2539* వ రోజు....           19-Sep-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

19-9-22 రోజున బెజవాడ/ గంగులవారి పాలెం రోడ్ల కృషి - @2539*

            సోమవారపు వేకువ స్వచ్చ కుటుంబీకుల్లో ఒక మంచి చతుష్టయం – (వాళ్లనే కొందరు రెస్క్యూ టీమ్ అంటారు.) ఊరి మేలు కోసం గంటన్నరకు పైగా శ్రమించి, అనుకొన్నది సాధించింది!

            వాళ్లనుకొన్నది గంగులవారి పాలెం బాటలోని బండ్రేవు కోడు మురుగు కాల్వ గట్టును పటిష్టపరచడం ద్వారా సదరు సుందర వీధి రోడ్డు మన్నిక!

            వేకువ నుండీ పడుతున్న చినుకుల వల్లేమో ఈ ముఠాలో ఇంకా ఇద్దరు ముగ్గురు రాలేదు. ఉన్న నలుగురే చిల్లలవాగు వంతెన నుండి విజయవాడ రోడ్డులో నిరర్థకంగా పడి ఉన్న కొన్ని ట్రీ గార్డుల్ని జాగ్రత్తగా సేకరించి, ట్రక్కులో కెత్తుకొని, 3 ½  కిలోమీటర్ల దూరంలోని బండ్రేవు కోడు ప్రక్క రోడ్డు మార్జిన్ కోసుకుపోకుండా రక్షించే ప్రయత్నం చేశారు.

            నిజం చెప్పాలంటే ఈ ఊళ్ళో చాలా రోడ్లు స్వచ్ఛ కార్యకర్తలవే! అంటే వాళ్లు ఊడ్చి, చెట్లు, పూల మొక్కలు నాటి పెంచి, మార్జిన్ల కబ్జాల మీద కన్నేసి ఉంచి నవన్నమాట! అవి కేవలం వాడుకొనేందుకో చెత్త పడేసేందుకో అందరి వన్నమాట! మరి - ఇదెంత కాలమో ఎప్పటికి  ఊరి స్వచ్ఛ - శుభ్ర సౌందర్య స్పృహ 100 శాతం మందికి సిద్ధిస్తుందో!

            యధాప్రకారం ఈ టీము తరుపున తమ ఊరి స్వచ్చ శుభ్ర సుందరీకరణోద్దేశాన్ని ముమ్మారు BSNL నరసింహారావు ప్రకటిస్తే నేటికి వారి కృషి ముగిసింది.

            రేపటి వేకువ మన పునర్దర్శన ప్రదేశం సాగర్ ప్రదర్శనశాల దగ్గర!

      కావిస్తాం ప్రణామాలు 167

స్వచ్ఛసేవ ఊరికి మన బాధ్యత నుట పచ్చి నిజం

అదొక పెద్ద ఘన కార్యం అనుకొంటే అబద్ధం

ఐతే - సమకాలంలో ఆ మాత్రం సామాజిక

కర్తవ్యం పాటించే ఘనులకె మా ప్రణామం!

- నల్లూరి రామారావు,

  19.09.2022.