1919 * వ రోజు....           12-Feb-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!   

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం1919* వ నాటి శ్రమ విశేషాలు.

మబ్బు పట్టిన ఈ వేకువ 4.00 – 6.25 నిముషాల నడుమ జరిగిన ద్విముఖ స్వచ్చ కృషిలో భాగస్వాములు 31 మంది. శ్రమదాన వేదికలు : 1) బైపాస్ మార్గం లోని సాగర్ టాకీస్ నుండి నారాయణ రావు నగర్ ప్రధాన ముఖ ద్వారం వరకు  2) RTC ప్రాంగణం.

 

ఇందులో 20 మందికి పైగా స్వచ్చ సుందర కార్యకర్తలు మొదటి కృషి వేదిక లోని దారికిరువైపుల అనవసరమైన మొక్కలను, ప్లాస్టిక్ తదితర తుక్కును, స్థానిక గృహస్థులు వదలిన వివిధ రకాల వ్యర్ధాలను నరికి, ఏరి, పోగులు పెట్టి తమకు నచ్చినంత దాకా సుమారు రెండు గంటల పాటు పాటుపడుతూనే ఉన్నారు. వీరు శుభ్ర పరచిన చోటులలో తామే నాటి పెంచిన రహదారి వనాలు, డ్రైన్లు, డ్రైను గట్టుల మీద వ్యర్ధాలు ఉన్నవి. దారికి ఆనుకొని పెరిగిన జిల్లేడు కంపను కూడా (పంచాయితీ E.O గారి సూచనల మేరకు) నరికి తొలగించడమైనది.

 

ఎంతో ఆహ్లాదాన్ని, పచ్చదనాన్ని, ప్రాణ వాయువును గ్రామ సౌందర్యాన్ని పెంచే ఏడాకుల మొక్కల నేమో అర్ధం పర్ధం లేని వదంతులతో, సదవగాహనా రాహిత్యంతో నరికివేస్తున్న  కొందరు స్థానికులు ప్రయాణికులకు అసౌకర్యం గా రోడ్డు వార పెరుగుతున్న ఈ జిల్లేడు మొక్కలను మాత్రం ( సాకి పెంచరు కానీ) తొలగించేందుకు అభ్యంతరం చెప్పుతారు.

 

 నిన్న విరామం ఇచ్చిన సుందరీకరణ కృషి ఈనాడు RTC బస్ ప్రాంగణంలో మళ్లీ ప్రారంభమై పాత మరుగు దొడ్ల శిథిల కుఢ్యం మీది పురాతన కోట దృశ్యం(దాని పేరు రాయకుండానే) స్వచ్చ సుందర మనోజ్ఞంగా అక్కడి ప్రయాణీకులను ఆకర్షిస్తున్నది. ఉదయం 7.00 లు దాటినా వీళ్లు చిత్ర లేఖన దీక్షను, సృజనాత్మకతను విరమించలేదు.

 

6.45 నిముషాలకు లయన్ కస్తూరి వర ప్రసాద్ ముమ్మారు తడబాటు లేకుండా ధృఢంగా ప్రకటించిన స్వచ్చ సుందర గ్రామ సంకల్ప నినాదాలతో ఈనాటి మన శ్రమదాన వేడుక జయప్రదమైంది.

 

రేపటి మన స్వచ్చంద శ్రమదాన వేదిక కూడ బైపాస్ రోడ్డు లోనే! దీనికోసం నారాయణ రావు నగర్ వెళ్లే రోడ్డు వద్ద కలుసుకొందాం.

     నిజంగానే అనంతంగా సాగిపోనుందా!

ఏ మెదడులో చిన్న కదలిక- ఎక్కడో ఒక అంకురార్పణ

కొద్ది మంది వినూత్న చేతన- వేల ప్రజలకు నిత్య ప్రేరణ

జ్వలిత స్వచ్చోద్యమ స్ఫూర్తికి అంకురార్పణ చల్లపల్లే

నిజంగానే ఈ మహోద్యమ నిరతి ఆగక సాగిపోనుందా!

 

నల్లూరి రామ రావు

 స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

బుధవారం – 12/02/2020

చల్లపల్లి.