకాక కనీసం 20 పూల మొక్కలతో ఉప వీధిని సింగారించడమొక విశేషం!

          మరి ఇన్ని ఊళ్ల నుండి- ఇందరు ఇంత వేకువ చీకటిలో ఈ వీధికి ఈ పాటి సేవలందిచడమెందుకో, నా ఊరి సోదరులు మైకు పాటల్ని పట్టించుకోక శ్రమదాన సందడికి దూరంగా అంటీ ముట్టక ఉండిపోవడ మేమిటో గట్టిగా ఆలోచించవలసింది నాతో బాటు నా గ్రామస్తులూ- ముఖ్యంగా బైపాస్ వీధి నివాసులూ! మనం పోటీ పడవలసింది వీధుల్ని ఫ్లెక్సీలతో నింపడంలో కాదు, వీధి ఉద్యానాలను చెడగొట్టడంలో కాదు, మనం బ్రతికే ఊరి సమస్యల్ని పెంచడంలోనో వీధి మార్జిన్ల ను దురాక్రమించడం లోనో కానేకాదని మనవి!

          అసలు ఇది స్వచ్చ సుందర చల్లపల్లిఅనీ, దాన్ని సాధిస్తున్నదొక శ్రమ సుందరోద్యమమనీ, 2538* నాళ్లుగా అలుపెరుగని కార్యకర్తల 4 లక్షల పని గంటల ప్రయత్నం ఎందుకనీ కొన్ని నిముషాలైనా  స్తిమితంగా ఆలోచించలేమా? ఆపాటి ఆలోచనతో పోయేదేముంది మనోమాంద్యం తప్ప? వీలైన రోజుల్లో స్వచ్చ కార్యకర్తలతో కలిస్తే పోయేదేముంది- చిన్న చిన్న ఆంతరంగిక, శారీరక అనారోగ్య సమస్యలు తప్ప?

          మరి ఇందుకు గాదూ ఇన్ని ఊళ్ల, ఇన్ని వర్గాల, పగలు తీరిక చిక్కని ఇందరి ఉద్యోగుల- వృద్ధుల- మహిళల- వైద్యుల ఈ బ్రహ్మ ముహూర్తపు నిత్య సేవలు?

40 మందికి పైగా సాగర్ హాలు పరిసరంలో చేసిన కాయకష్టం తో:

-  మరింత వీధి భాగం చూడబుద్ధి అవుతున్నది.

-  ఇంకొక్క పూట శ్రమిస్తే సినిమా హాలు దాక పూల మొక్కల సింగారం పూర్తి కావచ్చు- బహుశా అది మంగళవారమే కావచ్చు.

6. 25 కాలంలో ఒక సంతృప్తిదాయక సమావేశం విశేషాలు:

1) లంకపల్లి మూలం గల మొవ్వ నివాసి శొంఠి శ్రీనివాస గురూజీ తన కుమార్తె జన్మదిన వేడుకను ఈ నిస్వార్థ  శ్రమ జీవుల మధ్యనే జరిపి, సకుటుంబంగా పూల మొక్కలు నాటి, చల్లపల్లి స్వచ్చోద్యమానికై 5000/- విరాళం సమర్పించిన ఒక సముచిత ఆదర్శం!

2) గాయకుల శ్రమదాన కీర్తనా గానం,

మంగళ వారం నాటి వీధి పారిశుద్ధ్యం సైతం ఈ బైపాస్ మార్గంలోనే!

   కావిస్తాం ప్రణామాలు – 166 

ఏ కాలంలో గానీ ఏ దేశంలో గానీ

ఎవరొ ఉద్ధరించాలని ఎదురు చూడకుండ స్వయం

శక్తి నె నమ్ముచు ముందుకు సాగు బాధ్యులున్న చాలు-

ఆ చొరవ కె చేతన కే అందిస్తాం ప్రణామం!

- నల్లూరి రామారావు,

18.09.2022.