2554* వ రోజు .......           06-Oct-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

పర్వదినానంతర – 2554* వ నాటి ఆదర్శ శ్రమదానం.

          గురువారం (6.10.22) వేకువ సైతం 4.19 కే – బైపాస్ వీధి వద్దే మొదలైన 22 మంది పారిశుద్ధ్య కృషి కనీసం మూడు చోట్ల విజయవంతమైంది! సగం వరకూ అది సాఫీగానే సాగింది గానీ, ఇక ఉండబట్టలేక – స్వచ్చంద వేడుక పట్ల అభిమానం ఆపుకోలేక - వరుణ వీరుడు ప్రత్యక్షమయ్యాడు! అక్కడికీ – పావుగంట సేపు – 6.00 దాక కార్యకర్తలు పాక్షికంగా తడుస్తూనే - టోపీలు లేనివాళ్లు తలలు తడుపుకొంటానే – తమ కృషి కొనసాగించారు గాని - తయారైన వ్యర్ధాల తరలింపుకు సమయం చాలినట్లు లేదు!

ఇక శ్రమదాన వివరాల కొస్తే –

1) భారతలక్ష్మి మర ఉత్తరపు ద్వారం దగ్గరనే (నిన్న ఎత్తైన కొమ్మల్ని కత్తిరించే సందర్భంలో నిప్పురవ్వల జడి వచ్చిన చోటనే) ముగ్గురు సుందరీకర్తలు - ముందుకు చొచ్చుకువస్తున్న గడ్డిని చెక్కి, బాటను విశాలపరిచే కృషి కొనసాగింది.

2) 10 మంది ఖడ్గచాలన నిపుణులు, దంతెధారులు వడ్లమర వీధిలో – వాసిరెడ్డి కోటేశ్వరుని జ్ఞాపకంగా నిలిచిన ఉద్యానం దగ్గర పారిశుద్ధ్య కృషికి పాల్పడ్డారు! అదేంటో - పనిలో మునిగితే వాళ్లకు వానొచ్చినా  లెక్కలేదు - అందులో కొందరికైతే మరింత వేడుక!

3) మూడవ ముఠాలో ఆరేడుగురు ఇక్కడికి ½ కిలోమీటరు దూరాన – గత కాలపు ప్రభుత్వాసుపత్రి ఎదుట - భోగాది ఉద్యాన పునర్నిర్మాణంలో కాలం గడిపారు. వీళ్లు నాటే మొక్కలకు చినుకులు బాగా సహకరించాయన్నమాట!

          యుద్దమంటే చూసేవాడికి భయం కాని చేసేవాడికేం లెక్క? ముసురు వానల్లో – బురదలో వీధి శుభ్ర - సుందరీకరణలో దిగిన స్వచ్ఛ కార్యకర్తలకు చినుకులో - ఎండలో – చలో – మురుగుకంపులో – క్రొత్తా? తాము, తీర్చిదిద్దే వీధులెన్నాళ్లు – ఎంత ముచ్చట గొలుపుతుంటాయో -  ఇప్పుడు నాటే పూల మొక్కలు ఎన్ని రోజులకు పెరిగి, పుష్పించి ఆ వీధిలో అందాలు చిందిస్తాయో – ఎందరు గ్రామస్తులకు ఆహ్లాదం పంచుతాయో...... అని శ్వాసించే - ధ్యాసించే అమాయకులు గదా పాపం!

          6.25 తదుపరి నేను అదోలా చెప్పిన స్వచ్చ - శుభ్ర - ఆరోగ్య నినాదాలకు కొందరికి నవ్వు వచ్చి, డి.ఆర్. కె. గారు తమ మున్నార్ - ఖమ్మం ప్రయాణ సంగతులు వివరించి – డెంగ్యూ దోమల ప్రమాదాన్ని హెచ్చరించి - మాలెంపాటి డాక్టరు గారు మనకోసం మనం ట్రస్టుకు 2000/- విరాళం సమర్పించిగా గృహోన్ముఖులయ్యారు.

          రేపటి వేకువ సైతం ఇదే ఉపమార్గంలో – ఇదే స్థలంలో మనం కలసి కృషి కొనసాగించాలనేది  అందరి అంగీకారం!

               ఇదా గ్రామస్తుల విచక్షణ?

ఒక సమంచిత శ్రమ చరిత్రకు - ఒక అమోఘ ప్రయత్నానికి

ఒక నిగర్వ స్వచ్ఛ సమరం – ఒక వినీతుల సమూహానికి

ఎనిమిదేళ్ల ప్రయాణానికి - ఇదేనా సముచిత స్పందన?

ఇదా గ్రామస్తుల విచక్షణ? ఇదా మాసోదరుల చేతన?

- నల్లూరి రామారావు,

  06.10.2022.