2559* వ రోజు....           11-Oct-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

2559* వ నాడు కూడ రెస్క్యూ టీమ్ ప్రయత్నాలే!

         మంగళవారం వేకువ 4.28 నుండి మొదలైన సదరు ప్రయత్నాలు బెజవాడ రహదారి ప్రక్కన NTR పార్కు చిన్న గేటు వద్ద! ఆ ఉద్యోగులేమో ప్రధానంగా 6 గురు; సంవీక్షించిన కార్యకర్తలేమో ముగ్గురు; నెరవేరిన ముఖ్య బాధ్యతేమో కుంగిపోయి నడిచేందుకు ఇబ్బందిగా ఉన్న పేవర్ టైల్స్ ను సరిజేయడం!

         ఈ ఐదారుగురు గ్రామ రక్షకదళం వారు గానీ - ఒక నిరంతర నిర్నిబంధ స్వచ్చోద్యమం చేస్తున్న ఇతర కార్యకర్తలు గానీ ఊరి మెరుగుదల కోసం శ్రమించడాన్ని దయచేసి ఎవ్వరూ ఉడత సాయంగా అనుకోకుందురు గాక! సీతమ్మ వారికి రక్షణగా నిలిచిన జటాయువు సాయంగా భావించాలని మనవి!

         నేటి సమాజం పోకడని గమనిస్తే - ఊరి ఉద్ధరణకు ప్రసంగాలు చేసే, మాట సాయం చేసే, అర్ధదానం సైతం చేసే వాళ్లైతే కనిపిస్తారు గాని - ఇలా ప్రతి వేకువ గంటన్నరకు పైగా తమ సమయాన్ని, వివేకాన్ని, ఇంత శీతల వాతావరణంలో కూడ తమ చెమటను త్యాగం చేస్తున్న స్వచ్చ కార్యకర్తల్ని మరెక్కడా చూడలేరు! వారి అకుంఠిత దీక్షకూ, సంయమానికీ ఖరీదు కట్టలేరు!

         వర్ణించి, రాసేవాళ్లం ఇలా వ్రాస్తుంటాం గాని – ఊరి కర్తవ్యాన్ని 8 ఏళ్ల నాడు భుజాల కెత్తుకున్న స్వచ్ఛ కార్యకర్తలు మాత్రం ఎప్పటికప్పుడు శక్తి కొద్దీ తమ ముందున్న బాధ్యతను పూర్తిచేయడం తప్ప – తమ శ్రమ శక్తికే నాడూ వెలకట్టుకోరు!

         ఆ బాటన పయనించే వాళ్లో, పార్కులోకి వెళ్లి వచ్చే వాళ్లో నేటి ఐదారుగురి శ్రమతో సౌకర్యంగా ఉన్న చిన్న గేటు బాటను గమనించాలి. అధవా – జై స్వచ్చ చల్లపల్లి సైన్యం మాధ్యమాన్నైనా పరిశీలించాలి. ఇవన్నీ గ్రాఫిక్స్ కానేకావనీ - పెయిడ్ ఆర్టిస్టుల ప్రచారాలు కావనీ నాదీ హామీ!

         6.20 కి తూములూరి లక్ష్మణరావు ప్రకటించిన స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలతో నేటి శ్రమదానం పరిసమాప్తం.

         రేపటి వేకువ మన కర్తవ్యం నాగాయలంక రహదారిలోని బ్రహ్మం గారి గుడి – స్వచ్చ టాయిలెట్ల వద్ద ప్రారంభం కాగలదు!

           అత్యద్భుత మార్గదర్శి!

కొన్ని వింత సంఘటనలె క్రొత్త చరిత కానవాళ్లు

ఒక్క మంచి నిర్ణయమే ఒక ఊరికి మేలు మలుపు

ఆ ఘటనమె - నిర్ణయమే స్వచ్చోద్యమ చల్లపల్లి

అదిక పైన దేశానికి అత్యద్భుత మార్గదర్శి!

- నల్లూరి రామారావు,

  11.10.2022.