2545* వ రోజు.......           26-Sep-2022

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

భద్రతా/సుందరీకరణ చర్యలు - @2545*

          26-9-22 - ఇది సోమవారం - అంటే ఇతర కార్యకర్తలు సొంత బాధ్యతలు పట్టించుకొనే, శ్రమదానానికి చిన్న ఆటవిడుపు రోజు! రెస్క్యూ టీంకు మాత్రం ఊరికి సంబంధించిన తమ ప్రణాళికల్ని అమలు పరిచే రోజు!

          ఆ అమలు కోసం వాళ్ళీ వేకువ తొలుత 4.30 కు ముందే తమ పనిముట్లతో చేరుకొన్నది గంగులవారిపాలెం రోడ్డుకు. ఆ వీధి చివర “గంగులవారిపాలెం” కి స్వాగత ఫలకం ఒరిగి పోతే, దాని ఒంపులు తీర్చి, మరలా వంతెనకూ - జాతీయ రహదారికీ నడుమ భద్రంగా నిలపడమే ఈ వేకువ రెస్క్యూ టీం తొలి కర్తవ్య పూరణం.

          అటు పిమ్మట ఈ ఆరేడుగురి ముఠా 2 ½ కిలోమీటర్ల దూరాన ఉన్న పోలీసు కార్యాలయానికే చేరుకొని, గంట సేపు కష్టించింది. “వారు వీరౌతారు - వీరు వారౌతారు...” అనే పాత సినిమా పాటను గుర్తుకుతెస్తూ ఈ కార్యకర్తలు అరగంటపాటు సుందరీకరణ బృందంగా మారారు - అనగా :

- రక్షకభట ఆవరణాన్ని శుభ్రపరచడం, బరువైన కుండీలను మోసి, అందంగా అమర్చడం, వాటిలో మట్టి - ఇసుక మిశ్రాన్ని నింపడం వంటి పనులన్న మాట!

- ఆ కుండల్లోకి త్వరలో చక్కని పూలమొక్కలు వచ్చి - పెరిగి, ఆవరణకు క్రొత్త అందాల మరబోతున్నాయన్నమాట! ఆరేడుగురి నేటి శ్రమానందానికీ, చెమటలచిందింపుకీ ఒక రక్షక భటుడూ, ఒక పెద్ద డాక్టరూ, నేనూ సాక్షులం!

          6.35 కు ముక్త కంఠాలతో చల్లపల్లి స్వచ్చోద్యమానికి జయ జయ ధ్వానాలు పలికి నేటి తమ సార్థక శ్రమదానాన్ని ముగించారు.

 

కృతజ్ఞతకు మనుషులందు కొంత స్థలం మిగులు వరకు

సుమనస్కత, సృజనలకూ చోటు కాస్త దొరకు వరకు

అయాచిత పరోపకృతికి ఆదరణ లభించు వరకు

స్వచ్ఛోదమ సంరంభం జరుగక తప్పదు – తప్పదు!

- నల్లూరి రామారావు,

   26.09.2022.