2540* వ రోజు....           20-Sep-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

మంగళవారం (20-9-22) నాటి శ్రమదాన ప్రస్థానం - @2540*

            అది బ్రహ్మ ముహుర్తాన 4.19 AM కే ప్రారంభం; 6.06 కాలానికే పరిమితం! అధిక సంఖ్యాక గ్రామంలో ఊరుమ్మడి శ్రేయోదాయక శ్రమవేడుకలో పాల్గొన్నది 21మందనేది గమనార్హం! అందుకొక కారణం బహుశా వాన ముసురు సంశయం!

            వాస్తవానికి ఈ వాతావరణం ఎలాంటి పూలమొక్కైనా సులువుగా బ్రతికిబట్టకట్టేదే! అందుకే నెల నాళ్ల నాళ్ల నుండి వీధుల్ని గాలించి, ఖాళీ దొరికిన ప్రతిచోట స్వచ్ఛ కార్యకర్తలు మొక్కలు నాటుతున్నారు కంప కట్టుతున్నారు. ఏ వీధి పచ్చదనానికి, అందానికి ఆ వీధి వారు పూచీ పడాలి; ఈ అనునిత్య శ్రమదాతలు రూపొందించిన ఉద్యానాలకు ఆ ఇళ్ల వారు బాధ్యులు కావాలి! కాని.....?

            ఏ మహిళా రైతులో, ఏ కారణానికో పాదయాత్ర చేస్తున్నారని ఇక్కడ మనం విడిపోయి -  అనుకూలంగానో, వ్యతిరేకంగానో ఫ్లెక్సీలతో వీధులు నింపేస్తున్నాం, ఎక్కడో ఏ క్రీడాకారుడో ఏ మూడేళ్ల తరవాతో - సెంచరీ కొట్టాడని, తక్షణం స్పందించి, బ్రహ్మాండమైన ఫ్లెక్సీలు కట్టి, పర్యావరణాన్ని ధ్వంసించి, మన నెత్తి మీద మనమే భస్మాసురహస్తం పెట్టుకొంటున్నాం! మనం పుట్టి - పెరిగి గిట్టే ఊరంతటి మేలు కోసం ఎండనక వాననక 2540* నాళ్లుగా కొందరు శ్రమిస్తుంటే మాత్రం స్పందించం!

            ఈ నాటి కార్యకర్తల శ్రమ సౌందర్యంతో మెరుగులు దిద్దుకొన్న వీధి భాగం సినిమాహాలు ముందు రోడ్డు నుండి రాధానగర్ బాటదాక! కేవలం 20 మంది ఎంత కష్టించినా ఈ 100 గజాల కన్న మించి బాగుచేయగలరా? అసలీ బైపాస్ వీధి మాత్రం ఏం తక్కువ తిన్నది? ప్లాస్టిక్ సీసాలు, కప్పులు, మద్యం గాజుబుడ్లు, క్యారీ బ్యాగులు, రాళ్లు - రప్పలు, వీటన్నిటి నడుమ పిచ్చి - ముళ్ల మొక్కలు.. వీటన్నిటికి సమాధానం చెప్పటం చిన్న పనా?

            ఐనా సరే - కార్యకర్తల దీక్ష చూడండి, సహనాన్ని పరిశీలించండి. కత్తుల్తో అవాంఛిత మొక్కలు నరికి, ప్లాస్టిక్ ఘోరాన్ని ఏరి గడ్డి చెక్కి, దంతెల ప్రోగులు చేసి, చీపుళ్లతో బాటను ఊడ్చి, ఎవరి కోసం  - ఎందు నిమిత్తం గంటన్నర పాటుబడతారో దయచేసి అలోచించండి.

            అతడు కూడ మొత్తానికొక సీనియర్ కార్యకర్తే - వారి నామధేయం జనాబ్ మహ్మద్ జానీ! స్వచ్ఛసుందరోద్యమ నినాదాలిచ్చి, నారా చంద్రబాబు స్థాయిలో ప్రసంగించాక - డి.ఆర్.కె.డాక్టరు గారు సమీక్షా వచనాలు పలికాక - నేటి, రేపటి అమరావతి కృషీవలుర పాద యాత్రను ప్రస్తావించాక - మన మంగళవార శ్రమదానానికొక స్వస్తి!

            గురువారం వేకువ శ్రమ సమర్పణ కోసం ఇదే వీధిలో నేటి తరువాయిగా మనం రాధా నగర్ తొలి వీధి వద్ద కలుద్దాం!

 

            దేశమే పరవశించేదో!

చల్లపల్లిని తీర్చిదిద్దే స్వచ్ఛ - సుందర ప్రయాణంలో

కార్యకర్తకు నూరు శాతం ప్రజామోదం లభించుంటే

ప్రభుత పరిణతి ప్రదర్శిస్తే గ్రామ మొకటే కాదు - మొత్తం

దేశమే పరవశించేదో! తేజమే విస్తరించేదో!

- నల్లూరి రామారావు,

  20.09.2022.