2558* వ రోజు ... ....           10-Oct-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

సోమవారం నాటి పరిశుభ్రతలు 7 గురు రెస్క్యూ టీమువి - @2558*

          10-10-22 వేకువ 4.30 to 6.20 గంగులవారిపాలెం వీధి భద్రతకు పూనుకొన్నది గ్రామరక్షకదళంఅనే ముద్రపడిన ఏడుగురే గాని, కొద్దిపాటి సహకారం ఇద్దరు ట్రస్టు ఉద్యోగులది. దీనికి అతిధి పాత్ర పోషించినది మరో ముగ్గురు – వెరసీ డజను మంది.

          ఊళ్ళోకల్లా శుభ్ర - సుందరంగా, రోజూ 30 - 40 మందికి సందర్శనీయంగా, అభినందనీయంగా, స్వయం ఛాయా చిత్రాల (సెల్ఫీల) - కుటుంబ సామూహిక చిత్రాల కేంద్రంగా మారిన ఆస్పత్రి వీధిలో సుందరీకరించడానికేం మిగిలింది?’ అంటే:

1) గస్తీగది మీదకు ప్రక్కనున్న చెట్టు కొమ్మలు ఆని, రుద్దుకొంటున్నవని వాటి తొలగింపు/క్రమబద్ధీకరణము;

2) 6 వ నంబరు కాల్వ వంతెన రెండు ప్రక్కల మొక్కల మెరుగుదల, కలుపు         తొలగింపు;

3) కాల్వ లోతట్టున పెరిగిన గడ్డి – పిచ్చి మొక్కల ఏరివేత

          అసలు వాళ్ల పౌరుషనామమే (Prestigious Identification) ‘రెస్క్యూ టీంఐనప్పుడు ఇంకా చెప్పేదేమున్నది. ఎప్పుడు – ఎక్కడ - ఏ మురికి – కరకు – బరువు - బండ - మొండి పనులకైనా వాళ్లు సంసిద్ధులేమరి! – అది వానలైనా - మంచులైనా సరే!

          6.30 కు ఈ టీము అప్పటి దాక తాము ప్రయత్నించిన ప్రాంతాన్ని సంతృప్తిగా చూసుకొని, కబుర్లాడుకొని, వాళ్లలో ఒకాయన (BSNL నరసింహరావు) ముమ్మారు స్వచ్చ – శుభ్ర – సుందర వాతావరణ కల్పనా నినాదాలు చెప్పి – నేటికి తమ విధులు ముగించారు!

          మన స్వచ్చంద శ్రమదానం

ఆశావహ దృక్పథమున అడుగులు వేస్తున్నది!

సొంత ఊరి కాలుష్యం అంతు చూచునంత దాక -  

ప్రతి పౌరుని చైతన్యం పడగ విప్పి లేచు దాక –

ఒక సుదీర్ఘ సమరానికి ఉద్యుక్తం ఔతున్నది!

- నల్లూరి రామారావు,

  10.10.2022.