2544* వ రోజు....           25-Sep-2022

కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

సుందర చల్లపల్లి నిర్మాణంలో 2544* వ నాడు.

ఈ ఆదివారం వేకువ ఆ నిర్మాతలు 31 మంది ; ఆ సమయం వేకువ 4.20 6.06 ల నడుమ ; ఆ ప్రాంతం బైపాస్ వీధిలోని అశోక్ నగర్ విజయ నగర్ 3 వీధుల వద్ద; సదరు శ్రమ దాతల పూనికతో ఇంకొంత హరిత- సుందరంగా, ముచ్చటగా, పొందికగా ఉన్న వీధి అశేష గ్రామ ప్రజలది; ఊరి జనుల ఆహ్లాదం కోసం పాటుబడిన సంతృప్తి స్వచ్చ కార్యకర్తలది!

నేటి విశాల ప్రపంచంలో యుద్ధాలు ఆగలేదు కుట్రలు తగ్గలేదు- గ్రామంలో వీధి మార్జిన్ల కబ్జాలు సజావుగా సాగుతూనే ఉన్నవి- 2544*వ నాటికి కూడ వీధిలో కొందరి బాధ్యతా రాహిత్యం మారలేదు సొంత ఊరి కర్తవ్యాల కోసం గడప దాటి బైట కొచ్చే సామాజిక కార్యకర్తల సంఖ్యా పెరగలేదు! అలాగే ఈ స్వచ్చంద శ్రమదాతల కర్తవ్య నిర్వహణమూ ఆగబోదు!

ఈ రెండు మూడు రోజుల శ్రమ ప్రాంతం సహజంగానే తమ వార్డు, గ్రామ సమస్యలకు త్వరగా స్పందించే వ్యక్తులు ఎక్కువగా ఉండే చోటు, స్వచ్చ కార్యకర్తల శ్రమ పట్ల ముందుగా చలించే వార్డులు! తమ వీధులు, పరిసరాలు సాధ్యమైనంత కాలుష్య రహితంగా, కంటి కింపుగా ఉంచుకోవాలనే స్పృహ మెండు గా ఉన్న గ్రామ భాగం!

అందుకే ఈ వేకువ 30 మంది కార్యకర్తల సుమారు 50 పని గంటల తరువాత మరింత శుభ్రంగాను, తీర్చిదిద్దునట్లు గాను ఈ 100 గజాల ఉపవీధి ముచ్చట గొలుపుతున్నది! అందుకోసం :

- ఐదుగురు కత్తి పనివారు కమ్యూనిస్టు వీధి ఎదుట పిచ్చి మేడి వంటి చెట్లు నరికి, గడ్డి చెక్కి, ఒక చుట్టింటి ప్రక్కన  ఎగుడు  దిగుళ్ళు సమం చేసి పూల మొక్కలు నాటారు.

- చీపుళ్ళందు కొన్నవారు వెడల్పాటి బజారంతా శుభ్ర పరుస్తూనే ఉన్నారు.

-  చెట్లను సుందరీకరించే పనిలో కొందరూ, ఆ ప్రయత్నంతో పుట్టుకొచ్చిన కొమ్మల రెమ్మల్ని, ఎండు పచ్చి గడ్డిని యంత్రానికందించే వారు మరికొందరూ

గంటన్నరకు పైగా జరిగిన వీధి పారిశుద్ధ్యం లో ఎవరి పాత్ర వారిది, ఎవరి సృజన, పని విభజన వాళ్లది, “ నేను నా కోసం శ్రమించడం లేదు-24  గంటల్లో 1 ½ / 2 గంటలు శాయ శక్తులా నా పొరుగువారి కోసం పాటుబడుతున్నాను.....  అనుకొనే దినదిన సంతృప్తి ఎవరికి వాళ్లది

6.25 పిమ్మట ఆలోచనల కలబోత సభలో తన ఊరికి సంబంధించిన నినాదాలను ఒక లయ/ క్రమ బద్ధంగా ముమ్మారు పలికి, పలికించినది బొమ్మిశెట్టి ఆత్మ పరబ్రహ్మం ; ఒక తెలంగాణ పాటను స్వచ్చ చల్లపల్లి శ్రమదానోద్దేశ్యం ఆపాదించి, పాడినది శేషు!

బుధవారం వేకువ మన పునర్దర్శనం బందరు రహదారిలోని శ్రావ్య ఆస్పత్రి వద్ద!

          ఎదుగు బొదుగూ లేని విధముగ

ఇంటి ఇంటికి మనిషి మనిషికి  అంటు కొనదగు శుభ్ర సంస్కృతి

ఒక సమున్నత లక్ష్యమునకై ఉరక వలసిన జనం సత్కృతి

ఎనిమిదేళ్లుగ  ప్రజ్వలించక ఎదుగు బొదుగూ లేని విధముగ

ఎన్ని అనుమానాల కైనా ఎవరికీ తావివ్వకుండున?

- నల్లూరి రామారావు,

 

25.09.2022.