2555* వ రోజు ... ....           07-Oct-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

వాన ముసరని 2 555* వ నాటి వినోదం!

          ఈ శుక్రవారం వేకువ సమయాన తమ వంతు సామాజిక శ్రమను వేడుకగా మార్చిన వ్యక్తులు 23 మంది. (వీరిలో కొందరికైతే 4.16 కే పనివేళ!) వాన తెరపి ఇచ్చింది గాని – వాట్సప్ మాధ్యమంలో చూపినట్లు - రోడ్ల ప్రక్కన నీటి చెలమలే! ట్రిమ్ చేసి సుందరీకరించ వలసిన చెట్లన్నీ తడిసి ముద్దలే! అలాంటి అననుకూల పరిస్థితుల్లోనే మన జగమొండి కార్యకర్తల వీధి బాధ్యతలు! (ఏం చేస్తారు? శ్రమదానం లేని నాడు తృప్తిగా నిద్ర పట్టని బలహీనత!)

వాళ్ల నేటి కర్తవ్యాలు ముచ్చటగా మూడు చోట్ల చూడముచ్చటగా నెరవేరినవి:

1) హిందు శ్మశానం రోడ్డు దగ్గర

2) భారతలక్ష్మి వడ్లమర వీధిలోనూ

3) ఇక్కడికి 1 కి.మీ. దూరంగా రక్షకభట నిలయంలోను!

          వీటిలో రెండోది కఠినతరమనే చెప్పాలి. మట్టి ట్రాక్టర్ల వల్లనేమో గాని సిమెంటు రోడ్డు మీద బెత్తెడు మందంగా మట్టి + ఇసుక + ఇతర చెత్తా చెదారాల రోడ్డు ఏర్పడింది. డజను మంది శ్రమ సమర్పణతో - గంటన్నర పాటు కశ్మలాల మీద జరిగిన అక్షరాలా యుద్ధంతో గాని సగం కిలోమీటరు మేర మట్టి రోడ్డు తొలగి అసలు రహదారి బయటపడింది!

          వాళ్లలో కాస్త వయసు మళ్లుతున్న వాళ్లు సరే - ఇద్దరు మహిళలు కూడ – గోకుడు పారల్తో, మొండి చీపుళ్ళతో, పంజాలతో, అక్కడక్కడ కత్తుల్తో ఎంత గట్టిగా శ్రమిస్తే ఈపాటి స్వచ్చ – శుభ్రతలు దక్కాయో ఊహించండి! ఊరి కాలుష్యం మీద కసితో – ఒకానొక పూనకంతో తప్ప ఒళ్ళు పులిసిపోయే ఈ కఠిన శ్రమదానం చేయగలరా? ఈ పాతిక - ముప్పై – నలభై మంది కాక ఈ వీధి వాళ్లు గాని - మట్టి, ఇసుక వాహనాల వాళ్లు గాని - ఎవరు సహకరించారు గనుక!

          అందగింపుల బృంద త్రయం అదే దీక్షగా - అదేదో ముక్తి కోసం చేస్తున్న తపస్సన్నట్లుగా - ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోయింది!

          పోలీస్ స్టేషన్ శుభ్రత, హరిత సుందరీకరణ బాధ్యత సొంతం చేసుకున్న నలుగురైదుగురు 14 పూల కుండీలను పొందికగా అమర్చి, లాంటానా మొక్కలు నాటారు.

          పైకి సరదాగా నడుస్తున్న ఈ సామాజిక శ్రమదానం వెనుక ఎంత మొండి పట్టుదల, ఎంత అభినివేశం, తమ ఊరి పట్ల ఎంత అంకితభావం, త్యాగం ఉన్నాయో సగం మంది గ్రామస్తులిప్పటికీ పట్టించుకోకుంటే ఎలా?

          తాతినేని – మొక్కల - రమణ ముమ్మారు నినదించిన స్వచ్చోద్యమ సంకల్పంతోనూ, కార్యకర్తల కాయకష్టం గురించి మన ఉద్యమ సారధి గారి ఆశ్చర్యానందాలతోను 6.30 కి నేటి బాధ్యతా నిర్వహణం ముగిసింది.

          బైపాస్ వీధి పారిశుద్ధ్య కృషి ముగింపు కోసం రేపటి వేకువ మనం కలసుకోదగింది బాలికల వసతి గృహం దగ్గరే!

                   పరవశిస్తున్నది సమాజం!

ఇంత నిశ్చల నిశ్చితంగా - ఇంత సుందర బంధురంగా –

ఇంత సుమదళ మోహనంగా - సుదీర్ఘంగా – సహర్షంగా –

సదా శ్రద్ధగ – నిరాపేక్షగ - స్వచ్ఛతను ఊరంత నింపగ

పాటుబడు మీ స్థిత ప్రజ్ఞకు పరవశిస్తున్నది సమాజం!

- నల్లూరి రామారావు,

  07.10.2022.