2547* వ రోజు..........           29-Sep-2022

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

స్వచ్ఛ - సుందరోద్యమ చల్లపల్లిలో - 2547* వ వేడుక!

            29.9.2022 వ వేకువన ఆ వేడుక జరుపుకొన్న కార్యకర్తలు 20 మంది! ఈ దసరా శరన్నవరాత్రుల కాలంలో ఈ గ్రామ సామాజిక శ్రమదాతలది క్రొత్తరకం పండుగనుకోండి! ఆ మాటకొస్తే 8 ఏళ్ళుగా స్వచ్ఛ కార్యకర్తలకు ప్రతిరోజూ పండుగే!

అసలీ గ్రామమెరుగుదల బాధ్యతలు భుజాలకెత్తుకుని మోస్తున్న ఈ 100 – 150 మంది శ్రమ వీరులకేం తక్కువని? ఊళ్లో వందలాదిరోడ్లు లేవా? ముఖ్యంగా సువిశాలమైన బందరు, బెజవాడ, అవనిగడ్డ బాటల్లేవా? 8 ఏళ్ల కనీ వినీ ఎరుగని శ్రమదానం తర్వాత కూడా తెలిసో తెలియకో వీధుల్ని, మురుగుకాల్వల్ని, 7 రహదార్లనీ, కశ్మలాలతో నింపేసే, సందు చూసుకొని కబ్జా చేసే తెలివైన గ్రామస్తులు లేరా?

            కనుక - మరో ఐదారేడేనిమిదేళ్ళ దాకా స్వచ్ఛ కార్యకర్తల ఊరి బాధ్యతల ఉద్యోగానికి డోకాలేదు! ఈ కాలంలో - తక్కిన ఉద్యోగుల సంగతేమోగాని - ఈ శ్రమదాతలకు మాత్రం ఉద్యోగ భద్రత ఉన్నది సుమా!

తరతరాల చల్లపల్లి గ్రామ చరిత్ర గాని, గ్రామస్తులు గాని, పరిశీలకులు, ఆలోచనాపరులు గాని - ఆఖరికి ఇలాంటి ఉద్యోగాల్లో చేరిన పెద్ద డాక్టర్లు, 70 - 80 ఏళ్ల విశ్రాంత ఉద్యోగులు, గృహిణులు, ఉద్యోగ - నిరుద్యోగులు గాని ఇంత మంచి వేకువ కాలపు ఉద్యోగాలు దొరుకుతాయనీ, చేస్తామనీ ఊహించి ఉండరు! కాలమహిమ!

ఈ గురువారం ఉదయం 4.20 కీ, మరికొద్ది నిముషాలకీ వచ్చి - చీపురో - గొర్రో - గోకుడుపారో పట్టి వీధి దుమ్ము లేపి ఊడ్చి చెక్కి - పోగులు చేసి, ప్లాస్టిక్ కప్పుల్ని - సీసాల్ని - సంచుల్ని ఏరిన సొంతూరి బాధ్యులు 20 మందే గాని, 6 వ నెంబరు కాల్వ మొదలు మునసబు వీధి దాక చకచకా పనులు జరిగిపోయినవి. ప్రముఖ కార్యకర్తలు కొందరు కేరళ పర్యటనకు వెళ్లడం శ్రమదాతల సంఖ్య తగ్గడానికి కారణం కావచ్చు!

"బుల్లెట్టు దిగిందా అనేది ముఖ్యం" అని ఒక సినిమా డైలాగున్నట్లే - కార్యకర్తలెందరు తగ్గితేనేం - 200 గజాల ప్రధాన వీధి శుభ్రత మెరుగయిందా, ట్రక్కు సగానికి వ్యర్ధాలు, పేడలు, ప్లాస్టిక్ తుక్కులు నిండాయా అనేది ముఖ్యం!

6.25 కు స్వచ్చోద్యమ సారాంశ నినాదాలను ప్రకటించినది హీరో షోరూం - దాసరి శ్రీను; కార్యకర్తలకు బిస్కెట్ల పంపకం దారుడు ఉడత్తు రామారావు; JVV సభ్యత్వాలనిచ్చినది లంకే సుభాషిణి!

వర్షం లేని అనుకూల వాతావరణమైతే రేపటి వేకువ మనం కలుసుకోవలసింది బందరు దారిలో మునసబు వీధి వద్ద - అననుకూల పరిస్థితైతే బైపాస్ లోని అశోక్ నగర్ - సజ్జా ప్రసాదు ఇంటి బజారు వద్ద!

 

      శ్రమైక జీవన సౌందర్యానికి

శ్రమైక జీవన సౌందర్యంతో సమానమైనది ఉందిగా

స్వచ్ఛ సంస్కృతికి నిలువుటద్దమై చల్లపల్లి నిలిచిందిగా

౹౹శ్రమైక జీవన సౌందర్యంతో౹౹

సుమ సుందర ఉద్యాన పరిమళం శుభసందేశము పంపగా

పర్యాటకులకు స్వర్గధామమై చల్లపల్లి ప్రభవించగా

౹౹శ్రమైక జీవన సౌందర్యంతో౹౹

స్వచ్ఛ సైనికుల - ట్రస్టుకార్మికుల చెమట చుక్కలతొ నిండుగా

శ్మశానాలు రహదారులు - వీధులు స్వచ్ఛసుందరములాయెగా

౹౹శ్రమైక జీవన సౌందర్యంతో౹౹

ప్రతి గ్రామం మా చల్లపల్లి వలె స్వచ్ఛ శుభ్రతలు పెంచగా

సమస్త దేశం ఆరోగ్యం - ఆనంద తాడవం చేయదా

౹౹శ్రమైకజీవన సౌందర్యంతో సమానమైనది ఉందిగా

స్వచ్ఛ సంస్కృతికి నిలువుటద్దమై చల్లపల్లి ప్రభవించగా౹౹

- నల్లూరి రామారావు,

29.09.2022.