2563* వ రోజు....           16-Oct-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

ఆదివారం వేకువ శ్రమ వేడుక కూడ అవనిగడ్డ దారిలోనే @ 2563*

25 మంది గట్టిగా పూనుకొని నెరవేర్చిన సదరు సామాజిక బాధ్యతలు ఆసాంతం చిన్నా- చితకా వాన జల్లుల్లోనే! కాలుదిగుతున్న బురదలోనే, రోడ్డు పైన నీటిలో వేగంగా వచ్చిపోయే అనేక వాహనాలను కాచుకొంటూనే! బహుశా ఆ ప్రయాణికుల దృష్టిలో ఈ అననుకూల వాతావరణంలో జరిగే కార్యకర్తల శ్రమ ఒక వెర్రి చాదస్తమేమో!

          మన DRK డాక్టరు గారు పదే పదే చెపుతున్నట్లు “ అసలీ రోజుల్లో ఏ స్వలాభమూ ఆశించని ఇంత కాయ కష్టం ఎవరు చేయగలరు?” ఎవరైనా ఇది కార్యకర్తల వ్యసనమే అనుకొంటే – ఇదొక మంచి వ్యసనమనుకోవాలి! భూ కబ్జాల కోరులు – తియ్యని అబద్ధాల మోసకారులు- దందాల వీరులు.... ఎవరు తమ వ్యసనాల్ని మానుకొన్నారు గనుక? అందువల్ల స్వచ్చ కార్యకర్తల అరుదైన ఈ వ్యసనానికి చల్లపల్లి ప్రజానీకం జై కొట్టుతూనే ఉండాలని మా మనవి!

          మన గుంపుకు చెందిన వాట్సాప్ మాధ్యమ చిత్రాన్ని కాస్త గమనించండి- అది కురుస్తున్న వాననీ, బాటపైన నీటినీ, ఆ సమయంలోనే జరుగుతున్న కార్యకర్తల కృషినీ చూపుతున్నది! వడ్ల మరకు పడమరగా – ఇంకా తెలతెలవారని చీకటి వెలుగుల్లో- చినుకుల నడుమ – ఇటు అడపా ఉద్యానంలో, అటు రెండవ రోడ్డు మార్జిన్లో – ఎన్ని వందల పూల మొక్కల – నాలుగైదు రకాల రంగుల పూలు – లక్షల సంఖ్యలో ముగ్ధ మనోహరంగా కొలువైన కారణం ఈ కార్యకర్తల శ్రమ ఫలితం కాక మరేమిటి?

          ఐతే – ఎనిమిదేళ్ళ ఈ మహత్కృషినీ – తత్ఫలితంగా ఇంతగా స్వచ్చ సుందరమైన రహదారి వనాలనీ – ఏ 10-15 శాతం మందో తప్ప గ్రామస్తులెవరు అనుభూతిని చెందుతున్నారు? రోజులో ఒక్క గంట తమ ఊరి బాగు కోసం శ్రమించేందుకెందుకు మొహమాటం- సంకోచం?

          ఈ వేకువ కూడ రహదారికి పడమరగానే కార్యకర్తల కృషి ఎక్కువగా సాగింది. వడ్లమర పెద్ద ప్రవేశ ద్వారం దగ్గరా, ఆరేడుగురి ప్రయత్నం జరిగింది! మొన్న 3 రోజుల సుందరీకరణకు అదనంగా మురుగు కాల్వ వంతెన దగ్గర కూడ ఈ వేకువ ఒకరిద్దరి నగిషీ పని నడిచింది!

          పద్మాల దగ్గర- వడ్లమర చిన్న గేటులో చిట్టడివిని నలుగురు దృఢ కాయుల (మంచి) చతుష్టయం అరగంటకు పైగా తొలగించగలిగింది.

          సమ్ అర్థవంతంగా నడచిన 15 నిముషాల సమీక్షా సభలో:

1) ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు ప్రోగేసిన ప్లాస్టిక్ తుక్కుల సంపాదన – 612 /- ట్రస్టు ఖర్చులకు జమపడి –

 

2) ఇనపకుతిక వేంకట రామరాజ ప్రవచిత స్వచ్చ- శుభ్ర – సౌందర్య నినాదాలు మారు మ్రోగి-

 

3) నిశ్చింతగా ప్లాస్టిక్ తునకల్ని తెలియకుండానే భోంచేస్తున్న ప్రమాద హెచ్చరికలు విని – 6.35 కు గాని కార్యక్రమం ముగియలేదు.

          మంగళవారం శుభోదయ శ్రమదానం కోసం నాగాయలంక రోడ్డు లోని కమలాల  దగ్గర కలుద్దాం!

         వారి పాత్ర ప్రశ్నార్థకం!

సాగుతోంది అష్ట వర్ష స్వచ్చోద్యమ వింత రథం

స్వార్థ రహిత శ్రమ జీవన శ్రావ్య వినుత సంగీతం

అవి ఎవరికి శుభకరములొ – అలరించేదెవ్వరినో

వారి పాత్ర పరిమితమై నిలుచుటె ప్రశ్నార్థకం!   

- నల్లూరి రామారావు,

  16.10.2022.