1917* వ రోజు....           10-Feb-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1917* వ నాటి గ్రామహిత చర్యలు.

ఈ రోజు వేకువ 4.00 నుండి 6.25 నిముషాల నడుమ జరిగిన స్వచ్చంద సేవా విధులలో పాల్గొన్న వారు 27 మంది. ( + నలుగురు అతిధులు) శ్రమదాన ప్రాంతం నాగాయలంక రోడ్డు లోని పెట్రోలు బంకు నుండి బందరు మార్గం లోని షాబుల్ వీధి వరకు.  అంతే కాక ఈ సోమవారం సంత దృష్ట్యా బందరు దారి నుండి సంత మార్కెట్ దాకా వీరి కర్తవ్యం విస్తరించింది.

 

వీరి శ్రమదాన దారిలో మూడు రోడ్ల కూడలి, రెండవ ఇంధన కేంద్రం(రాఘవయ్య పెట్రోలు బంకు), చిన్న కార్ల నిలుపుదల కేంద్రం, ఏ‌టి‌ఎం కేంద్రం, ఉభయ దేవాలయాల, కూరగాయల ముంగళ్ల- అంగళ్ల, అల్పాహార అంగళ్ల, కొబ్బరి బోండాల, తోపుడు బళ్ల ప్రాంతాలన్నీ సుమారు ఈ పాతిక మంది కార్యకర్తల రెండు గంటల కృషితో స్వచ్చ – శుభ్ర – సుందరములైనవి.  నడుమ నడుమ అక్కడక్కడ మురుగు కాల్వల వ్యర్ధాలను కూడా లాగబడినవి.

 

ఇవి కాక వీరిలో ఐదారుగురు గ్రామ రక్షక దళం సభ్యులు అశోక్ నగర్ 3 వ వీధి చివర డాక్టర్ మాలెంపాటి గోపాల కృష్ణయ్య గారి గృహ ఆవరణ వ్యర్ధాలను ట్రాక్టర్ లో నింపి, బస్ ప్రాంగణం లోని పడమర ప్రక్క దారిని గుంటలు నింపి సుగమం చేశారు.

 

6.00 గంటలకు ఈ స్వచ్చంద సేవా కార్యక్రమం ముగియవలసి ఉండగా ఈ నాటి సంతను, అక్కడికి వచ్చే వేలాది కొనుగోలు దారుల, అమ్మకం దారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని సంత వీధిని కూడా చకచకా ఊడ్చి శుభ్ర పరిచారు.

 

ఈ నాటి దైనందిన స్వచ్చంద శ్రమదాన సమీక్షా సమావేశానికి మన కార్యకర్తలలో నలుగురు వచ్చారు. వక్కలగడ్డ నుండి మణి ప్రభాకర రావు గారు, మల్లుపెద్ది అజయ్ గారు ఇందులో పాల్గొని, ఈ రెండవ వారు తన తండ్రి రామ సుబ్బయ్య గారి మృతి సందర్భంగా మనకోసం మనం ట్రస్టుకు 25,000/- విరాళం సమర్పించారు.  పల్నాటి దంపతులు భాస్కర్ – అన్నపూర్ణ లు తమ కుమారుని వివాహ సందర్భంగా  కార్యకర్తలందరినీ  సాదరంగా ఆహ్వానించి మనకోసం మనం ట్రస్టుకు 5000/- ఖర్చుల నిమిత్తం విరాళం ప్రకటించారు. మన మరొక కార్యకర్త గోళ్ల వేంకటరత్నం గారు తన మనుమడు తటవర్తి కార్తీక్ జన్మదిన సందర్భంగా 500/- సమర్పించారు. ఈ ముగ్గురు దాతల సౌజన్యానికి, స్వచ్చోద్యమ చల్లపల్లి పట్ల నిబద్ధతకు మన ధన్యవాదాలు.

 

లంకే సుభాషిణి స్వచ్చ చల్లపల్లి ఉద్యమం మరికొన్ని దశాబ్దాల పాటు నడిచి చల్లపల్లికే కాక మొత్తం దేశానికంతటికీ మార్గదర్శకం కావాలని ఆకాంక్షించి , దృఢంగా ముమ్మారు ప్రకటించిన స్వచ్చ సంకల్ప నినాదాలతో మన ఈ నాటి శ్రమదాన వేడుకకు స్వస్తి.

 

రేపటి మన గ్రామ కర్తవ్యం కోసం కీర్తి హాస్పటల్ వద్ద (వర్షం వస్తే  సాగర్ టాకీస్ వద్ద) కలుద్దాం.

     

          ఇదొక స్వచ్చ గ్రామ దృశ్యం!

ఈ శుభ్రత - పచ్చదనం - ఈ మనోహరమగు శ్మశానం

పూలతోటల బాటలతొ పరిపూర్ణ స్వచ్చ గ్రామ దృశ్యం

నిజం చేసిన స్వచ్చ సైన్యం జనం ముప్పది వేల మందిని   

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

సోమవారం – 10/02/2020

చల్లపల్లి.