2541* వ రోజు....           22-Sep-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

గురువారం నాటి వీధి సౌందర్యకారులు 25 మంది - @2541*

        22 వ తేదీ వేకువ వాళ్లెన్నింటికి  మేల్కొన్నారో గాని, బైపాస్ మార్గంలోని గత కాలపు ప్రభుత్వాసుపత్రి దగ్గరకు మాత్రం చేరుకొన్నది 4.18 కే! అడపాదడపా చినుకుల్లో తడుస్తూనే బాగుపరచింది100 గజాల వీధి భాగాన్ని! కొసరుగా కబేళా వీధి మొదటి మురుగు కాల్వనూ సంస్కరించారు. ఐదారుగురైతే – ½ కిలోమీటరు దూరంలో – అదే వీధిలో మరిన్ని పూల మొక్కలు నాటారు. ఆలస్యంగా వచ్చిన మాలెంపాటి వైద్యుల వారిది 26 వ నంబరు.

        ఈ 40 కి పైగా పని గంటల శ్రమతో ఊరికి ఏం జరిగిందో - సదరు శ్రమదాతల్ని ఆ బైపాస్ బజారులోని – ఊళ్ళోని ఎందరు ఆదర్శంగా తీసుకొంటారో – ఆ అద్భుతమే జరిగితే - అనగా ప్రతి వార్డులోను, ప్రతి వీధిలోను ఎవరికి వారు స్వయం ప్రేరితులై ఊరి అభ్యున్నతికి పూనుకొంటే.... ఆ విశ్లేషణలు వేరే సంగతి!

        నేటి పాతిక మంది బాధ్యుల ప్రయత్నంతో కాంపౌండర్ ప్రకాశరావు గారి ఇంటి ప్రక్క నేలంతా ఒక నారుమడి స్థాయిలో మొక్కల పెంపకానికి సిద్ధమయింది. మరి -  సుందరీకరణ ముఠానా, మజాకా? ఆ స్థలానికి తూర్పు - పడమరల మినీ ఉద్యానాలు కూడ ఈ గంటన్నర శ్రమతో గడ్డినీ, పిచ్చి మొక్కల్నీ, ప్లాస్టిక్, గాజు సీసాల్నీ, ఇతర గలీజుల్ని వదిలించుకొని చూడగలిగిన అదృష్టవంతులకు కనువిందు చేస్తున్నాయి.

        తదుపరి స్వచ్ఛకథ మామూలే! బజారునూ, మార్జిన్ నూ చీపుళ్లతో ఊడ్చేవారిది, వ్యర్ధాలను దంతెలతో ప్రోగులు చేసిన వాళ్లది, కొడవళ్లతో గడ్డిని చెక్కిన కార్యకర్తలదీ, నేటి -మొన్నటి గలీజు ప్రోగుల్ని డిప్పులకెత్తి, ట్రక్కులోకి బట్వాడా చేసిన నలుగురుదీ – ట్రక్కులోకి లంఘించి, వ్యర్ధాల డిప్పలందుకొని, సర్దిన ఒక రైతు బిడ్డదీ - (ఒక రకంగా ఈ పనిలో స్పెషలిస్టనే చెప్పొచ్చు!) ప్రతి వేకువా చూసే ద్యశ్యాలే!

6.30 కి జరిగిన సమీక్షా సభలో మాత్రం:

1) నిన్నటి అమరావతి రైతు బిడ్డల పాదయాత్ర, ప్రజల స్పందన, లంకపల్లిలో 2000 మందికి పైగా భోజనాలు, క్రమశిక్షణా ప్రముఖంగా ప్రస్తావనకొచ్చాయి.

2) వేల మంది ప్రదర్శనతో పూలు, ప్లాసిక్ సీసాల పాకెట్లతో నిండిన 2 ½ కిలోమీటర్ల బందరు – బెజవాడ రహదార్లు గంటల వ్యవధిలో శుభ్రపడి, ‘స్వచ్ఛ- సుందర చల్లపల్లి’ పేరును నిలబెట్టిన పంచాయితీ వారి సంగతి కూడ.

3) ‘షణ్మఖ’ దుకాణదారుల ప్లాస్టిక్ రహిత వ్యాపారం చర్చకు వచ్చింది!

4) నేటి ఊరి స్వచ్ఛ- పరిశుభ్ర - సౌందర్య సంకల్ప నినాద కర్త భోగాది సూర్యప్రకాశరావు.

        నేటి తరువాయిగా గురువారం వేకువ మనం కలిసి కృషి చేయదగిన చోటు ఇదే బైపాస్ వీధిలో సూరి డాక్టర్‌ వీధి ఎదుట - దింటకుర్తి మోహన్ గారి భవనం ముందర!

 

            అష్ట వర్షపు నిత్య సేవలు!

సహర్షంగా – సమున్నతముగ – సశాంతంగా - సముచితంగా

సహేతుకముగ – సమ్మతంగా - సకల గ్రామాలకు వరంగా

సదాశయముగ – సాహసముగా - సర్వజన సంక్షేమ కరముగ -

సజావుగ ఈ అష్ట వర్షపు స్వచ్ఛ సైన్యం నిత్య సేవలు!

- నల్లూరి రామారావు,

   22.09.2022.