2556* వ రోజు .......           08-Oct-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

బందరు-బెజవాడ ఉప రహదారి పనులు పూర్తి - @2556 * 

ఆ పనులైతే అనుకొన్నంత సులువుగా జరగలేదు. నడుమ నడుమ ఎడంతో - 3 వారాలు పట్టింది; ఐతే అక్కడక్కడ ప్రక్క సందుల్లోకి సైతం శ్రమదానం ప్రాకింది; ఇన్ని రోజులుగా ఎంతమంది చొప్పున- ఎన్ని పని గంటలుగా చలిలో, వానల్లో కూడ చెమటలుగా నడిచిన ఈ శ్రమజీవన సౌందర్యాన్ని ఊరి వాళ్లు, వార్డుల వాళ్లు ఏ మాత్రం గ్రహించారో ఎప్పుడు నిస్సంకోచంగా ఉమ్మడి జన శ్రేయస్సు కోసం ముందుకు వస్తారో ఎవరు చెప్పగలరు?

 

          శనివారపు బ్రహ్మ ముహూర్తాన-4.18 కే బాలికల హాస్టలు వద్దకు చేరిన వారూ, అదేదో శుభ కార్యానికి లాగా వచ్చి కలసిన మిగతా కార్యకర్తలూ-మొత్తం 27మంది ! పనిచోటు ½ కిలోమీటరు దాక! వసతి గృహం దగ్గరా-బందరు దారికి దగ్గర్లో నూ నీళ్లలోనే పనులు! 

          కొందరి శ్రమ రెండు చోట్ల లోపించిన పూల మొక్కలు నాటడానికై గడ్డి పీకి పిచ్చి చెట్లు తొలగించి, రాళ్లూ రప్పల్ని ఏరి- నేలను సమతలం చేయడంగా నడిచింది.

 

          కత్తుల వాళ్లు కొందరు శ్మశానం దారి మలుపు దగ్గర డ్రైను అంచున పనికిమాలిన మొక్కల్ని నరకడం, బాట వైపు కొస్తున్న కొమ్మల పని పట్టడం, పనిలో పనిగా ప్లాస్టిక్ తుక్కుల సంగతి చూడడంగా శ్రమించారు.

 

          ఎక్కువ మంది –(15 మంది వరకూ) హాస్టలు గేటు నుండి బందరు రహదారి దాకా రెండు ప్రక్కలా ఎన్ని కశ్మలాలను - సిమెంటు రోడ్డు మీదకి వ్యాపిస్తున్న పిచ్చి కంపల్నీ- తీగల్ని పీకుతూ నరుకుతూ ఊడ్చి ప్రోగులు చేస్తూ సాగిపోయారు.

 

          ఆ తడి, బురద వ్యర్ధాలన్నిటినీ చకచకా డిప్పల కెత్తో -  చేతుల్తోనో ట్రాక్టరు లో నింపే పని మరికొందరు ఔత్సాహికులది!  పైకెక్కిట్రాక్టరులో సర్దే డ్యూటీ మారి, పల్నాటి భాస్కరుని వంతయింది!

 

ఇంత సుదీర్ఘకాలంగా - అదొక పెద్ద వ్యసనంగా నడిచే ఈ వేకువ కాలపు స్వచ్చ - సుందరోద్యమం ఇప్పటికీ ఇంకా కొందరు గ్రామ పౌరులకు నిరుపయోగ చర్యగా కనిపిస్తుందేమో గాని నా వరకూ నా దృష్టిలో ఇదెంతో మంచి అలవాటు! లక్షలాది పల్లెలు విధిగా అనుసరించవగినది!

 

          గంటన్నరపాటు దంతెధారియై శ్రమించిన పలనాటి అన్నపూర్ణ ప్రకటించిన సొంత ఊరి స్వచ్చ- శుభ్ర-సుందరీకరణ మంత్రోచ్చారణతో నేటి సుమారు 40 పనిగంటల శ్రమదానానికి ముగింపు!

 

          రేపటి వేకువ శ్రమ వేడుక కోసం భగత్ సింగ్-వేణు గార్ల ఆస్పత్రి వద్ద మనం కలవాలనే DRK గారి ప్రతిపాదనకు అందరి అంగీకారం!

 

         నీకు మా స్వచ్చోద్యమాంజలి

మౌనముగనే వేలగంటలు మనం మనకోసం సుమా!అని

ఎవడు చేసెను సొంత ఊరికి ఇన్ని వేల దినాల సేవలు?

వీధి వీధిన దుమ్ము - ధూళిని, మురుగు కాల్వల సిల్టు తోడెను?

అతడు వాసన కృష్ణారావని - అతని బ్రతుకాదర్శమేనని......

 

- నల్లూరి రామారావు,

  08.10.2022.