2560* వ రోజు ....           12-Oct-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

2560*వ వేకువ శ్రమదాతలు 24 మంది!

          వారి కష్టం ఫలించి విశాలమైన - పరిశుభ్రంగా మారిన 100 గజాల రహదారి అవనిగడ్డ దిశగా ఉన్న ఉభయ గ్రామాల చల్లపల్లి – పాగోలు పంచాయతీల సరిహద్దు! స్వచ్చ కార్యకర్తల కఠిన శ్రమను చూసీ చలించని – తమ ముంగిళ్లలో – తమ సౌకర్యం కోసం జరిగే నిస్వార్ధ స్వచ్ఛంద కృషిలో పాల్గొనని గృహస్తులు 18 వ వార్డుకు చెందిన వాళ్లు!

          4.20 కన్నా ముందే చేరుకొన్న కార్యకర్తలు అక్కడి 3 డంపింగ్ కేంద్రాల్ని – అవి వెదజల్లే దుర్గంధాన్నీ చూసి బెదరలేదు. సదరు చెత్త గుట్టల విశ్వరూపాన్ని – మురుగు కాల్వ వంతెనకు రెండు ప్రక్కల వ్యాపించిన నికృష్టాన్ని మన వాట్సప్ మాధ్యమ చిత్రాల్లో గుర్తించగలరు! 20 మంది 30 కి పై బడిన పని గంటల పారిశుద్ధ్య కృషితో 6.00 తదుపరి ఎలా మారిపోయినవో కూడ వాట్సప్ సాక్షిగా కనిపిస్తాయి!

          8 ఏళ్లుగా ఎడతెగని శ్రమదానం జరుగుతున్న చల్లపల్లేనా ఇది? స్వచ్చ - సుందర చల్లపల్లి అనేదసలు సార్థక నామమేనా? ఈ పారిశుద్ధ్య కార్మికులు ఆ మూడు చెత్త గుట్టల్ని

1) ఖాళీ మద్యం సీసాలుగా,

2) ప్లాస్టిక్ భూతాల ప్రోగులుగా,

3) టెంకాయల – ప్రాత గుడ్డల - తదితర అంకఛండాలాలుగా వింగడించిన సన్నివేశం చూస్తే ఎవరికైనా ఎన్ని ప్రశ్నలు – సందేహాలు వస్తాయి?

          కార్యకర్తల్లో నలుగురికి ఎండు కొమ్మలు - కంపలు తొలగించి, వంతెన ప్రాంతాన్ని సంస్కరించడంతోనే సరిపోయింది. పడిపోయిన మొక్కల్ని నిలిపి, కర్రల ఊతమిచ్చి కాపాడిన వాళ్లూ, పెద్ద బరువైన ఇనుప విద్యుత్ స్తంభాలను రోడ్డు అంచున అందంగా అమర్చిన కార్యకర్తలూ, గబ్బు కొట్టే డంపుల్ని కడుపులో దేవుతున్నా ఎత్తి ట్రాక్టర్ లో నింపిన మొండి ధైర్యశాలురూ నిజంగా అభివందనీయులు!

          తమ వార్డు వీధిని అందంగా రూపొందిస్తున్న లబ్దప్రతిష్టులైన పెద్ద డాక్టర్లూ, వయస్సు మళ్లిన ఉద్యోగులు, గృహిణులూ ఎక్కడి నుండో వచ్చి శ్రమిస్తున్నా బొత్తిగా పట్టించుకోని స్థానికులు మరింతగా అభినందనీయులు!

          తమ స్వచ్చ - సుందరీకరణ నిరంతర కృషికి భిన్నంగా అందమైన వీధుల్ని అనాలోచితంగా కశ్శల పరుస్తున్న సోదర గ్రామస్తుల్ని పల్లెత్తు మాటనని సహనశీలురైన స్వచ్చోద్యమకారులు?

          నేటి ముగింపు సభలో ఆ వార్డు జనులకు గ్రామ స్వచ్చ – సుందర – నినాదాలను ముమ్మారు వినిపించిన కార్యకర్త పసుపులేటి సత్యనారాయణ! అందరి అభిప్రాయ సేకరణతో :

          రేపటి మన శ్రమదానం స్వచ్ఛ మరుగు దొడ్ల కేంద్రంగానే ఉండగలదని ప్రకటించిన వైద్యుడు DRK!

          అందరికీ బొట్టుపెట్టి

నాకెందుకుఅనుకొంటే స్వాతంత్ర్యం దక్కేదా?

మనకెందుకు అనుకొనడం మంచి వాళ్ల లక్షణమా?

ఊరు బాగుపడు పనులకు పూనిక అవివేకమా?

అందరికీ బొట్టుపెట్టి ఆహ్వానం అవసరమా?

- నల్లూరి రామారావు,

  12.10.2022.