1918* వ రోజు....           11-Feb-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1918* వ నాటి శ్రమదాన వేడుకలు.

ఈనాటి వేకువ 4.00 నుండి 6.20 నిముషాల పై చిలుకు దాక జరిగిన గ్రామ స్వచ్చంద శ్రమదానంలో పాల్గొన్న స్వచ్చ సైనిక మిత్రులు 26 మంది. వాన కురిసిన కారణంగా శ్రమదాన వేదిక కూడా బందరు మార్గంలోని చిత్తడి కారణంగా కీర్తి హాస్పటల్ బదులు సాగర్ టాకీస్ బైపాస్ రోడ్డుకు మార్చడమైనది.

 

వీరిలో సగం మంది సినిమా హాలు ముందరి సిమెంటు మార్గం మూల మలుపులో ఖాళీ స్థలాన్ని, మురుగు కాలువను, నాల్గు రోడ్ల మలుపులను శుభ్ర పరచారు. కమ్మ్యూనిస్టు (CPIM) కార్యాలయ భవన మార్గం నుండి 50 గజాల ఈ ఉప మార్గాన్ని ఇద్దరు మహిళలు చీపుళ్లతో శుభ్రపరచగా, ఇదే దారికి సినిమా హాలుకు ఉత్తరం భాగాన గల ఖాళీ స్థలము, లోతైన మురుగు కాలువ డజను మంది కార్యకర్తలకు చేతి నిండా పని కల్పించినవి. ఆ మధ్య ఎప్పుడో గాని విద్యుత్ శాఖ వారు నరికి వదలివేసిన పెద్ద కొమ్మలు డ్రైను లోపల రెండు దరుల మీద చిందర వందరగా పడి ఉండగా ఇవన్నీ ఈ కార్యకర్తల చురుకు దనంతో ఖాళీ స్థలం చివర పోగుపడి, డ్రైను లోపలి వ్యర్ధాలు, ఉభయ గట్ల మీది నిరర్ధకమైన మొక్కలు కూడ తొలగిపోయి, మళ్లీ ఇవన్నీ ట్రాక్టర్ లోనికి ఎక్కి చెత్త కేంద్రానికి తరలిపోయినవి.

 

మిగిలిన కార్యకర్తలు ఆ సమీపంలోని రాతి ముక్కల + ఇసుక + ఎండిన బురద మట్టి మిశ్రమాన్ని సంత వీధి రెండు మలుపులలో తగు రీతిగా సర్ది పెట్టారు.  ఒకప్పుడు- ఏ సంవత్సరం క్రిందటోఇక్కడి గుంటలను ఇదే కార్యకర్తలు పూడ్చి వందలాది వాహాన దారులకు గమన సౌకర్యం కల్పించారు.

 

ఈ పనులన్నీ ముగిసిన తరువాత కార్యకర్తలందరూ ఇక్కడ నుండీ బైపాస్ మార్గం పడమర దిశగా సాగి, ఇంకొక 120 గజాల దాక డ్రైనును, ఉభయ దిశలను పిచ్చి మొక్కలను నరికి, అన్ని రకాల తుక్కులను సమీకరించి రోడ్డు మీద ఇబ్బందిగా ఎవరో  పడవేసిన అడ్డాలను తొలగించి ట్రాక్టర్ లోనికి ఎగుమతి చేశారు.  

 

6.35 నిముషాల తరువాత సరదా కబుర్ల + కాఫీ, టీ ఆస్వాదనల అనంతరం జరిగిన నేటి శ్రమదాన సమీక్షా సమావేశంలో :

- గ్రామ పంచాయితీ కార్యదర్శి రకరకాల నినాదాలను ప్రదర్శిస్తూ ప్లాస్టిక్ వ్యతిరేక ప్రభుత్వ ప్రణాళికను వివరించారు.

- స్వచ్చ సుందర విశిష్ట కార్యకర్త, ఆకుల దుర్గా ప్రసాద్ గారు నిర్ణయాత్మకంగా, నిర్ద్వంద్వంగా ముమ్మారు ఎలుగెత్తి ప్రకటించిన గ్రామ స్వచ్చ– శుభ్ర – సుందర సంకల్ప నినాదాలు మిగిలిన వారి గళాలలో ప్రతిధ్వనించి 6.50 నిముషాలకు నేటి మన శ్రమదాన బాధ్యత ముగిసింది.

 

- పెద్దలు, వదాన్యులు  శ్రీ ఉడత్తు రామారావు గారి బిస్కెట్ పొట్లాల పంపిణీ కూడా జరిగింది.

 

రేపటి మన స్వచ్చ శ్రమదాన ఉత్సవం బైపాస్ రోడ్డు లో నేటి కార్యక్రమం ముగిసిన చోట ఆగి, పునః ప్రారంభిద్దాం.

 

ఈ అరుదగు స్వచ్చోద్యమాన్ని....

అధునాతన కాలపు- ఈ అన్యాయపు యుగంలోన-

స్వార్ధం-నయ వంచనలే సర్వత్రా మెదలు చోట-

నిష్కల్మష-నిస్వార్ధ ప్రగతి శీల ఉద్యమాన్ని

అనుసరించి- కీర్తింపక-అంటనట్లు ఉండగలన?! 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

మంగళవారం – 11/02/2020

చల్లపల్లి.