2566* వ రోజు....           19-Oct-2022

 కేవలం ఒక్కసారికే పనికి వస్తూ - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

అదే నాగాయలంక బాట ఆ పాతిక మందే - @2566*

        బుధవారం (19.1022) వేకువ కూడ ఇంచుమించు నిన్నటి శ్రమదాన దృశ్యాలే! ఏడేళ్లకు పైగా స్వచ్చ - పరిశుభ్ర - సుందరంగా, హరిత వైభవంగా, రంగురంగుల పూల సొగసులతో ఉన్న ఈ రహదారి భాగం మీద కొందరు గ్రామస్తుల, ప్రయాణికుల కశ్మల దాష్టీకం ఆగదు, దీనితో సహా 7 రహదార్ల స్వచ్చతకు కట్టుబడ్డ ఈ పాతిక - ముప్పై – నలభై మంది శ్రమ వీరుల ప్రయత్నమూ నిలిచిపోదు!

        కార్యకర్తల శ్రమకు నోచుకొన్న స్థలం ఇంచుమించు నిన్నటిదే! అదనంగా రహదారి పడమటి భాగమూ, ఆశ్రమ ప్రాంతంలోని డ్రైను వంటివీ!

- ఆ సిమెంటు వొరల - తూముల అతి పెద్ద దుకాణమెవరిదో తెలియదు గాని, దాని ప్రవేశద్వారం ఎదుటి ఖాళీ స్థలం మీద సుందరీకర్తల కన్ను పడడమూ – ఆ నలుగురి ప్రయత్నంలోనే గడ్డి తొలగి, పిచ్చి చెట్లు మాయమై, గలీజంతా అదృశ్యమై – అద్దంలా రూపొందడమూ ఇప్పుడు ప్రత్యక్ష సాక్ష్యాలు!

- మైకు నుండి వినపడే మంచి పాటల్ని మించి - ఈ వేకువ వ్యర్థాలను తునాతునకలు చేసే వింతమర (ఇది మనకు వనపర్తి డాక్టర్ల వితరణ) చప్పుళ్లు వినిపించాయి.

- ముగ్గుర్నలుగురు పనిమంతులు మాత్రం రోడ్డుకు తూర్పుగా - నిన్నటి శ్రమ చోటనే మొక్కలకు పాదులు చేస్తూ, చెట్ల కొమ్మల్ని క్రమబద్ధీకరిస్తూ, ప్లాస్టిక్ అవశేషాల్ని ఏరుతూ కనిపించారు.

- అవి సరేగాని, సుబ్బనాగన్న ఆశ్రమ ద్వారం వెలుపల అరబండెడు చెత్త డంపింగ్ ను చేతులు నొప్పెడుతున్నా దంతెలతో లాగితే పర్వాలేదు గాని, ఆ బురదలోనే పిచ్చి – ముళ్ళ మొక్కల్ని నరికితే నరికారు గాని, కాళ్లు జారి లోతైన డ్రైనులో పడే అవకాశమున్న చోట – చెట్లను సుందరీకరించడం నలుగురు కార్యకర్తలకు (అందులో ఇద్దరు 70 ఏళ్ల సగటు పెద్దలకు) అవసరమా అని!

        ఇన్ని ఔత్సాహిక శ్రమదానాల పిదప - కాఫీ కబుర్ల పిమ్మట – 6.40 సమయంలో ఆధ్యాత్మిక కేంద్రం లోపల నెలకొన్న సమీక్షా సభలో:

- కాస్త గంభీరంగా సొంతూరి పరిశుభ్ర - సౌందర్య సంకల్ప నినాదాలు పలికినది పోస్టల్ ఉద్యోగి మెండు శ్రీనివాస్ కాగా

        మరో పది రోజులకు మన స్వచ్ఛ - సుందర చల్లపల్లికి అకారణ బంధువైన గురవారెడ్డి సకుటుంబ సపరివారంగా వచ్చే వార్తను ప్రకటించినది డాక్టర్ దాసరి రామకృష్ణ గారు!

        మన రేపటి శుభోదయ శ్రమదాన బాధ్యతలకై వచ్చి కలువదగిన చోటు కూడ అవనిగడ్డ రోడ్డులోని బండ్ల సుబ్బ నాగన్న ఆశ్రమమే!

        పారాహుషార్

ఎవరో వచ్చేస్తారని... ఏమేలో చేస్తారని....

ఊరుమ్మడి పనులన్నీ ఉచితముగ ముగిస్తారని...

అడిగిన - అడగని కోర్కెలు అవలీలగ తీరుస్తారని...

భ్రమలో మునిగిన జనులకు పారాహుషార్ చెప్పాలని...!

- నల్లూరి రామారావు,

  19.10.2022.