2562* వ రోజు....           14-Oct-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

శుక్రవారం వేకువ శ్రమదానం - 27 మందితో - @2562*

        14-10-22 ఉదయాన స్వచ్ఛ కార్యకర్తలతో వరుణుడు కూడ జతకట్టాడు. అసలే పని జరుగుతున్నది – నిన్న బ్లీచింగ్ చల్లినా కంపు కొటుతున్న బండ్రేవు కోడు వంతెన దగ్గరి చిన్నపాటి చెత్త కేంద్రాలు; నిన్న వాన తగ్గినా తడిపొడిగానే ఉన్న నాగాయలంక రహదారి ప్రాంతం.

        ఏ దేవత శాపమో/ ఏ గ్రామస్తుల పాపమో గాని ఈ ఏడెనిమిదేళ్లుగా మాటిమాటికీ కార్యకర్తలు శుభ్రపరుస్తున్నా సరే ఇక్కడ మినీ డంపింగులు వెలుస్తూనే ఉన్నాయి. పంచాయతీ, ట్రస్టు కార్మికులకు చేతి నిండా పనికల్పిస్తూనే ఉన్నాయి - అక్కడి వారి సామాజిక స్పృహ ఏమిటో, వార్డు బాధ్యుల జాగ్రత్తలేమిటో – చెత్త బళ్ళు రోజూ తిరుగుతుంటే అసలుదికాక ఈ కొసరు చెత్త కేంద్రాలెందుకో ఎవర్నడగాలి?

        డజనుకు పైగా కార్యకర్తల వంతెన పరిసరాల్లో మూడవ నాటి కృషిని దగ్గరగా గమనించాను. ఎన్ని ప్లాస్టిక్ గోనె సంచులు, దిక్కుమాలిన ప్రాత గుడ్డల మూటలు, గాజు - ప్లాసిక్ సీసాలు, ముళ్లమండలు – ఎక్కడి నుండి ఎందుకక్కడ ప్రోగుపడ్డాయో ఎవరికెరుక? కాల్వ నుండి, అంచుల నుండి,  దక్షిణపు గట్టు నుండి సేకరించిన రకరకాల చెత్తలతో సగం ట్రాక్టరు నిండింది!

        రహదారికి పడమర వైపున నిన్నా - మొన్నటి సుందరీకరణ – హరితీకరణ ప్రయత్నం నేటికి ఒక కొలిక్కి వచ్చినట్లుంది. వరినారు మడిని సిద్ధం చేసినంతగా ఆ జాగాను తీర్చి దిద్ది రెండు రకాల పూల మొక్కలు నాటారు!

        మిగిలిన స్వచ్ఛ కృషీవలురు అవనిగడ్డ బాట వెంట - ముఖ్యంగా పడమర ప్రక్కన కత్తులు ఝళిపించీ, చేతుల్తోనే పీకేసీ, దంతెలకు పని చెప్పీ హరిత సుందరమైన రహదారికి మరింత హంగులద్దారు!

        ఈ కార్యకర్తలందరి నేటి సంపాదన అణిచిపెట్టి సర్దిన పెద్ద ట్రాక్టరు నిండుగానూ, ఏ కాస్తయినా తమ ఊరి బాధ్యతలు నెరవేర్చగలిగామనే సంతృప్తి మనసుల్లో మెండుగానూ!

నేటి శ్రమ వేడుక ముగింపు సభా విశేషాలు :

- మైకు అక్కర లేని కోడూరు వారి గొంతు నుండి త్రివిధ గ్రామ మెరుగుదల నినాదాలూ

- తమ కోడలి తరపు నుండి (అట్లతద్దె సందర్భం?) పల్నాటి అన్నపూర్ణా – భాస్కరుల మిఠాయిల పంపకమూ

        రేపటి మన కొద్దిపాటి సామాజిక బాధ్యతలకై కలిసి సాగదగిన చోటు ప్రభాకరుల వడ్లమర దగ్గరే!

       కావ్యకర్తలెవరంటే

సుమ సుందర చల్లపల్లి సుమనోహర కావ్యమా!

కావ్యకర్తలెవరంటే - కార్యకర్తలను నిజమా!

గ్రంథరచన సమయమందు కావ్యానంద విభ్రమమా!

అలౌకికానందమేన! ఆచరణ ప్రధానమా!

- నల్లూరి రామారావు,

   14.10.2022.