2567* వ రోజు.......           20-Oct-2022

 కేవలం ఒక్కసారికే పనికి వస్తూ - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

2567* వ నాటి - 28 మంది నిష్కామ కర్మలు.

          నిజానికవి 8 ఏళ్లుగా - నియమానుసారంగా జరుగుతున్నవే! 30 - 40 మంది సామాజిక కర్మిష్టుల - 21 మంది ట్రస్టు ఉద్యోగుల పారిశుద్ధ్య అనుష్టానం వేకువ 4.00 మొదలు సాయంత్రం వరకూ – ఊరి వీధుల్లోనో, శ్మశానాల్లోనో, స్తంభించిన మురుగుపారుదలల వద్దనో, రహదార్ల గుంటల కడనో, పార్కుల్లోనో, హరిత సౌందర్యాలు తగ్గిన ఏ వీధిలోనో నిత్యమూ కనిపించేవే!

          ఆ యదార్ధ దృశ్యాలు చూసి చూసీ, కార్యకర్తలు మైకు నుండి వినే ప్రబోధ గీతాలు వినీవినీ పాతచింతకాయ పచ్చడి ఐపోయినవేమో గాని - ఇప్పటికీ సహృదయ గ్రామస్తుల, సంస్పందన నిరాశాజనకంగానే ఉన్నది! ఊరంతటి మేలునాశించే శ్రమదానం పట్ల సగం మంది పౌరుల వైఖరి ఇలాగా?

          వెనకటి కెవరో సామాజిక శాస్త్రజ్ఞుడు (కారల్ మార్క్స్) చమత్కరించినట్లు – ఇంత పెద్ద ఊళ్ళో రోజూ 100 200 మందైనా కనీసం గంట చొప్పున ఉమ్మడి శ్రేయస్సు కోసం పాటుబడితే పోయేదేముంది - కొన్ని శారీరక మానసిక రుగ్మతలు తప్ప?

          ప్రతి వేకువ వలెనే ఈ గురువారం బ్రహ్మ ముహుర్తాన సైతం 4.19 – 6.06 నడిమి కాలంలో కార్యకర్తల కృషి యదావిధిగా జరిగింది. అవనిగడ్డ రహదారిలో నేటి శ్రమదానం సుబ్బనాగన్న ఆశ్రమం మొదలు 7 వ నంబరు పంటకాల్వ దాక విస్తరించింది.

          3 గోతాల సారా గాజు/ప్లాస్టిక్ సీసాలు, ఒక ట్రాక్టరు నిండుగా ఇతరేతర వ్యర్ధాలూ చెత్త కేంద్రానికి తరలిపోయినవి! పట్టుమని 30 మంది కార్యకర్తలు తలుచుకొంటే ఒక సువిశాల రహదారి ఎంత పొందికగా - చూడ చక్కగా మారుతుందో మరొకమారు ఋజువయింది! కాస్త వివరంలోకి పోతే:

- రోడ్డు మార్జిన్ - డ్రైను మధ్య అంచు వర్షం నీటికి కోసుకుపోకుండా కొన్ని దుంగలు అడ్డువేసిన వైనం,

- పడిపోయిన పెద్ద తాటి చెట్టును పడమటి డ్రైను నుండి కదలించి, మట్టలు నరికి, రోడ్డుకు కాదు - మార్టిన్ కు రక్షణ కల్పించడం,

- ఊడ్చేవాళ్లు 150 గజాల బాటను ఊడ్చే బాధ్యతలో మునగడం,

- చివరి 25 నిముషాల్లో వ్యర్థాలను ట్రక్కులోకి చేర్చడం...

          ఇది కేవలం గత 8 ఏళ్ల కథ కాక – ఊళ్ళో ప్రతి వార్డులో, ప్రతి ఇంట్లో స్వచ్ఛ - శుభ్ర - స్పృహ కలిగే దాక - మరో ఎనిమిదేళ్లకు సైతం విస్తరించే కథ!

          6.35 కు బాల కార్యకర్తలు – ఆర్య, ఆరవ్ గళవినిర్గళ యుగళ నినాదాలతోనూ, కార్యకర్తల శ్రమ పట్ల DRK గారి పరమానందంతోను నేటి బాధ్యతలకు స్వస్తి.

          రేపటి ఉషోదయ రహదారి పరిశుభ్రత కోసం మనం కలుసుకోదగినది 7 వ నెంబరు కాలువ దగ్గర!

          ఈ స్వచ్చ – సుందరోద్యమమే!

సార్ధక శ్రమదానానికి - సామూహిక పురోగతికి –

సజ్జన సాంగత్యానికి – స్వచ్ఛ మధుర భావనలకు –

సామాజిక బాధ్యతలకు – జాగృతికీ - చేతనకూ

ఒక వేదిక – ప్రాతిపదిక – ఒక శాశ్వత చిరునామా!

- నల్లూరి రామారావు,

  20.10.2022.