2551* వ రోజు....           03-Oct-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

2551*వ శ్రమదాన ఘట్టం గ్రామ భద్రతా సంఘానిది!

          4.25 కే సోమవారం (3-10-22) తమ డ్యూటీలో దిగిన రెస్క్యూ దళం 6.20 కి ఈ నాడు తలపెట్టిన పని పూర్తిచేశారు. పనిచోటు బెజవాడ బాటలోని NTR పార్కు సమీపాన:

          వాళ్ల ఉద్దేశం రోడ్ల భద్రతకు సంబంధించినది. రెండు నెలల క్రితం ఒక విశ్రాంత వ్యాయామోపాధ్యాయుల వారి 2 లక్షల ఔదార్యంతో ఈ ఊరి ముఖ్యవీధుల ప్రమాదకర గుంటలు పూడ్చే ప్రయత్నమొకటి జరిగింది. అందుకు గాను తెప్పించిన రాతి గులకలు పై పార్కు వద్ద రోడ్డు పక్కన పడి ఉన్నవి – అప్పటికీ ఇప్పటికీ వానలు వెంటాడుతూనే ఉన్నాయి.

          ఈనాటి వేకువ స్వచ్ఛ కార్యకర్తల పనేమంటే - టాటా ఏస్ వాహనంతో అక్కడి రాతి ముక్కల గుట్టను కదిలించి, వాహనంలోకి చేర్చుకొని, వానలు తగ్గాక రోడ్లకు పడిన గుంటల పూడిక కోసం భద్రపరచడమే!

          గ్రామ రక్షక కార్యకర్తల సంఖ్య కొంత తగ్గడంతో వాళ్ల ప్రయత్నం సగమే నెరవేరింది – ఒక్క ట్రక్కు మాత్రమే శ్మశానంలోకి చేర్చగలిగారు. రేపటికి తమ పని పూర్తిచేయగలరనుకొంటా.

          ఈ టీముకు నేటి వేకువ బాగా సహకరించిన బొమ్మిసెట్టి ఆత్మ పరబ్రహ్మమే తన ఊరి స్వచ్చోద్యమ సారాంశాన్ని ముమ్మారు గట్టిగా నినదించి, నేటి కృషిని ముగించారు!

 

          ఈ స్వచ్చోద్యమకారులు...

అనవసర రాద్ధాంతాలకు అసలు ప్రాకులాడని

అత్యద్భుత తాత్త్వికతను ఆలంబనగా గైకొని

సామాన్యులె మాన్యులుగా సాగు స్వచ్ఛ యాత్రని

కర్తలై కడు నిష్టగనే జరిపిస్తున్నారు....!

- నల్లూరి రామారావు,

   03.10.2022.