2564* వ రోజు ....           17-Oct-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

అతికొద్ది మందితో బందరు వీధి మెరుగుదల - @2564*

        అది ఈ సోమవారం (17.10.22) వేకువ కాలం; బందరు వీధిలో – మునసబు గారి రోడ్డు వద్ద; సమయం 4:29. కార్యకర్తలు బొత్తిగా నలుగురు - వాళ్లకు మద్దతుదారులు మరో నలుగురు.

        నలుగురైనా – నలభై మందైనా ఈ గ్రామంలో ముప్పూటలా “మనకోసం మనం” ధార్మిక సంస్థపుణ్యమా అని స్వచ్చ – సుందరోద్యమ పతాకం ఏదో ఒక చోట రెపరెపలాడుతూనే ఉన్నది – ఎనిమిదేళ్లుగా! సదరు యజ్ఞ ఫలంగానే చలపల్లి పేరు రాష్ట్రీయంగా, దేశీయంగా, అంతర్దేశీయంగా స్ఫురిస్తూనే ఉన్నది!

        ఎవరు మెచ్చినా – ఎవరు నొచ్చినా – స్వచ్చ కార్యకర్తల శ్రమదాన ప్రస్థానం ఆగనే లేదు. ఈ నాటి స్వల్ప సంఖ్యాక స్వచ్చాభిలాషుల ఆ ప్రయత్నం వైజయంత భవనం దగ్గరి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రక్కన పేవర్ టైల్స్ పునర్నవీకరణ రూపంలో జరిగింది.

        క్రుంగిన - చెదరిన రంగురాళ్లను పెకలించడమూ, గుంటల్లో మట్టి కాక - ఇసుక కూరడమూ - తమకు చాతనైనంత అందంగా, సౌకర్యంగా, చదునుగా వాటిని అమర్చడమూ నేటి కష్ట చతుష్టయ కార్యకర్తల పని!

        ‘ఒక చిన్న స్థలంలో గంటన్నర పాటు చేసిన ఈ కొద్దిపాటి కృషి ఇంతగా ప్రస్తావనాంశమా’ అనుకోనవసరమేముంది? చిన్న సెలయేళ్లూ, వాగులూ, వంకలే కలిసి మహానదులుగా మారినట్లు – ప్రతి వార్డులో కొందరిట్లా పూనుకొంటే ఈ గ్రామం ఇంకెంత శుభ్ర - సుందరంగా, అనతికాలంలో మారిపోతుందో!

        కార్యకర్తల తరపున ముమ్మారు ఊరి మెరుగుదల ప్రతిజ్ఞలు చేసిన వారు మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారు.  

        రేపటి వేకువ మనరాక కోసం ఎదురుచూస్తున్నది నాగాయలంక దారిలోని సుబ్బనాగన్న ఆశ్రమ - కమలాల ప్రదేశం!

       శ్రమ జీవన సంగీతం!

విడదీయరాని అనుబంధం వీధుల పరిశుభ్రతతో

ఎడబాయని సంబంధం గ్రామజనుల స్వస్తతతో

సామూహిక సమున్నతే స్వచ్చోద్యమ అభిమతం

సకల జనుల ఆరోగ్యమే శ్రమ జీవన సంగీతం!

- నల్లూరి రామారావు,

   17.10.2022.