2568* వ రోజు....           21-Oct-2022

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

7 వ నంబరు పంటకాల్వ కేంద్రంగా 23 మంది బాధ్యతలు - @2568*

          సదరు బాధ్యతలకు పూనుకొన్న సమయం వేకువ 4.22 వేళ - శుక్రవారం (21-10-22) స్వచ్ఛ కార్యకర్తల రాకకోసం వేచి ఉన్న స్థలం అననిగడ్డ మార్గంలో నిన్నటి తరువాయిగా! వివిధ కశ్మలాల మీద వాళ్ళు తీర్చుకొన్న కసి మరో 100 గజాలలో! అందిపుచ్చుకో గల సత్తా ఉన్న గ్రామస్తులెవరైనా ఉంటే గింటే - ఈ అల్పసంఖ్యాక శ్రమజీవులు పంచిన స్తూర్తి వాళ్ల స్తోమతను బట్టి!

          ఎంతో ముందు చూపుతో ఇందరు నిస్వార్థ స్వచ్ఛ కృషీవలుర అభిమాన గ్రామం - చల్లపల్లి ఒక నడిమి తరగతి మహిళ అనుకొంటే - ఆమె స్వచ్ఛతకూ, పచ్చదనాల - అయాఋతుక్రమ పూల సొగసులకూ – బాహ్యాంతర పరిశుభ్రతకూ ఎనిమిదేళ్లకు పైగా నిరంతరంగా వీరు శ్రమిస్తూనే ఉన్నారు!

- ఎవరు కలిసి వచ్చినా, రాకున్నా 4 లక్షలకు పైగా పని గంటల తమ మేధస్సునూ, శరీర కష్టాన్నీ, అప్పుడప్పుడూ అవసరమైతే ధనాన్నీ నిస్సంకోచంగా వ్యయిస్తూనే ఉన్నారు!

- మరి వీళ్లది సాటిలేనిలోకోపకారమనాలా - సంఘజీవులుగా కర్తవ్య పాలనమనాలా – అమాయకమనాలా - అమేయ దక్షత అనాలా.....అన్నది వేరే చర్చ!

          తలా 105 నిముషాలు శ్రమించిన నేటి కర్మవీరుల్లో రైతులున్నారు, మధ్య తరగతి గృహిణీమ తల్లులున్నారు, విశ్రాంత ఉద్యోగ వృద్ధులున్నారు. చిరు వ్యాపారులున్నారు – విశేషించి - వయస్సు తెచ్చిన శారీరక రుగ్మతల్ని అధిగమించి, ఉండబట్టలేక - వచ్చి ఎంతోకొంత పనిచేసిన ఒక వైద్య వృద్ధుడూ ఉన్నారు – (గాని, ఊరి జనం నుండి అదనంగా వచ్చిన క్రొత్త ముఖాలు లేవు గాక లేవు!)

          ఈ ఉదయం కూడ ఎప్పటిలాగే ప్లాస్టిక్/గాజు సీసాల, సంచుల, త్రాగి పడేసిన కొబ్బరి బొండాల, ఇతర వ్యర్ధాల సేకరణమూ, ప్రగాఢ పచ్చదనమూ, దట్టమైన క్రిక్కిరిసిన పూల వైభవమూ – కాళ్ళ క్రింద మాత్రం బురదా ఉన్న చోట 15 మంది చేసిన పారిశుద్ధ్యమూ, పరిధినతిక్రమించిన కొమ్మల కత్తిరింపులూ వంటి కృషి జరిగి పోయింది గాని, వర్ణనార్హమైన దృశ్యమొకటి కనిపిచింది:

          అదేమంటే – పంట కాలువ తూము కడ్డుపడుతున్న పొడవాటి – బరువాటి ఈత చెట్టు కాండం బాగా నీళ్లు త్రాగి, ఉబ్బి బలాన్నీ బరువునూ పెంచుకొన్న ఆ మొద్దు ఐదారుగురు కార్యకర్తల బలాన్ని, పట్టుదలనూ పావుగంటకు పైగా పరీక్షించింది. దాన్ని పైకి లాగి, వేరొక చోట అందంగా అమర్చిన పోరులో విజేతలు కార్యకర్తలే! (వీళ్లెంత అతి జాగ్రత్త పరులంటే – అక్కడి ఒక పూల మొక్క ఈ సందడిలో నలిగి దెబ్బ తినకుండా చూసుకున్నారు!)

          6.15 కు గాని పని ముగించని కొందరు కార్యకర్తల్తో 6.35 కు గాని జరగని సమీక్షా సందడిలో ముమ్మారు సాధికారికంగా ఊరి స్వచ్చ – శుభ్ర - సౌందర్య దీక్షా నినాదాలు ప్రకటించిన (లాటరీ విజేత!) ఆకుల దుర్గాప్రసాదు!

          రేపటి వేకువ మన పునర్దర్శనం అమరస్తూపం దగ్గరని నిర్ణయించినది కార్యకర్తలందరూ!

        స్వచ్ఛ సైనికు లెట్టులౌదురు?

సొంత లాభమె చూచుకొంటే - స్వసుఖ మొక్కటె కోరుకొంటే –

ఇరుగు పొరుగుల – ఊరి బాధలు ఎంత మాత్రం పట్టకుంటే –

స్వచ్ఛ సైనికు లెట్టులౌదురు? ప్రజల మన్నన లెట్లు పొందిరి?

దిన దినం వెలకట్ట జాలని తృప్తి వారల కెట్లు దక్కెను?

- నల్లూరి రామారావు,

   21.10.2022.