2543* వ రోజు....           24-Sep-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

శనివారం నాటి శ్రమవీరులు 28 మంది! - (@2543*)

          24.9.2022 వేకువ అందులో సగం మంది సంసిద్ధత మరీ 4.14 కే! కార్యకర్తలు ఆగిందీ, ముగింపు సభ జరిపిందీ కమ్యూనిస్టు వీధిలోని అస్మదీయ ఖాళీ స్తలంలోనే! ఇందరు స్వచ్చ కార్యకర్తల శ్రమతో మరింత బాగుపడినది బైపాస్ వీధిలోని మరొక 8090 గజాలే! అందరికీ అది కనిపించదు  గాని - సుమారు గంటా 50 నిముషాల సమయదానంతో, కాయకష్టంతో, సమష్టి ప్రయత్నంతో పులకించింది చల్లపల్లి ఆత్మే!

          ఆ! ఇదొక శ్రమత్యాగం - మైకులు మ్రోగించుకొని, కత్తీ కటార్లు పట్టుకొని ఏ ప్రచారం నిమిత్తమో జరిగే తంతు కూడ ఒక ప్రశంసార్హమా.....!” అనే తేలిక భావం ఇప్పటికీ ఎందరు గ్రామ సోదరుల్లో ఉందో గాని, అట్టివారు దయ ఉంచి చేయదగ్గవి రెండే!

1) ఏ ఆదివారమో ఖాళీ సమయంలో శ్రమదాన స్థలానికి వచ్చి, స్వయంగా స్వచ్ఛ కార్యకర్తలతో కలవడం,

2) జై స్వచ్చ చల్లపల్లి సైన్యంమాధ్యమాన్ని సానుభూతితో పరిశీలించడం.

          ఈ రెండోది చల్లపలికి సుదూరంగా దేశ విదేశాల్లో ఉండే సదాలోచనాపరుల కోసం, ప్రొద్దున్నే లేవలేని గ్రామస్తుల కోసం! ఆ వాట్సప్ ను నిశితంగా గమనిస్తే ఏం జరగవచ్చంటే:

- 2543 రోజులుగా ఇందరు కార్యకర్తలు కీర్తి ప్రతిష్టల కోసమో, ఎవరు బ్రతిమాలితేనో ఈ 4 లక్షల పనిగంటలు తమ ఊరి కొరకు శ్రమించలేదనీ, ఇదొక మహత్కార్యం, సేవ అని వాళ్లనుకోరనీ, కేవలం కనీస బాధ్యతగా మాత్రమే వాళ్ల కృషి అనీ తెలుసుకోగలరు!

 

- కేవలం చదివి ఊరుకోక - వచ్చి, అచరణకు దిగే స్వభావం ఉన్న వాళ్ళైతే ఆలస్యం అమృతం” ‘Better late than never’ అనుకొని స్వచ్చోద్యమంలోకి దిగినా దిగగలుగుతారు!

- అలా దిగే కొద్దీ ఈ శ్రమ జీవన సౌందర్యానికీ, ఒక మంచి పనికి పూనుకొనే ఐకమత్య బలానికీ అలవాటు పడగలరు!

- ఏనాటికైనా ఈ చారిత్రక గ్రామ సమగ్ర స్వచ్చ శుభ్ర పురోభివృద్ధి సాధించి, చరిత్ర సృష్టించగలుగుతారు కూడ!

          నేటి 28 మంది ఊరుమ్మడి బాధ్యుల్లో 10 నుండి 85 ఏళ్ల వయస్కులున్నారు. ఎవరి శక్తి మేరకు, అభిరుచి మేరకు వారి పద్ధతిలో వీధి పారిశుధ్య ప్రయత్నంచేసినా అందరిదీ ఒక ఏకోన్ముఖ లక్ష్యమే!

          కరెంటు స్తంభాల ప్రక్క చెట్ల కొమ్మలు నరికి, వాటిని తుక్కుచేసే యంత్రానికందించినా, కొన్ని పూల మొక్కలు నాటినా, రోడ్లు ఊడ్చినా, ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరినా గ్రామ వీధులు శుభ్రంగా, అందంగా ఉండాలనే ఒక అంతః సూత్రమే!

          6.25 తరువాత జరిగిన సమీక్షా సభలో ఒక విద్యార్థి -  మణికంఠ రకరకాలుగా పలికిన ఊరి మెరుగుదల సంకల్ప నినాదాలు, ఆపిమ్మట నందేటి గాయకుడు పాడిన దాశరథి విరచిత చల్లని సముద్ర గర్భం పాట”, ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉండీ, స్వచ్చ కార్యకర్తలకు శంకర శాస్త్రి గారి మిఠాయిల ఏర్పాటు విశేషాలు!

          రేపటి ఉషోదయ శ్రమదానం కూడ ఇదే బైపాస్ మార్గంలోనే!   

        సార్వకాలిక స్వచ్ఛ సంస్కృతి జాడ

ఎక్కడైనా మెచ్చుకొనదగు ఒక్క సంగతి చెప్పమంటే

వంకబెట్టగరాని విషయం బింకముగ ప్రకటించమంటే

సార్వకాలిక స్వచ్ఛ సంస్కృతి జాడ కొంచెం తెలుపుమంటే

అందరికి గుర్తొచ్చునది ఒక స్వచ్ఛ - సుందర చల్లపల్లే!

- నల్లూరి రామారావు,

   24.09.2022.