2550* వ రోజు......           02-Oct-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

30 మందితో ఆదివారం నాటి వీధి పారిశుద్ధ్య ప్రక్రియ - @2550*

            గాంధీ జయంతి నాటి వేకువ 4-19 సమయంలో బందరు - విజయవాడ ఉపమార్గంలో - వడ్లమర దగ్గరలో గుమికూడిన సొంతూరి బాధ్యులు ఏడెనిమిది మందే గాని, నిముషాల క్రమాన వచ్చి శ్రమించినవారు మొత్తం 30 మంది. వారి పనివేళ చల్లగాలి వీచీ, వర్షం ఆగీ సహకరించాయి! విజయ్ - అశోక్ నగర్ల తరువాయిగానూ భారతలక్ష్మి ధాన్యం మరదాకనూ ఈ నాటి పారిశుద్ధ్య కృషి!

            ఈ గంటన్నర శ్రమదాన సందడిలో ఇరుగు పొరుగూళ్ల వ్యక్తులు పాల్గొన్నారు గాని, అపార్ట్ మెంట్ల వారు - ఇతర స్థానికులు క్రొత్తగా వచ్చి కలిస్తే ఒట్టు! బైపాస్ వీధినీ, కొసరుగా 2 అడ్డరోడ్లనూ, మురుగు కాల్వలనూ ఇందరు స్త్రీ- పురుష కార్యకర్తలు శుభ్రం చేస్తుంటే - గడ్డి గుబుళ్లనూ, పిచ్చి చెట్లనూ, ప్లాస్టిక్ దరిద్రాలనూ బురదలోనే పీకి, కోసి, ఏరి, డిప్పలకెత్తి, ట్రాక్టర్లో నింపి, చెట్లను సుందరీకరిస్తుంటే తొంగిచూడని స్థానికుల సామాజిక స్పృహనూ స్థిత ప్రజ్ఞనూ ఏమని మెచ్చాలి?

            100 నిముషాల పాటు చిత్తశుద్ధితో కృషి చేస్తున్న స్వచ్ఛ కార్యకర్తలనూ, గ్రామ బాధ్యతారహితంగా - నిర్మొహమాటంగా తమ ముంగిళ్ల కడ జరిగే శ్రమదానాన్ని పట్టించుకోని గ్రామ సోదరుల్నీ ప్రక్కప్రక్కనే చూస్తుంటే - నాకు మాత్రం తమాషాగానే ఉన్నది!

            ఒక మంచి లక్ష్యం కోసం ఇప్పటికే సుదీర్ఘ ప్రయాణం చేసిన కార్యకర్తలకు మాత్రం ఇవి పట్ట లేదు. మరి వాళ్ల కళ్లెదుట కనిపిస్తున్నది కశ్మలమయాలైన 100 గజాల ఉపవీధి, అడ్డరోడ్లు, నిన్నా - మొన్నటి కుంభ వృష్టికి నిండిపోయి - కుంటుతూ నడుస్తున్న మురుగు కాల్వలూ! పడుతున్నదేమో "ఈ ఊరిని మరికొంత మెరుగ్గా, సౌకర్యంగా, ఆహ్లాదకరంగా ఎలాచేయాలి" అనే తపన!

            ఆతపన, ఆ కష్టం ఊరికే పోలేదు! రెండు మురుగు కాల్వలు కుంటడం మాని పరుగు లంకించుకొన్నవి; మాచర్ల (దోమల) కంపలూ, ప్లాస్టిక్ నికృష్టాలూ తొలగి, బాట కడ్డుపడి పెరిగిన చెట్లకొమ్మలు పోయి, రోడ్డు మార్జిన్ల గడ్డీ - గాదం అదృశ్యమై - ఈ నాటికి వారు తమ గమ్యం చేరుకొన్నారు!

            స్థానికుల సంగతికేం గాని, ఈ వేకువ వేళ చల్లపల్లికి చెందిన - గన్నవరంలో వైద్యవిద్యనభ్యసిస్తున్న దాసరి రమ్యశ్రీ (D/o హీరో షోరూం శ్రీను) వచ్చి చల్లపల్లి శ్రమదానోద్యమాన్ని సొంతం చేసుకొన్నది! కార్యకర్తలు కూడ ఆమెను తమ బిడ్డగా సొంతం చేసుకొన్నారు. ఆమే మూడు మార్లు తన ఊరి స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలు పలికి, అరుదైన ఈ శ్రమదాన విశిష్టతను వివరించి, నేటి కార్యక్రమాన్ని ముగించింది!

            మన బుధవారం నాటి శ్రమదాన బాధ్యత కోసం మరొకమారు ఇదే ఉపమార్గంలోని వడ్లమర దగ్గరే కలుసుకొందాం!

            రేపు క్రొత్త మాజేరులో జరిగే నాదెళ్ల ఆంజనేయులు గారి కర్మకాండలకు 11:00 - 12:00 సమయంలో హాజరౌదాం!!

          ఎందు కొరకొ - ఎంత వరకొ!

వినోదమో - వివేకమో - వినూత్నతా వ్యామోహమొ

ప్రసిద్ధికో - ప్రశుద్ధికో - ప్రశాంత గ్రామస్థితికో

చల్లపల్లి స్వచ్చోద్యమ సారధ్యం దేనికొరకొ

ఈ స్వచ్ఛోద్యమ విన్యాసా లెందు కొరకొ - ఎంత వరకొ!

- నల్లూరి రామారావు,

02.10.2022.