2553* వ రోజు .......           05-Oct-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

2553* వ నాటి శ్రమైక జీవన సంకేతం!

            బుధవారం - విజయదశమి (5-10.22) వేకువ సమయపు సదరు సంకేతాలు 2 గంటలకు పైగానే - అనగా 4.22 నుండి 6.25 దాక అందుతూనే ఉన్నాయి అందుకోగలిగిన వాళ్లకు! శ్రామికులు 23 మందైతే - శ్రమదాన కేంద్రాలు బెజవాడ - బందరు ఉపమార్గమూ, భారతలక్ష్మి వడ్లమర వీధుల్లో అటూ - ఇటూగా 200 గజాలు.

            8 - 9 ఏళ్ల నుండి వింత గొలిపే ఈ పారిశుద్ధ్య కృషి చల్లపల్లి జనానికి క్రొత్తేమీ కాదు గాని - ఈ ఊరి జనం సగం మందైనా కలిసి రాకే‌ పోతే పొయారు గాని - ఇప్పటికీ కొద్దిమంది తమ వీధినో - ఇంటి పరిసరాన్నో పట్టి పట్టి శుభ్రంగా నిర్వహించుకోకపోతే పొయ్యారు గాని--- ఇప్పటికొక సంగతైతే రూఢి అయిపోయింది! ఈ శ్రమదాతలు మాత్రం ఇప్పట్లో తమ గ్రామ కర్తవ్యాలను విరమించరని!

            అదెలాగంటే : కరోనా దుర్భర దుస్థితిలోనైనా - దసరా నవరాత్రులలోనైనా విజయదశమి పెనుపండుగ సందర్భమైనా స్వచ్చ కార్యకర్తలు పవిత్రంగా భావించే వీధి పారిశుద్ధ్య సౌందర్య కల్పనా సౌకర్యం ఆగిందా? తమ కర్తవ్య నిర్వహణమే ప్రతిరోజూ పండుగగా తలచుకొని, అందుమూలంగా వారు నిత్యమూ పొందుతున్న దైహిక స్వస్తతా, అంతరంగ సౌకర్యమూ వదులుకొంటున్నారా?

            నిన్న రాత్రి ఊళ్లో కొన్ని చోట్ల అర్థరాత్రి దాటేదాక తేదీ మారే వరకు కొందరు చెవులు చిల్లులు పెట్టేంత శబ్దంతో పాటలు పాడి, భక్తి పరవశానందం పొందారు గదా! ముఖ్యమంత్రి అంతటి గొప్ప మనిషి చెప్పినా వినకుండా ఐనదానికీ, కానిదానికీ న్యాయస్థానాలను లెక్కచేయక ప్లెక్సీలను వీధుల్లో వ్రేలాడదీసేవాళ్లూ తమ ఆనందాన్ని వదులుకోలేదు గదా!

            మరి అలాంటిది స్వచ్చ కార్యకర్తలు 2553* రోజులు - నాలుగు లక్షలకు పైగా పని గంటలు ఊరంతటి - పర్యావరణ దృష్ట్యా ప్రపంచమంతటి మేలుకోరి పాటుబడడం మాత్రం ఎందుకాపాలి?

            నేటి పని విరమణ మాత్రం కొంత సమయపాలన తప్పినట్లే! 6.25 కు గాని ముళ్ల కొమ్మల ఎండు తుక్కుల గుట్టల లోడింగు పూర్తికాలేదు! ఇక్కడి ఏ నలుగురైదుగురు స్థానికులు వచ్చినా సమయం చాలేది!

            6.30 కు సమీక్షా సభలో నేటి ఒకే ఒక్క మహిళా కార్యకర్త - లంకే సుభాషిణి దీటుగా ముమ్మారు నినదించిన స్వచ్చ శుభ్ర సంకల్పంతో (ఈ పని నిన్న చేసినది BSNL నరసింహారావు) శ్రమదానం ఒక కొలిక్కి వచ్చింది.

            మన రేపటి వేకువ కృషి కూడ ఇదే బైపాస్ వీధిలో - వడ్లమర సమీపంలో కలుసుకొని చేయవలసి ఉంది!

            విజ్ఞతకు నా నమోవాకం!

మహామహులే చేయలేనివి మాటి మాటికి చేసి చూపిరి

వినని - కనని శ్రమ త్యాగపు వేడుకల నావిష్కరించిరి

వట్టి గొప్పలు కాక ఊరికి గట్టిమేల్ చేపట్టు చుంటిరి

వినయ వినమిత కార్యకర్తల విజ్ఞతకు నా నమోవాకం!

- నల్లూరి రామారావు,

  05.10.2022.