2552* వ రోజు ....           04-Oct-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

అబ్బున పరుస్తున్న కార్యకర్తల శ్రమదాన నిబద్ధత - @2552*

          ఈ మంగళవారం (4.10.22) నాటి వీధి పారిశుద్ధ్య ప్రవీణులు 6 ½ మంది! (అంటే.. ఒకాయన మధ్యలో ఇంటికెళ్ళిపోయాడు గనుక) వాళ్ళకు వత్తాసుగా నాబోటి గాళ్లు మరో ముగ్గురు! వాళ్ల నిబద్ధత 4.30 కే మొదలై - 6.10 దాక నిలిచింది!

          ఆ శ్రమదాన స్థలం - బెజవాడ దారిలోని NTR పార్కు ప్రవేశ ద్వారం దగ్గరే - నిన్న సగంలో వదిలిన చోటే! నిన్నటి అసంపూర్ణ బాధ్యత నేడు నెరవేరిందన్న మాట! ఒక పెద్ద ట్రాక్టరు నిండేంతటి చిరురాతి గులకలూ దుమ్మూ - ధూళి ఈ ఆరుగురి శ్రమతో – చెమటతో ట్రక్కులోకి శ్మశానంలోకి చేరినని!

          ఆ పార్కులో ఏ పాతిక మందో పాదచారులున్నా – వచ్చేపోయే గ్రామస్తులు వందకు పైగా ఉన్నా – ఈ గ్రామ ప్రయోజనకర శ్రమదానంలో - ఈ స్వచ్చ కార్యకర్తలకు ఎవరు సహకరించారు గనుక! ఇన్ని వేల రోజులుగా తాము నడుస్తున్న రోడ్ల గుంటలు పూడిస్తేనో – వేలాది చెట్లు నాటి, పెంచి, రోడ్లు ఊడిస్తేనో - మురుగు పారుదలను క్రమబద్దీకరిస్తుంటేనో సగం మంది ఊరి వాళ్ళు పట్టించుకున్నారు గనుకా!

          అప్పుడెప్పుడో ముఖ్య వీధుల గుంటల్ని ఒక విశ్రాంత దేహ వ్యాయామోపాధ్యాయుడు తన న్యాయ – సక్రమార్జన – 2 లక్షలతో పూడ్చడం తప్ప ప్రభుత్వ సంకల్పాలు నెరవేరిందెక్కడ? మళ్ళీ – ఈ 2 నెలల భారీ/ ముసురు వానలకు కొన్ని రోడ్లు గుంటలైతే మాత్రం - పడుతూ లేస్తూ తిట్టుకొంటూ పోతున్నారు తప్ప – స్వచ్చ కార్యకర్తలకు, రెస్క్యూ బృందానికి ఎందరు సహకరిస్తున్నారు?

          ఆరుగురి బృందం – ఏ గునపాలు, పారలు, డిప్పలు ఎన్ని వందల మార్లు వాడి – ఎంత చెమట చిందిస్తేనేం - ప్రక్కకు తప్పుకొని పోయి ఊరి వాళ్లు తమ పనిని పట్టించుకోకపోతేనేం – తలా 100 నిముషాల కాయకష్టంతో నేటికి తాము తలపెట్టిన పని తాము చేసుకుపోయారు!

          బుధవారం వేకువ మళ్ళీ మనం కలుసుకొని బాగుపరచవలసినది బైపాస్ వీధిలోని భారత లక్ష్మి వడ్లమర దగ్గర!

                   చిత్రాతి చిత్రం

ప్రాలుమాలని, పట్టు సడలని, పారిశుద్ధ్య ప్రయత్నంలో –

బ్రహ్మకాలపు కాయకష్టపు ఫలితమొసగిన పరవశంలో –

వీధి వీధిన వేలకొలదిగ విరగబూసిన పుష్పములతో –

స్వచ్చ - సుందర హరిత గ్రామం సాధనే చిత్రాతి చిత్రం!

- నల్లూరి రామారావు,

  04.10.2022.