2565* వ రోజు .......           18-Oct-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

23 మందితో నెరవేరిన వీధి బాధ్యతలు - @2565*

          మంగళవారం (18.10.22) 4.20 - 6.10 నడిమి వేళలో - నాగాయలంక బాటకు తూర్పుగా - మూడుచోట్ల - ప్రధానంగా కమలాల నుండి బళ్ల నాగన్న ఆధ్యాత్మిక కేంద్రం దాటే దాక - తమ సామాజిక కర్తవ్యాన్ని మరువని స్వచ్ఛ కార్యకర్తల శ్రమ విన్యాసాల కథ ఇది!

          1000:1 నిష్పత్తిలో చల్లపల్లి గ్రామస్తుల చైతన్యమూ – ముందుచూపూ సాధించింది 7 పెద్ద రహదార్లలో - ఒక్కదానిలో 100 గజాల స్వచ్చ సౌందర్యాలే కావచ్చు! ఎనిమిదేళ్లనాడు స్వచ్ఛ భారత్ నినాదమిచ్చిన కేంద్ర ప్రభుత్వం గాని, ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించిన, ఫ్లెక్సీలుండ బోవని గట్టిగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం గాని మరచిన - పట్టించుకోని పర్యావరణ భద్రతకు తమ పరిధిలో నిరంతరం కృషి చేయడం చిన్న సంగతి కానే కాదు!

          ఆ మేరకు ఈ స్వచ్చ కార్యకర్తలకు దేశాభ్యున్నతిలో కాదు గాని - చల్లపల్లి గ్రామ చరిత్రలో తొలి పుటల్లో మన్నన దక్కి తీరాలి! “అందరూ అత్యంత నీచ - నికృష్టమని భావించే ఈ నిత్య పారిశుద్ధ్య చర్యలు నిస్వార్థంగా - బాధ్యతగా దేశంలో ఎవరు చేసారు?” అని మనం సవాలు చేయవచ్చు కూడ!

          నేటి వేకువ కాలాన్నే పరిగణిస్తే - ఈ గ్రామ బాధ్యులు సగటున తలా ఐదారు కిలోమీటర్లు పయనించి వచ్చి శ్రమదానానికి పాల్పడ్డారు! శ్రమించిన పని గంటలు 30 - 35 కావచ్చు గాని - అందరి సమయదానం 50 - 60 గంటలు!

          వీరిలో ఐదారుగురి కష్టం అడపా గార్డెన్స్ అంతర్భాగానికి పరిమితమైంది. వాళ్ల కత్తి వాదరలకూ - దంతె లాగుడులకు అవసరమైన పూల – హరిత వృక్షాలు తప్ప – పిచ్చి కలుపులూ, ప్లాస్టిక్ తుక్కులూ, బలైపోయి, రహదారి వనం మరికొంత శోభాయమానమయింది!

          నిన్న కొందరు బాగుచేసిన వడ్లమర చివరి ద్వారం దగ్గర ఈ వేకువ సుందరీకరణ చతుష్టయం పట్టిపట్టి - శ్రద్ధపెట్టి  “నైబర్స్ ఎన్వీ” అనేంతగా తీర్చిదిద్దింది!

          మిగిలిన కొందరు కమలాల చోటు నుండి దక్షిణంగా రోడ్డు మార్జిన్లను శుభ్రపరుచుకొంటూ పోయారు! సమయపాలన మరవని లోడింగ్ కార్మికులు పాక్షికంగా వ్యర్ధాలను ట్రక్కులో నింపారు.

          అద్దంలా సుందరీకరించిన భాగాన్ని ఎవ్వరూ నిర్ధాక్షిణ్యంగా కబ్జా చేయరాదని ఊరంతటి తరుపున కోరుకొందాం!

          6.30 కు గ్రామ స్వచ్చ – సుందరోద్యమ సంకల్ప నినాదాలను ప్రకటించినది షణ్ముఖ – శ్రీనివాసుడు! శ్రమ ముగ్దుడై - సమీక్షించినది మన స్వచ్చ వైద్యుడు!

          మన రేపటి ఐచ్చిక శ్రమదానం కోసం బండ్ల సుబ్బ నాగన్న ఆశ్రమ ద్వారాన్నే ఆశ్రయిద్దాం!

          పరిశుభ్రతె పరమాత్మని

పరిశుభ్రతె పరమాత్మని ప్రాచీనులు సెలవస్తే

అంతరంగ స్వచ్ఛతయే ఆరోగ్య రహస్యం ఐతే

ప్రజలందరి స్వస్తతయే మనమేలని తలపోస్తే

అలాంటి సంస్కృతి కొరకే స్వచ్చోద్యమ మనుకొంటే...

- నల్లూరి రామారావు,

   18.10.2022.