2557* వ రోజు .......           09-Oct-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

 

బందరు రహదారిలో  స్వచ్చ కార్యక్రమం పునః ప్రారంభం  - @2557 *

 

          28 మంది గ్రామ సామాజిక బాధ్యులు – 100 గజాల సువిశాల వీధి – అమరావతి రాజుల భవనమూ, మరో వంక వారి వైజయంతమూ – ఉత్తర ద్వారానికుభయ దిశలా రహదారి ఉద్యానాలూ – ఇదే ప్రధానంగా ఆదివారం (9.10.2022) నాటి కార్యకర్తల శ్రమకు నోచుకొన్నవి! భగత్ సింగ్ ఆస్పత్రి ఎదుట జరిగిన 7 గురి కృషి దీనికదనం.

 

          4.20 కే కార్యకర్తలు పని చోటుకు చేరుకొన్నారు గాని – అంతకు ముందు 3.00 కే పడిన వానతోనూ, ఆగని ఉరుములు మెరుపులతోను అసలీ వేకువ శ్రమదానానికి పాల్పడాలా – వద్దా అనే సందిగ్ధం! ఐనా సరే – వరుణుడు విశ్వరూపం చూపించడులే అనే  భరోసాతో మొదలైన కార్యక్రమం ఆసాంతం వాన నేస్తం తోడుగానే సాగింది.

 

          ఊరి బాధ్యత నెరవేర్చుకోవడంలో పండిపోయిన – రాటు దేలిన- ముదిరిపోయిన – కార్యకర్తలు ఎండనో – వాననో- మంచునో ఎప్పుడు లెక్కజేశారు కనుక? అందుకని – వానలోనే ఉద్యానంలో కలుపు పీకుడు, పాదులు సరి చేసుడు, పారలు, చెక్కుడు పారల్తోనే దారి అంచుల గోకుడు, డిప్పల్తో వ్యర్థాలను ట్రక్కులోకి తరలింపు- డంపింగ్ యార్డుకు చేర్చుడు!

 

                    బాటకు ఉత్తర దిశ వైజయంతం 30 అంగుళాల మందపు ప్రహరీలో మొలిచి – గోడను బ్రద్దలు కొట్టిన చెట్లను సైతం ఇద్దరు కత్తి ఒడుపుతో తొలగించిందీ వర్షం సాక్షిగానే! సుందరీకర్తల పార పనికి మాత్రం వానకు మెత్తబడి నేల బాగానే పనికొచ్చింది!

 

          6.00 సమయానికి చినుకులకు మెత్తబడ్డారేమో మరి- ఇద్దరు ముగ్గురు తప్ప పని విరమించారు. తమ లాభానికి కాక – ఊరంతటి మేలు కోరి గంటన్నరకు పైగా శ్రమించిన సామూహిక శ్రమదాతలు ఈ చిరు చినుకుల్లో కబుర్లాడుకొంటూ మంచి కాఫీని ఆస్వాదించడం కూడా కమనీయ సన్నివేశమే!

 

          విశ్రాంత ఉపాధ్యాయిని – రమ గారు ఊరి వాళ్లకు సామాజిక బాధ్యతా పాఠాలు చెప్ప్తున్నట్లుగా – ముమ్మారు శుభ్ర- స్వచ్చ- సౌందర్య సాధనా ప్రతిజ్ఞ చేయగా-

 

          వానలోనే తడుస్తూ వచ్చి, కార్యకర్తల శ్రమ వేడుకను మెచ్చి, వేకువనే లేచి పారిశుద్ధ్య క్సృషిలో పాల్గొన లేని తన అనివార్య అశక్తతకు నొచ్చి- తన తండ్రి (వరదా రామారావు – మాజీ సర్పంచ్ – దాన ధర్మాల్లోనూ సమాజం పట్ల బాధ్యతలోను ఈయనా ఏం తక్కువ తినలేదు-) గారి ద్వితీయ సాంవత్సరీక సందర్భంగా స్వచ్చోద్యమానికి 10,000/- సమర్పించినవారు మాధవీ షోరూమ్ అధినేత వరదా హర గోపాల్!

 

          బుధవారం నాటి శ్రమదానం నాగాయలంక రోడ్డు లోని స్వచ్చ మరుగుదొడ్ల నుండి మొదలు పెట్టాలనేది కార్యకర్తల నిర్ణయం!

 

           ఎట్టి వెలుగుల కిట్టి పయనం!

ఎందుకయ్యా ఇంత కష్టం ఎవరిదండీ ఇంత స్వేదం!

శ్మశానాలను మురుగు డ్రైన్లను సంస్కరించే టంత స్థైర్యం!

ఈ గ్రామం ఏ కాలం ఎచట చూసిన దింత త్యాగం!

ఎట్టి వెలుగుల కిట్టి పయనం! ఎవరి అభ్యున్నతికి మార్గం?    

 

- నల్లూరి రామారావు,

  09.10.2022.