2561* వ రోజు ....           13-Oct-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

గురువారం నాటి శ్రమదానం వరుస సంఖ్య – 2561*

         ఆ దానం 4.15 నుండి 6.10 నడుమ; కర్తలు 29 మంది; కర్మలు (అంటే పని చోట్లు) బండ్రేవు కోడు మురుగు కాల్వ వంతెన – కాల్వ గట్లు వగైరా; క్రియలు మరో రెండు ఉద్యానాలు, అవనిగడ్డ దిశగా కొంత రహదారి భాగం మెరుగుదల!

         “ఇవేం లెక్కలు - ఇదేం భాష - ఇదెలాంటి వర్ణన..” అని వాట్సప్ – ముఖ పుస్తక పఠితలు సందేహిస్తారేమో గాని - అంగుళాల చొప్పున కబ్జాలూ, భూదందాలూ, స్వలాభాలకు పరుగులూ, వైంపర్లాటలూ, పరస్పర హననాలూ పెచ్చరిల్లుతున్న సమకాలంలో – ప్రతి వేకువా నియమ నిష్టలతో స్వార్థం వాసనలు సోకని 30 40 - 50 మంది తమ ఊరి కోసం చాతనైనంత శ్రమిస్తున్న లెక్కలూ - భాషా ఇలాగే ఉండాలి!

         గత నాలుగైదేళ్లుగా ప్రచారంలో ఉన్న గ్రాఫిక్సూ, పెయిడార్టిస్టులూ” వంటి మాటలకిక్కడ చోటే లేదు! ఉదయం 6:00 కన్నా ముందు నిద్ర లేచే ఊరి మనుషులకూ, ప్రయాణికులకూ ఈ సుదీర్ఘకాల శ్రమదానం ప్రతి నిత్యం కళ్లెదుటి వాస్తవమూ, తెరిచిన పుస్తకమూ! సదరు పుస్తకంలో నేటి పేజీలోని కొన్ని దృశ్యము లేవనగా:

1) మురుగు వంతెన క్రింద చాల తుక్కునూ, పారుదల కడ్డుపడుతున్న గుర్రపుడెక్కనూ, ప్రాత గుడ్డల మూటల్ని లాగి ప్రోగులు పెట్టుట;

2) ఐదారుగురు కత్తుల వాళ్లు వంతెనకు దక్షిణంగా – అడపా వారి ఉద్యానం దిశగా రోడ్డు మార్జిన్ల బాగుచేత;

3) చీకటి - వెలుగుల క్రీనీడల్లోనే స్వచ్ఛ టాయిలెట్ల దగ్గరి రెండు ఉద్యానాలను ఏడెనిమిది మంది గడ్డినీ – ఖాళీ సీసాలను తొలగించి, పాదుల్ని సరిజేసిన వైనం

4) చీపుళ్ల వారి కష్టంతో ఆ 100 కు పైగా గజాల రహదారి మరింత పరిశుభ్రమైన సంగతి;

5) ఇంకొంచెం వింత సంగతేమంటే: వంతెన ప్రక్కన విద్యుత్ స్తంభం దగ్గర ఏ R&B వాళ్లదో గాని ఒక కొలత రాయి ప్రక్కకు జరిగి సుందరీకరణ బృందానికి కాస్త అనుచితంగా తోచిందట! తమ శ్రద్ధంతా పెట్టి - అరగంటపాటు శ్రమించి ఆ లోపం సరిదిద్ది గాని వాళ్ళు విశ్రమించలేదు!

         వంతెన దాటాక మరో డంపింగును తొలగించి, వ్యర్ధాల గుట్టల్ని ట్రాక్టర్ లో నింపి, రేపు ఎక్కడే పూల మొక్కలు నాటాలో నిర్ణయించుకొని, అది 18 వ వార్డు కాబోలు - అక్కడి ఇళ్ల వారికి కౌన్సెలింగ్ గురించి చర్చించి....

         ఇవన్నీ అయ్యేప్పటికి 6.30 గడిచి, గ్రామ సర్పంచమ్మ ముమ్మారు తన ఊరి స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సంపాదక నినాదాలు పలికి - వీలైనప్పుడు నారాయణరావు నగర్ లో శ్రమదానం కోసం అభ్యర్థించి 6.30 పిదప కార్యకర్తలు గృహోన్ముఖులయ్యారు!

         కొన్నాళ్ల ఎడంతో శ్రమదాన పునః ప్రవేశం చేసిన కార్యకర్త కోడూరు వేంకటేశ్వరరావు గారు యధావిధిగా తన నెల చందా 520/- ‘మనకోసం మనంట్రస్టుకు జమ చేశారు.

         మన రేపటి శ్రమదాన గమ్య స్థలం కూడ నాగాయలంక రహదారే!

         జగతి శిరోధార్యమా

అనూహ్యమా - అమోఘమా – అనన్యమా - అశేషమా?

వివేకమా – విలాసమా – వికాసమా - వినోదమా!

స్వచ్ఛ కార్యకర్త తెగువ సమాజాని కవసరమా?

సాహసాల చల్లపల్లి జగతి శిరోధార్యమా?

- నల్లూరి రామారావు,

  13.10.2022.